Begin typing your search above and press return to search.

వెంకీతో నాని?

వెంకీ అనగానే విక్టరీ వెంకటేష్ అనుకోకండి. నాని మరో మల్టీస్టారర్ చేయబోతున్నాడని భావించకండి.

By:  Garuda Media   |   14 Feb 2026 12:00 AM IST
వెంకీతో నాని?
X

వెంకీ అనగానే విక్టరీ వెంకటేష్ అనుకోకండి. నాని మరో మల్టీస్టారర్ చేయబోతున్నాడని భావించకండి. ఈ వెంకీ హీరో కాదు.. దర్శకుడు. ముందు నటుడిగా అరంగేట్రం చేసి.. ఆపై ‘తొలి ప్రేమ’ చిత్రంతో దర్శకుడిగా మెప్పించిన వెంకీ అట్లూరి.. తన కొత్త సినిమాను నేచురల్ స్టార్ నానితో చేయాలని చూస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం వెంకీ.. తమిళ సీనియర్ స్టార్ సూర్యతో ఒక ఫ్యామిలీ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘విశ్వనాథం అండ్ సన్స్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. దాని తర్వాత నానితో జట్టు కట్టబోతున్నాడట వెంకీ. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుందట. వెంకీకి హోం బేనర్‌లా మారిపోయిన సితార ఎంటర్టైన్మెంట్స్‌లో ఈ చిత్రం తెరకెక్కే అవకాశముంది.

ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’లో నటిస్తున్నాడు. అది ఈపాటికే పూర్తి కావాల్సింది. కానీ ఆలస్యమైంది. ఆగస్టు 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. వేసవికల్లా ఈ సినిమాను పూర్తి చేసి.. సుజీత్ దర్శకత్వంలో సినిమాను మొదలుపెడతాడు నాని. అది ఈ ఏడాది చివరికి పూర్తి కావచ్చు. ఈలోపు వెంకీ.. నాని సినిమా కోసం స్క్రిప్టు పూర్తి చేసి రెడీగా ఉంటాడు. నానితో సినిమా చేయాలని ఇంతకుముందే ప్రయత్నించాడు వెంకీ. కానీ కుదరలేదు.

‘సార్’, ‘లక్కీ భాస్కర్’ సినిమాలతో తన స్థాయిని ఎంతో పెంచుకున్నాడు వెంకీ. ఈ నేపథ్యంలోనే సూర్య లాంటి పెద్ద హీరో తనతో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. ‘ది ప్యారడైజ్’తో నాని లెవెల్ మారుతుందని భావిస్తున్నారు. ఇలాంటి సినిమా తర్వాత నానిని డైరెక్ట్ చేయడం అంటే వెంకీకి కూడా మంచి అవకాశమే. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.