Begin typing your search above and press return to search.

వ‌ర్కింగ్ హ‌వ‌ర్స్ పై న‌టీన‌టుల‌కు వెంకీ అట్లూరి సూచ‌న‌!

ప్రస్తుతం టాలీవుడ్ ట్రెండ్ దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇండస్ట్రీలకతీతంగా నటీనటులు పాన్-ఇండియా ప్రాజెక్టులతో ఒకరి చిత్రాల్లో మరొకరు నటిస్తూ ముందుకు సాగుతున్నారు.

By:  Srikanth Kontham   |   31 July 2026 7:00 PM IST
వ‌ర్కింగ్ హ‌వ‌ర్స్ పై న‌టీన‌టుల‌కు వెంకీ అట్లూరి సూచ‌న‌!
X

ప్రస్తుతం టాలీవుడ్ ట్రెండ్ దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇండస్ట్రీలకతీతంగా నటీనటులు పాన్-ఇండియా ప్రాజెక్టులతో ఒకరి చిత్రాల్లో మరొకరు నటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటులు టాలీవుడ్‌లో పనిచేసే విధానంపై దర్శకుడు వెంకీ అట్లూరి చేసిన వ్యాఖ్యలు సినీ వ‌ర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇతర పరిశ్రమల నుంచి వచ్చే నటీనటులు తెలుగు సినిమా పనితీరుకు, ఇక్కడి సంస్కృతికి తగ్గట్టుగా మలచుకోవాలని అభిప్రాయ‌పడ్డారు. టాలీవుడ్ మేకింగ్ స్టైల్, వేగం, కష్టపడే తత్త్వం చాలా భిన్నంగా ఉంటుందని వెంకీ అట్లూరి పేర్కొన్నారు.

ముఖ్యంగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చే నటీనటులు ఇక్కడి వాతావరణానికి, పనిగంటలకు అలవాటు పడటం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. తెలుగు చిత్రసీమలో పనిచేసే విధానం చాలా పట్టుదలతో, వేగంగా సాగుతుందని సమయపాలనను అర్థం చేసుకోవడం ముఖ్యమని తెలిపారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి రవీనా టండన్ అనుభవాన్ని ఓ ఉదాహరణగా ప్రస్తావించారు. గతంలో టాలీవుడ్‌లో ఓ ప్రాజెక్ట్ కోసం పని చేసినప్పుడు రవీనా టండన్ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఏకంగా 14 గంటల పాటు సుదీర్ఘంగా పనిచేశారని కొనియాడారు.

ఇక్కడి షెడ్యూల్స్, కష్టపడే తత్త్వానికి పూర్తి స్థాయిలో సకాలంలో స్పందించి అంకితభావం చూపించారని గుర్తు చేశారు. టాలీవుడ్ వర్కింగ్ కల్చర్‌కు నటులు ఎంత త్వరగా అడాప్ట్ అవుతారనేదానికి ఇదే చక్కని నిదర్శనమని చెప్పారు. అలాగే దీపికా పదుకొణె వంటి అగ్ర నటీనటుల పనితీరు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. పాన్-ఇండియా సినిమాల స్థాయిలో పని చేసేటప్పుడు ఇలాంటి మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే పద్ధతులకు, తెలుగు చిత్రసీమలో ఉండే వర్కింగ్ హవర్స్, డెడికేషన్‌కు వ్యత్యాసం ఉంటుందని దానిని సీనియర్ నటీనటులు అర్థం చేసుకోవడం ద్వారానే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు.

దర్శకుడిగా తాను పనిచేసే సినిమాల్లో నటీనటుల నుంచి పూర్తి స్థాయి సహకారాన్ని కోరుకుంటానని టాలీవుడ్ లో ప్రొడక్షన్ వేగవంతంగా ఉంటుందన్నారు. వేరే ఇండస్ట్రీ నుంచి వ‌స్తున్నా? తెలుగు సినిమా ప్రమాణాలకు తగినట్లుగా నటులు పనితీరును మార్చుకోవడం వల్ల దర్శకుడికి పనులు సులువు అవుతాయని పేర్కొన్నారు. అలా ఉన్న ప్పుడు ఏ సినిమా అయినా మంచి ఫ‌లితాలు సాధించ‌డానికి అవ‌కాశం ఉంటుంది. కొత్త‌గా వ‌చ్చే వారికి అవ‌కాశాలు రావాల‌న్నా? పాత వారికి కొత్త అవ‌కాశాలు రావాల‌న్నా? విజ‌యం ఒక్క‌టే మార్గ‌మ‌న్నారు.

ప్ర‌స్తుతం వెంకీ అట్లూరి సూర్య హీరోగా `విశ్వ‌నాద్ అండ్ స‌న్స్` తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సూర్య‌కు ఇదే తొలి తెలుగు సినిమా. ఈ సినిమా విజ‌యం సాధిస్తే సూర్య తెలుగు మార్కెట్ పై మ‌రింత దృష్టి పెట్టే అవ‌కాశం ఉంది. మ‌రో పాన్ ఇండియా అటెంప్ట్ తెలుగు నుంచే చేసే అవ‌కాశం లేక‌పోలేదు. తొలి పాన్ ఇండియా చిత్రం కోలీవుడ్ నుంచి చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ `కంగువ` బాక్సాఫీస్ వ‌ద్ద అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది.