Begin typing your search above and press return to search.

రవితేజ 'శ్రీను' కాస్త 'వెంకీ' అయ్యాడట!

శ్రీను వైట్ల ఈ విషయం గురించి ఇతర యూనిట్‌ సభ్యులతో చర్చించిన సమయంలో చాలా మంది ఆయన అభిప్రాయంతో ఏకీభవించారు.

By:  Tupaki Desk   |   7 Jun 2025 10:00 PM IST
రవితేజ శ్రీను కాస్త వెంకీ అయ్యాడట!
X

రవితేజ కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్‌ చరిత్రలోనూ బెస్ట్‌ కామెడీ సినిమాల్లో 'వెంకీ' ఒకటిగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. వెంకీ సినిమా వచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా స్నేహా నటించిన విషయం తెల్సిందే. రవితేజ, స్నేహ కాంబోలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా సినిమాలోని కామెడీ సీన్స్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇండస్ట్రీలో రవితేజ స్థాయిని మరింత పదిలం చేసిన సినిమాగా వెంకీ నిలిచింది. అలాంటి వెంకీ వెనుక చాలా కథలు ఉన్నాయని దర్శకుడు శ్రీను వైట్ల చెప్పుకొచ్చాడు.

'వెంకీ' సినిమా గురించి దర్శకుడు శ్రీనువైట్ల కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టైటిల్‌ వెనుక ఉన్న ఒక స్టోరీని చెప్పుకొచ్చాడు. వెంకీ సినిమా కథను రాసుకున్న సమయంలో హీరో పాత్ర పేరు వెంకీ అని కాకుండా శ్రీను అని రాసుకున్నాం. షూటింగ్‌ సమయంలోనూ హీరో పేరు శ్రీను అన్నట్లుగానే షూటింగ్‌ చేశాం. టైటిల్‌గా కూడా శ్రీను అనుకున్నాం. సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయిన తర్వాత సినిమాకు టైటిల్‌గా శ్రీను కాకుండా మరేదైనా పెడితే బాగుంటుంది అనుకున్నాను. శ్రీను టైటిల్‌తో అంతకు ముందు సినిమా ఉండటంతో పాటు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని దర్శకుడు శ్రీనువైట్ల గుర్తించాడట.

శ్రీను వైట్ల ఈ విషయం గురించి ఇతర యూనిట్‌ సభ్యులతో చర్చించిన సమయంలో చాలా మంది ఆయన అభిప్రాయంతో ఏకీభవించారు. శ్రీను అని కాకుండా వెంకీ అని టైటిల్‌గా పెడదామని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాకు వెంకీ అనే టైటిల్‌ను పెట్టాలని అనుకున్న సమయంలో ఒక హీరో పేరునున ఈ సినిమాకు టైటిల్‌ గా పెట్టడం అనేది ఎంత వరకు కరెక్ట్‌ అనే సందేహాన్ని వ్యక్తం చేశాడట. దాంతో శ్రీనువైట్ల మళ్లీ ఆలోచనలో పడ్డాడు. ఆ సమయంలో రవితేజ సైతం వెంకీ టైటిల్‌ వైపు మొగ్గు చూపడంతో చివరకు ఈ సినిమాకు వెంకీ అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది, ఆ టైటిల్‌తోనే విడుదల చేయడం జరిగిందని శ్రీనువైట్ల చెప్పుకొచ్చాడు.

షూటింగ్‌ సమయంలో హీరో పేరు శ్రీను అయినప్పటికీ డబ్బింగ్‌ సమయంలో శ్రీను కాస్త వెంకీగా మారాడు. వెంకీ అంటే ఇప్పటికీ టాలీవుడ్‌లో ఒక బ్రాండ్‌ అన్నట్లుగా నిలిచింది. వెంకీ సినిమాను ఎంతో మంది స్టార్స్‌, సెలబ్రిటీలు సైతం ఇష్టపడుతారు. వెంకీ సినిమా తర్వాత దర్శకుడు శ్రీనువైట్లకు చాలా మంచి ఆఫర్లు వచ్చాయి. ఆ స్థాయి కామెడీతో మాత్రం శ్రీనువైట్ల మెప్పించలేక పోయాడు. వెంకీ సినిమాలోని రైలు కామెడీ సీన్స్ ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఆ సీన్స్‌ను పేరడీ చేస్తూ చాలా సినిమాల్లో కామెడీ సీన్స్ తీశారు. కానీ వెంకీ ట్రైన్‌ సీన్స్‌ను ఏ ఒక్క సినిమాలోని కామెడీ సీన్స్ బీట్‌ చేయలేక పోయాయి అనడంలో సందేహం లేదు.