ఆ ఇద్దరిని కలిపి నవ్వుల ఫీస్ట్‌కు అనిల్ రెడీ?
వెంకీతో పాటు మెగాస్టార్ కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదన్నది అందరికి తెలిసిందే.
By: Tupaki Desk | 20 Jun 2025 4:00 PM ISTవిక్టరీ వెంకటేష్‌తో అనిల్ రావిపూడి తెరకెక్కించిన కామెడీ ఫ్యామిలీ డ్రామా 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడంతో అనిల్ టాలెంట్ కు, వెంకీ కామెడీకి మెచ్చి ఊహించిన విధంగా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిపి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించారు. వెంకీ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీరియస్ సినిమాలకు మించి కామెడీని పండించడంలో వెంకీ శైలి ప్రత్యేకం.
వెంకీతో పాటు మెగాస్టార్ కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదన్నది అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిస్తే నవ్వుల జాతరే. దాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి నిజం చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి బ్లాక్ బస్టర్ తరువాత అనిల్ రావిపూడి తన తదుపరి మూవీని మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నవిషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని ఓ 'లాప్టర్ రైడ్'గా తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ వీడియోలతో సినిమాపై అంచనాల్ని పెంచేసిన అనిల్ రావిపూడి మరో సర్‌ప్రైజ్‌కు రెడీ అవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
'సంక్రాంతికి వస్తున్నాం'తో వింటేజ్ వెంకీని పరిచయం చేసిన అనిల్ తాజా మూవీతో చిరుని సరికొత్తగా ప్రజెంట్ చేస్తే నవ్వులు పూయించబోతున్నాడట. ఇందు కోసం వెంకటేష్ చేత ఓ కీలకమైన క్యారెక్టర్‌ని చేయించాలని ప్లాన్ చేశాడని, ఇప్పటికే వెంకీని కూడా ఒప్పించాడని ఇన్ సైడ్ టాక్. ఇప్పటి వరకు టీమ్ ముస్సోరీలో షూటింగ్ చేసింది. దీంతో సెకండ్ షెడ్యూల్ పూర్తయిందట. త్వరలో హైదరాబాద్‌లో మూడవ షెడ్యూల్‌ని ప్రారంభించబోతున్నారు. ఈ షెడ్యూల్‌లోనే విక్టరీ వెంకటేష్ అడుగుపెడతారని తెలిసింది.
ఇందులో సెకండ్ హీరోయిన్‌గా కేథరిన్ నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్, డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాకు తన మ్యూజిక్‌తో బ్యాక్ బోన్‌గా నిలిచిన భీమ్స్ ఈ మూవీకి కూడా సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ టైమ్ చిరుకు మ్యూజిక్ చేసే అవకాశం రావడంతో భీమ్స్ ట్యూన్స్ ని ఓ రేంజ్‌లో అదరగొట్టాడని, ఇవి సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
