ఎటూ తేల్చుకోలేకపోతున్న వెంకీ
సీనియర్ హీరోల్లో ఎవరికీ సాధ్యం కాని రూ. 300 కోట్ల మార్క్ ను ఖాతాలో వేసుకున్న వెంకటేష్ తన తర్వాతి సినిమా విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు.
By: Tupaki Desk | 17 April 2025 11:30 AMసీనియర్ హీరోల్లో ఎవరికీ సాధ్యం కాని రూ. 300 కోట్ల మార్క్ ను ఖాతాలో వేసుకున్న వెంకటేష్ తన తర్వాతి సినిమా విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. అనిల్ రావిపూడితో చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకీకి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన విషయం తెలిసిందే. దీంతో ఆ సక్సెస్ ను ఎలాగైనా కంటిన్యూ చేయాలని వెంకీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో వెంకటేష్ సినిమా అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి కానీ అది కేవలం పుకారేనని త్రివిక్రమ్ సన్నిహిత వర్గాలంటున్నాయి. త్రివిక్రమ్ బన్నీతో సినిమా చేయాలని చూస్తున్నాడు. అట్లీ సినిమా వల్ల లేటైనా సరే వెయిట్ చేసి మరీ అల్లు అర్జున్‌తోనే సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట త్రివిక్రమ్. కుదిరితే అట్లీ సినిమాతో పాటూ త్రివిక్రమ్ సినిమాను కూడా సమాంతరంగా చేసేలా బన్నీ ఆలోచిస్తున్నాడట. కాబట్టి వెంకీతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ వచ్చేసినట్టే.
అయితే సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకీకి కథ చెప్పి ఓకే చేయించుకోవడం చాలా కష్టంగా మారిందని ఆయనకు కథ చెప్పిన డైరెక్టర్లు అంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సక్సెస్ దక్కడంతో ఆ సక్సెస్ ను ఎలాగైనా నిలుపుకోవాలని, అలా నిలుపుకోవాలంటే దానికి మించిన సినిమా తీయాలని వెంకీ అనుకుంటున్నారట.
రీసెంట్ గా సామజవరగమన రైటర్ నందు చెప్పిన కథ వెంకీని బాగా ఇంప్రెస్ చేసిందని తెలుస్తోంది. కానీ ఆ కథకు డైరెక్టర్ గా ఎవరిని తీసుకోవాలనే సందిగ్ధంలో ఉన్నారట వెంకీ. బాలయ్య, చిరంజీవి లాగా వెంకీ స్పీడ్ గా సినిమాలను ఒప్పేసుకోకుండా కాస్త లేటైనా మంచి సినిమాతోనే ఆడియన్స్ ముందుకు రావాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే చిరూ- అనిల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తున్నారని టాక్ వచ్చింది. మరి అందులో వెంకీ ఎంత సేపు కనిపిస్తాడనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
ఇదిలా ఉంటే వెంకీ చేస్తున్న రానా నాయుడు2 షూటింగ్ ఆఖరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే డబ్బింగ్ ను కూడా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. రానా నాయుడు కు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకుని రానా నాయుడు2ని జాగ్రత్తగా తెరకెక్కించారంటున్నారు. ఈ సిరీస్ షూటింగ్ జరుగుతున్నప్పటికీ వెంకీ తర్వాత చేయబోయే సినిమాపై ఫ్యాన్స్ కు ఎంతో ఆసక్తి నెలకొంది. సంక్రాంతికి వస్తున్నాం రిలీజై మూడు నెలలవుతున్నా వెంకీ తన నెక్ట్స్ మూవీని ఫిక్స్ చేయకపోవడం చూస్తుంటే వెంకీ ఎటూ తేల్చుకోలేని పొజిషన్ లో ఉన్నారని అర్థమవుతుంది.