వీరమల్లు-2.. సాధ్యమేనా?
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ‘హరిహర వీరమల్లు’. కానీ సినిమాకు టాక్ అంత గొప్పగా లేదు.
By: Tupaki Desk | 26 July 2025 12:00 AM ISTసుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ‘హరిహర వీరమల్లు’. కానీ సినిమాకు టాక్ అంత గొప్పగా లేదు. ప్రథమార్ధం వరకు బాగానే అనిపించినా.. తర్వాత సినిమా అంచనాలకు తగ్గట్లు సాగలేదు. సినిమా చివరికి వచ్చేసరికి ప్రేక్షకులను నిరుత్సాహం ఆవహించేసింది. ఏ సినిమాకైనా ప్రథమార్ధం అటు ఇటుగా ఉన్నా.. ద్వితీయార్ధం, ముఖ్యంగా ముగింపు బాగుండడం ఎంతో అవసరం. అప్పుడే ప్రేక్షకులకు మంచి అనుభూతి కలుగుతుంది.సినిమా మీద సానుకూల అభిప్రాయం కలుగుతుంది.
కానీ ఈ సినిమా విషయంలో అది జరగలేదు. అందుకే ఎక్కువగా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. క్లైమాక్స్‌లో ఏదో ఊహించుకుంటే అదంతా పక్కన పెట్టి తుపాను నేపథ్యంలో ఏదో యానిమేషన్ వీడియో చేసినట్లు లాగించేశారు. పతాక సన్నివేశాల్లో ఏం కోరుకున్నామో అదంతా ‘హరిహర వీరమల్లు’ పార్ట్-2 ‘యుద్ధభూమిలో చూసుకోమని సెలవిచ్చాడు దర్శకుడు జ్యోతికృష్ణ.
ఐతే ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ‘వీరమల్లు-2’ సాధ్యమవుతుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఎప్పుడైనా సరే.. హిట్ సినిమాలకే సీక్వెల్స్ తయారవుతాయి. రిలీజ్‌కు ముందు, రిలీజ్ టైంలో సీక్వెల్ గురించి ఎంత ఊరించినా.. అంతిమంగా ఫలితాన్ని బట్టే రెండో భాగం తీయగలుగుతారు. తొలి భాగానికి సంతృప్తికర ఫలితం రానపుడు సీక్వెల్ తీయడానికి అడుగు ముందుకు పడదు.
ఐతే నిన్నటి ప్రెస్ మీట్లో ఇటు దర్శకుడు జ్యోతికృష్ణ, అటు హీరో పవన్ కళ్యాణ్ ‘వీరమల్లు-2’ గురించి ప్రస్తావించారు. రెండో భాగానికి సంబంధించి 25-30 శాతం చిత్రీకరణ కూడా పూర్తయినట్లు స్వయంగా పవనే వెల్లడించాడు. ఐతే సీక్వెల్ తీయడం ప్రధానంగా పవన్ చేతుల్లోనే ఉంది. ‘వీరమల్లు’ పూర్తి చేయడానికి ఆయనెంత ఇబ్బంది పడ్డారో తెలుసు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను ముగించి, ఇక సినిమాలకు స్వస్తి చెప్పే ఆలోచనతో ఉన్నట్లు ఇప్పటిదాకా పవన్ సంకేతాలిస్తూ వచ్చాడు.
అలాంటపుడు వీరమల్లు-2 కోసం ఆయన డేట్లు ఇస్తాడా అన్నది ప్రశ్న. దాని మీద రత్నం డబ్బులు పెట్టడానికి సిద్ధమా అన్నది మరో ప్రశ్న. అన్నింటికీ మించి ‘వీరమల్లు’ అంతిమంగా మంచి ఫలితం అందుకుంటుందా అనే క్వశ్చనూ ఉంది. అన్నీ కుదిరి నిజంగా ‘వీరమల్లు-2’ సాధ్యమవుతుందా అన్నది సందేహమే.
