ధర్మ పోరాటం.. 'హరి హర వీరమల్లు'పై పవన్ కళ్యాణ్ స్పెషల్ నోట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు అందుకుంది.
By: Tupaki Desk | 24 July 2025 2:47 PM ISTటాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యంత హైప్ క్రియేట్ చేసిన చిత్రం 'హరి హర వీరమల్లు'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు అందుకుంది. చారిత్రక నేపథ్యంతో సనాతనధర్మ పోరాటం కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరిట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్‌లు, పాటలు, ఈవెంట్‌లు, ప్రమోషన్స్ అన్ని సినిమాపై బజ్ పెంచడంలో టీమ్ విజయం సాధించింది.
ఈ సినిమాకు సంబంధించి ముఖ్యమైన విషయమేంటంటే.. ఇది సాధారణంగా మనం చూసే కమర్షియల్ మాస్ సినిమాకు భిన్నంగా దేశ చరిత్రలోని మరచిపోయిన చీకటి కోణాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా మొఘల్ పాలనలో హిందువులు ఎదుర్కొన్న అణచివేతను, ధర్మాన్ని కాపాడేందుకు పోరాడిన నిజమైన యోధులను ఫోకస్ చేసింది. కథ మొత్తం పవన్ కళ్యాణ్ పోషించిన వీరమల్లు పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆయన నటన, లుక్, యాక్షన్ ఎప్పటిలానే అదిరిపోయాయనే టాక్ క్రియేట్ అయ్యింది.
ఇదిలా ఉండగా, రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ తన ట్విటర్‌లో స్పెషల్‌గా ఓ పోస్ట్ పెట్టారు. సాధారణంగా ఆయన సినిమాల గురించి సోషల్ మీడియాలో పెద్దగా ప్రస్తావించారు. కానీ ఈసారి మాత్రం వీరమల్లు కథ, సినిమాలోని తన పాత్ర, కథ నేపథ్యంను ఎంతో ఇష్టపడి షూటింగ్ చేసినట్లు అర్ధమవుతుంది. జిజ్యా పన్ను, మొఘల్ పాలకుడు ఔరంగజేబు హిందువులపై విధించిన ఆపదలు, కోహినూర్ వజ్రం దోపిడీ వంటి చారిత్రక అంశాలను ప్రస్తావిస్తూ, వీరమల్లు సినిమా ఈ అసత్యాలను బయటపెడుతుందని స్పష్టం చేశారు.
‘‘మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హిందువులు తమ విశ్వాసాన్ని ఆచరిస్తున్నందుకు విధించిన శిక్షాత్మక పన్ను అయిన జిజియా పన్ను, అణచివేతకు నిలువెత్తు చిహ్నంగా నిలుస్తుంది, అయినప్పటికీ చరిత్రకారులు చాలా కాలంగా దాని క్రూరత్వాన్ని తగ్గించారు. ఇతిహాసంలో మొఘల్ పాలనలో హిందువుల మీద విధించిన జిజ్యా పన్ను దాడి, అన్యాయానికి ప్రతీక. కానీ చాలామంది చరిత్రకారులు దీన్ని మృదువుగా వివరించడమే జరిగింది. మన సినిమా మాత్రం ఈ దుర్మార్గాన్ని బలంగా బయటపెడుతుంది. దేశ సంపదను, హిందువుల బాధను చూపిస్తూ.. ధర్మాన్ని కాపాడిన గొప్ప యోధుల వీరత్వాన్ని శ్రద్ధాపూర్వకంగా స్మరిస్తుంది’’ అంటూ పవన్ కళ్యాణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ ట్వీట్ చూస్తే, పవన్ ఈ సినిమాను ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా కాకుండా.. తన నిజమైన సనాతన, జీవనవిధానాన్ని ప్రతిబింబించే కథగా భావించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆయన నటుడిగా మాత్రమే కాకుండా, నిజ జీవితంలో కూడా తనను తాను ‘సనాతని’గా చెప్పుకోవడం తెలిసిందే. వీరమల్లు పాత్రలో ఆయన ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని, ధర్మాన్ని నమ్మే శక్తిని చూపించేందుకు పవన్ గర్వంగా ముందుకు వచ్చారు.
ఇటీవలి కాలంలో పవన్ తన సినిమాల గురించి సోషల్ మీడియాలో ఇలా మాట్లాడిన సందర్భాలు అరుదు. ఈసారి మాత్రం, కథలోని ధర్మ పోరాటం, సనాతన విలువలు, దేశ చరిత్ర గురించి చెప్పే విధానం పవన్‌ను అలరిస్తే, ఆయన అభిమానులను, సాధారణ ప్రేక్షకులను కూడా ఆలోచింపజేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ట్వీట్‌తో సినిమా బజ్ మరింత పెరిగింది.
