విశ్వంభర దర్శకుడికి నితిన్ ఇచ్చిన షాక్!
వశిష్ఠ దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో సుధాకర్ రెడ్డి.. నితిన్‌తో సినిమా చేయమని అడిగాడట.
By: Tupaki Desk | 14 April 2025 12:44 PM ISTఒక దర్శకుడు తొలి సినిమాను పట్టాలెక్కించడానికి పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొత్త దర్శకులను నమ్మి సినిమాలు చేసే హీరోలు, నిర్మాతలు తక్కువమందే ఉంటారు. కథ నచ్చినా అన్నీ సిద్ధమై సినిమా చిత్రీకరణకు వెళ్లడం అంటే పెద్ద టాస్కే. ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్న ఎంతోమంది ఇలా ఎన్నో కష్టాల తర్వాత తొలి అవకాశం అందుకున్నవాళ్లే. బ్లాక్ బస్టర్ మూవీ బింబిసారతో దర్శకుడిగా పరిచయమై, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చేస్తున్న వశిష్ఠ వెనుక కూడా ఇలాంటి కథలు చాలానే ఉన్నాయి.
చాలా ఏళ్ల కిందటే అల్లు శిరీష్ హీరోగా ఫాంటసీ సైఫై థ్రిల్లర్ మూవీ ఒకటి అనౌన్స్ చేశారు వశిష్ఠ దర్శకత్వంలో. కానీ అది పట్టాలెక్కలేదు. వేరే ప్రాజెక్టులు కూడా ఓకే అయినట్లే అయి వెనక్కి వెళ్లాయి. అందులో నితిన్ సినిమా కూడా ఒకటట. ఢీ సహా కొన్ని చిత్రాలను నిర్మించిన వశిష్ఠ తండ్రి మల్లిడి సత్యనారాయణరెడ్డి.. ఒక ఇంటర్వ్యూలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తమను ఎలా మోసం చేశాడో వివరించడం గమనార్హం.
వశిష్ఠ దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో సుధాకర్ రెడ్డి.. నితిన్‌తో సినిమా చేయమని అడిగాడట. ఆ చిత్రానికి నిర్మాతను కూడా తామే సెట్ చేసుకున్నామని.. నితిన్‌కు రూ.75 లక్షలు, సినిమాటోగ్రాఫర్ ఛోటా కే నాయుడికి రూ.10 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చామని సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. వశిష్ఠ చెప్పిన కథ సంతృప్తినివ్వకపోవడంతో వేరొకరి దగ్గర్నుంచి కథ కూడా తమతో కొనిపించారని.. ఇలా మొత్తం రూ.2 కోట్ల దాకా ఖర్చయిందని.. తనకు పరిచయమున్న మిత్రుడి ప్రొడక్షన్లో ఈ సినిమా చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నామని సత్యనారాయణ తెలిపారు.
ఐతే ఇంతలో అఆ సినిమా రిలీజై పెద్ద హిట్టయిందని.. దీంతో నితిన్, ఆయన తండ్రి మనసు మారిపోయిందని ఆయన చెప్పారు. నితిన్ రేంజ్ పెరిగిపోయిన నేపథ్యంలో కొత్త దర్శకుడితో సినిమా చేస్తే బాగుండదని అనుకున్నారని.. తాను సెట్ చేసిన నిర్మాతనే పిలిచి పూరి దర్శకత్వంలో సినిమా చేయడానికి డబ్బులు పెట్టాలని అడిగారని.. కానీ ఆయన అందుకు అంగీకరించకుండా డబ్బులు వెనక్కి ఇచ్చేయమని చెప్పేశారని.. తన కొడుకు సినిమాను పక్కన పెట్టి అప్పుడు నితిన్ చేసిన సినిమానే హార్ట్ ఎటాక్ అని తెలిపారు.