Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరోకు ఊహించ‌ని గిఫ్టునిచ్చిన భార్య‌

ఎవరైనా స‌రే త‌మకు ఇష్ట‌మైన వారి పుట్టిన‌రోజుకు గిఫ్టులు, స‌ర్‌ప్రైజులు ఇవ్వ‌డం మామూలే.

By:  Tupaki Desk   |   23 July 2025 11:36 AM IST
టాలీవుడ్ హీరోకు ఊహించ‌ని గిఫ్టునిచ్చిన భార్య‌
X

ఎవరైనా స‌రే త‌మకు ఇష్ట‌మైన వారి పుట్టిన‌రోజుకు గిఫ్టులు, స‌ర్‌ప్రైజులు ఇవ్వ‌డం మామూలే. అయితే ఆ గిఫ్టులు కొన్నిసార్లు వారికి న‌చ్చితే మ‌రికొన్ని సార్లు న‌చ్చ‌వు. కొన్ని స‌ర్‌ప్రైజింగ్ గా ఉంటే మ‌రికొన్ని ఆశ్చ‌ర్యంగా, ఊహించ‌లేనివిగా ఉంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లోని ఓ యంగ్ హీరోకు త‌న భార్య కూడా అలాంటి స‌ర్‌ప్రైజింగ్ గిఫ్టే ఇచ్చారు.


టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట‌ల్లో వ‌రుణ్ సందేశ్, వితికా జంట కూడా ఒక‌టి. జులై 21న వ‌రుణ్ పుట్టిన రోజుకు అత‌ని భార్య మ‌ర్చిపోలేని గిఫ్టును బ‌హుక‌రించారు. దాన్ని చూసిన హీరో ఆనందంలో మునిగిపోవ‌డంతో పాటూ అస‌లు ఆ గిఫ్టును ఊహించ‌లేద‌ని, ఇప్ప‌టికీ దాన్ని న‌మ్మ‌లేక‌పోతున్నాన‌ని చెప్తూ ఓ పోస్ట్ చేశారు.


అయితే వ‌రుణ్ కు వితికా ఇచ్చిన ఆ గిఫ్ట్ మ‌రేదో కాదు. ఓ కొత్త ఇల్లు. అవును, వ‌రుణ్ సందేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా వితికా షేరు అత‌నికి కొత్త ఇంటిని బ‌హుమ‌తిగా ఇచ్చారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డిస్తూ భార్య‌తో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకున్న బ‌ర్త్ డే ఫోటోల‌ను షేర్ చేస్తూ త‌న ఆనందాన్ని పంచుకున్నారు వ‌రుణ్ సందేశ్.


బ‌ర్త్ డేకు ఇల్లు కొనిచ్చిన‌ప్పుడే నేను ధ‌న్యుడిని అయిపోయాన‌ని, ఈ నిజం ఇంకా ఆశ్చ‌ర్యంగానే ఉంద‌ని, ఇప్ప‌టికీ దాన్ని న‌మ్మ‌లేక‌పోతున్నాన‌ని, ఇది కేవ‌లం గిఫ్ట్ మాత్ర‌మే కాద‌ని, ఓ కొత్త చాప్ట‌ర్ కు నాంది అని, నీ స‌ర్‌ప్రైజులు ప్ర‌తీసారీ ఆశ్చ‌ర్య‌పరుస్తూనే ఉంటాయ‌ని, అన్ని విష‌యాల్లో స‌పోర్ట్ చేస్తూ ఉన్నందుకు నిన్ను చూసి చాలా గ‌ర్వ‌ప‌డుతున్నానంటూ భార్య‌ను ఉద్దేశించి వ‌రుణ్ చేసిన పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుంది.


వ‌రుణ్ పోస్ట్ కు ప‌లువురు వారికి శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తున్నారు. వ‌రుణ్- వితికా ప‌డ్డానండీ ప్రేమ‌లో మ‌రి సినిమా షూటింగులో మొద‌టిసారి క‌లుసుకున్నారు. ఆ షూటింగ్ టైమ్ లోనే వీరిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డి అది కాస్తా ప్రేమ‌గా మారి ఆ త‌ర్వాత పెళ్లి వ‌ర‌కు వెళ్లింది. ఆ త‌ర్వాత ఇరు కుటుంబాల పెద్ద‌ల‌ను ఒప్పించి 2016లో వీరిద్ద‌రూ పెళ్లితో ఒక్క‌ట‌య్యారు.