Begin typing your search above and press return to search.

మెగా ప్రిన్స్‌తో పాటు అత‌నికీ అగ్నీ ప‌రీక్షేనా?

ఇది ఊహించ‌ని విధంగా షాక్ ఇచ్చింది. పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాపై కూడా వ‌రుణ్ తేజ్ భారీ ఆశ‌లు పెట్టుకున్నాడు.

By:  Tupaki Desk   |   16 Jun 2025 7:00 PM IST
మెగా ప్రిన్స్‌తో పాటు అత‌నికీ అగ్నీ ప‌రీక్షేనా?
X

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసిన వ‌రుణ్ తేజ్ కెరీర్ ప‌రంగా మాత్రం మెగా లెగ‌సీకి భిన్నంగా అడుగులు వేస్తూ వైవిధ్య‌మైన సినిమాల‌ని ఎంచుకుంటూ వెర్స‌టైల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కెరీర్ తొలి నాళ్ల నుంచి విభిన్న‌మైన క‌థ‌లు, మూవీని సెలెక్ట్ చేసుకుంటున్న వ‌రుణ్ తేజ్ ఆ స్థాయిలో మాత్రం స‌క్సెస్‌ల‌ని సొంతం చేసుకోలేక‌పోతున్నాడు. `గ‌ని` సినిమా నుంచి వ‌రుణ్ వ‌రుస ఫ్లాపులని ఎదుర్కొంటూ మెగా అభిమానుల్ని షాక్‌కు గురి చేస్తున్నాడు. భారీ కాస్టింగ్‌తో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచి షాక్ ఇవ్వ‌డం తెలిసిందే.

ఇక అనిల్ రావిపూడితో చేసిన 'ఎఫ్ 3' వ‌సూళ్ల ప‌రంగా ఫ‌ర‌వాలేదు అనిపించినా కంటెంట్ ప‌రంగా విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంది. బిజీ కాలం నాటి క‌థ‌గా దీనిపై ప‌లువురు సెటైర్లు వేయ‌డం తెలిసిందే. భారీ అంచ‌నాలు పెట్టుకుని ప్ర‌వీణ్ స‌త్తారుతో చేసిన 'గాంఢీవ‌ధారి అర్జున‌', కొత్త ద‌ర్శ‌కుడితో తెలుగు, హిందీ భాష‌ల్లో చేసిన 'ఆప‌రేష‌న్ వాలెంటైన్‌' డిజాస్ట‌ర్లుగా నిలిచి వ‌రుణ్ తేజ్ న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేశాయి. వీటి ఫ‌లితంతో కొంత నిరాశ‌కు గురైన వ‌రుణ్ తేజ్ `ప‌లాస‌` ఫేమ్ క‌రుణ కుమార్‌ని న‌మ్మి 'మ‌ట్కా' చేశాడు.

ఇది ఊహించ‌ని విధంగా షాక్ ఇచ్చింది. పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాపై కూడా వ‌రుణ్ తేజ్ భారీ ఆశ‌లు పెట్టుకున్నాడు. కానీ ఏ ద‌శ‌లోనూ ఈ సినిమా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఫ‌లితం వ‌రుణ్ ఖాతాలో మ‌రో డిజాస్ట‌ర్‌. గ‌ని నుంచి మ‌ట్కా వ‌ర‌కు వ‌రుస డిజాస్ట‌ర్లు ఎదుర‌వ్వ‌డంతో త‌దుప‌రి ప్రాజెక్ట్‌ని ప‌క్కాగా ప్లాన్ చేసుకున్న వ‌రుణ్ తేజ్ ఈ సారి హిట్టు కోసం మేర్ల‌పాక గాంధీని న‌మ్ముకున్నాడు. అంతే కాకుండా ఇదొక హార‌ర్ థ్రిల్ల‌ర్‌.

దీన్ని కొరియాలో షూట్ చేయ‌బోతున్నారు. దీనిపైనే వ‌రుణ్ ఆశ‌ల‌న్నీ. అయితే ఇక్క‌డ మ‌రో విష‌యం మెగా అభిమానుల్ని క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. అదే ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ. 'ఎక్స్‌ప్రెస్ రాజా' త‌రువాత మేర్ల‌పాక హిట్టు మాట విని చాలా కాలమే అవుతోంది. వ‌రుస ఫ్లాపుల్ని ఎదుర్కొన్న మేర్ల‌పాక గాంధీకి, అదే ట్రాక్ రికార్డ్‌తో ఉన్న వ‌రుణ్ తేజ్‌కు ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అగ్నిప‌రీక్ష‌గా మారింది. ఎలాగైనా ఈ సినిమాతో హిట్‌ని సొంతం చేసుకుని మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావాల‌ని వీరిద్ద‌రు ట్రై చేస్తున్నారు. మ‌రి వీరిద్ద‌రు తాజా హార‌ర్ థ్రిల్ల‌ర్‌తో స‌క్సెస్ బాట ప‌డ‌తారా? అన్న‌ది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.