మెగా హీరోకు హారర్ థ్రిల్లర్ హిట్టిస్తుందా?
వరుస ఫ్లాపులతో ఆలోచనలో పడిన వరుణ్ తేజ్ ఇప్పుడు కొరియన్ థ్రిల్లర్‌ని నమ్ముకున్నాడు.
By: Tupaki Desk | 22 April 2025 5:00 PM ISTవరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మెగా హీరో వరుణ్ తేజ్. విభిన్నమైన కథలని ఎంచుకుంటూ మెగా హీరోలకు భిన్నంగా సినిమాలు చేసుకుంటూ హీరోగా ప్రత్యేకతను చాటుకున్న వరుణ్ తేజ్ గత కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్నాడు. `గద్దలకొండ గణేష్` తరువాత వరుణ్ తేజ్ హిట్ అనే మాట విని ఐదేళ్లకు పైనే అవుతోంది. వరుసగా కొత్త తరహా కథలని ఎంచుకుని సినిమాలు చేసినా అవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి.
కొత్త దర్శకుడితో చేసిన `గని` రిలీజైన రోజే భారీ డిజాస్టర్ అనిపించి షాక్ ఇచ్చింది. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రల్లో నటించినా సరైన కథ లేకపోవడంతో `గని` అట్టర్ ఫ్లాప్ అనిపించుకుని షాక్ ఇచ్చింది. అనిల్‌రావిపూడితో చేసిన `ఎఫ్ 3` ఫరావేదనిపించింది. కానీ విజయాన్ని మాత్రం అందించలేకపోయింది. ప్రవీణ్ సత్తారుతో చేసిన `గాండీవధారి అర్జున` కూడా వరుణ్ ఫ్లాపుల పరంపరకు బ్రేక్ ఇవ్వలేకపోయింది.
ఇక బాలీవుడ్ డైరెక్టర్‌ని నమ్ముకుని చేసిన `ఆపరేషన్ వాలెంటైన్` బిగ్ షాక్ ఇచ్చింది. గ్రాఫిక్స్ నాసిరకంగా ఉండటంతో చాలా వరకు విమర్శలు వెల్లువెత్తాయి. రీ ఈ స్థాయిలో గ్రాఫిక్స్ తో ఈ మూవీని చేయడం, వింగ్ కమాండర్ కథని ఊహించిన విధంగా సినిమాని దర్శకుడు తెరపైకి తీసుకురాలేకపోవడంతో ప్రేక్షకుల్ని ఏ విషయంలోనూ ఆకట్టుకోలేకపోయింది. హేమా హేమీలు కలిసి వర్క్ చేసినా విషయం లేకపోవడంతో వరుణ్‌కు ఈ సినిమా మరో డిజాస్టర్‌ని అందించి షాక్ ఇచ్చింది.
వరుస ఫ్లాపులతో ఆలోచనలో పడిన వరుణ్ తేజ్ ఇప్పుడు కొరియన్ థ్రిల్లర్‌ని నమ్ముకున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ హారర్ కామెడీ ఆధారంగా రూపొందుతున్న మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తన లోటి హీరోలు బ్లాక్ బస్టర్లని దక్కించుకుంటూ మార్కెట్‌ని పెంచుకుంటున్న వేళ వరుణ్ తేజ్ ఇంకా సక్సెస్ కోసం ఆపసోపాలు పడుతుండటం చర్చనీయాంశంగా మారింది. కొరియన్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ వర్క్ చేస్తున్న ఈ మూవీపై వరుణ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ హారర్ థ్రిల్లర్ కామెడీ అయినా కలిసి వస్తుందేమో చూడాలి.