Begin typing your search above and press return to search.

ఆ ఒక్క సినిమా ఇద్దరి ఫ్యూచర్‌ను డిసైడ్ చేయబోతుందా?

బాలీవుడ్‌లో మరోసారి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ల హవా మొదలవుతుందా? ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే చర్చ నడుస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   28 May 2026 11:24 AM IST
ఆ ఒక్క సినిమా ఇద్దరి ఫ్యూచర్‌ను డిసైడ్ చేయబోతుందా?
X

బాలీవుడ్‌లో మరోసారి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ల హవా మొదలవుతుందా? ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే చర్చ నడుస్తోంది. కారణం వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా హై జ‌వానీ తో ఇష్క్ హోనా హై. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా చుట్టూ మరింత ఆసక్తి పెరగడానికి ప్రధాన కారణం ఇద్దరు స్టార్ హీరోయిన్లు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్. టాలీవుడ్‌లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ ఇద్దరు భామలకు ప్రస్తుతం హిందీలో ఒక సాలిడ్ హిట్ అత్యవసరంగా మారింది. అందుకే ఈ సినిమా వాళ్ల కెరీర్‌లో కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా..

పూజా హెగ్డే గత కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ కమర్షియల్ హీరోయిన్‌గా బలమైన మార్కెట్‌ను ఏర్పరుచుకుంది. మరోవైపు మృణాల్ ఠాకూర్ సీతారామం తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు గ్లామర్ రోల్స్‌లో కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇద్దరికీ బాలీవుడ్ మాత్రం ఆశించిన స్థాయిలో కలిసి రాలేదు. వరుస అవకాశాలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు మాత్రం దక్కలేదు. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్, టాప్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ఉన్నా, ఆ క్రేజ్‌ను హిందీ మార్కెట్‌లో బ్లాక్‌బస్టర్‌గా మార్చుకోలేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ట్రైల‌ర్ త‌ర్వాత పెరిగిన ఆస‌క్తి

ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ట్రైలర్‌లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ఇద్దరి గ్లామర్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలిచింది. ఒకవైపు పూజా కమర్షియల్ స్టైల్ గ్లామర్‌తో ఆకట్టుకుంటే, మరోవైపు మృణాల్ తన క్లాస్ లుక్‌తో పాటు రొమాంటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ సినిమాలో గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్ రెండింటి మధ్య ఆసక్తికరమైన పోటీ కనిపించబోతుందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా డేవిడ్ ధావన్ తన వింటేజ్ రొమాంటిక్ కామెడీ ఫార్ములాను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారని, మంచి ఎంట‌ర్టైన్మెంట్ ను రీక్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ లో సౌత్ హీరోయిన్ల‌కు మంచి డిమాండ్

ఇప్పటికే బాలీవుడ్‌లో సౌత్ హీరోయిన్స్‌కు డిమాండ్ గణనీయంగా పెరిగింది. రష్మిక మందన్నా, సమంత, కియారా అద్వానీ వంటి హీరోయిన్లు పాన్ ఇండియా మార్కెట్‌లో తమ స్థాయిని పెంచుకున్న తర్వాత ఇప్పుడు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్‌లపై కూడా ఫోకస్ పెరిగింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్‌ను బాలీవుడ్ మార్కెట్‌గా మార్చుకోవాలని ఈ ఇద్దరు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌పై పూర్తి దృష్టి పెట్టారు.

జూన్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా రిజ‌ల్ట్ ఇప్పుడు కేవలం వరుణ్ ధావన్‌కే కాదు, పూజా హెగ్డే మరియు మృణాల్ ఠాకూర్ కెరీర్‌లకు కూడా ఎంతో కీలకంగా మారింది. వారికి ఒక భారీ హిట్ దక్కితే బాలీవుడ్‌లో మరిన్ని కమర్షియల్ ఆఫర్స్, భారీ ప్రాజెక్టులు దక్కే అవకాశం ఉంది. అదే సమయంలో సినిమా నిరాశపరిస్తే సోషల్ మీడియా క్రేజ్ ఉన్నా బాక్సాఫీస్ మార్కెట్ పరిమితమే అన్న అభిప్రాయం బలపడే అవకాశం కనిపిస్తోంది. దీంతో హై జ‌వానీ తో ఇష్క్ హోనా హై ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్స్‌కు నిజంగానే డూ ఆర్ డై ప్రాజెక్ట్‌గా మారిందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.