నంది అవార్డ్ లపై.. నిర్మాతకు వంశి నందిపాటి క్షమాపణ
సినిమా ఫంక్షన్లలో అప్పుడప్పుడు నోరు జారడం సహజమే కానీ, అది గౌరవప్రదమైన అవార్డుల మీద అయితే మాత్రం రచ్చ మామూలుగా ఉండదు. నిర్మాత వంశీ నందిపాటి చేసిన 'నంది-పంది' అనే కామెంట్స్ టాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపాయి.
By: Madhu Reddy | 26 Feb 2026 11:09 PM ISTసినిమా ఫంక్షన్లలో అప్పుడప్పుడు నోరు జారడం సహజమే కానీ, అది గౌరవప్రదమైన అవార్డుల మీద అయితే మాత్రం రచ్చ మామూలుగా ఉండదు. నిర్మాత వంశీ నందిపాటి చేసిన 'నంది-పంది' అనే కామెంట్స్ టాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపాయి. నటి లయకు వచ్చిన అవార్డుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో తప్పు తెలుసుకున్న వంశీ, తాజాగా ఈరోజు ఈవెంట్‌లో అందరికీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అసలు ఏం జరిగిందంటే..
నోరు జారిన వంశీ.. నెట్టింట భారీ ట్రోలింగ్:
ఇటీవల 'సాంప్రదాయిని సుద్దపూస' అనే మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌లో వంశీ నందిపాటి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి. నటి లయ గురించి మాట్లాడుతూ.. "నందులన్నీ పందుల్లా లయ వాళ్లింటికి వెళ్లిపోయాయి" అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డులను పందులతో పోల్చడంపై అటు సినీ వర్గాలు, ఇటు ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీపై విమర్శల వర్షం కురవడమే కాకుండా, విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది.
పొరపాటు జరిగింది.. నా ఉద్దేశం అది కాదు:
ఈ వివాదం ముదురుతుండటంతో, గురువారం జరిగిన 'హే బల్వంత్' సక్సెస్ మీట్‌లో వంశీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. "ఆ ఈవెంట్‌లో మాట దొర్లింది కానీ, అది నా సొంత స్టేట్‌మెంట్ కాదు. దాదాపు 12 ఏళ్ల క్రితం ఎవరో అన్న మాటను నేను కేవలం గుర్తు చేశానంతే. అది నా మాటగా తప్పుగా ప్రచారమైంది" అని ఆయన వివరణ ఇచ్చారు. తనకు దేవుడి మీద ఎంత భక్తి ఉందో, అవార్డుల మీద కూడా అంతే గౌరవం ఉందని వంశీ చెప్పుకొచ్చారు. తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరుతూ 'ఐ యామ్ రియల్లీ సారీ' అని వేడుకున్నారు.
అవార్డు అందుకోవాలన్నదే నా కల:
ఇంకా వంశీ మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి నంది లాంటి గొప్ప అవార్డును అందుకోవాలనే ఆశ ఉండేదని, ఆ కల కోసమే సినిమా పరిశ్రమలోకి వచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి గొప్ప అవార్డుల గురించి తాను తప్పుగా మాట్లాడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేవలం సందర్భం లేకుండా మాట్లాడటం వల్లే ఇలా జరిగిందని ఆయన క్లియర్ చేశారు. ఈ సక్సెస్ మీట్‌లో స్రవంతి చొక్కారపు, లావణ్యరెడ్డి వంటి వారు పాల్గొని వంశీకి మద్దతుగా నిలిచారు. మొత్తానికి క్షమాపణలతో ఈ వివాదానికి వంశీ నందిపాటి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
