Begin typing your search above and press return to search.

న్యూమోనియాతో స్టార్‌ నటుడు మృతి

హాలీవుడ్‌లో 'టాప్ సీక్రెట్‌', 'టాప్‌ గన్‌', 'బ్యాట్‌ మ్యాన్‌' తదితర సినిమాల్లో నటించి సూపర్‌ హిట్స్‌ను సొంతం చేసుకున్న నటుడు వాల్‌ కిల్మర్‌.

By:  Tupaki Desk   |   2 April 2025 12:00 PM IST
న్యూమోనియాతో స్టార్‌ నటుడు మృతి
X

హాలీవుడ్‌లో 'టాప్ సీక్రెట్‌', 'టాప్‌ గన్‌', 'బ్యాట్‌ మ్యాన్‌' తదితర సినిమాల్లో నటించి సూపర్‌ హిట్స్‌ను సొంతం చేసుకున్న నటుడు వాల్‌ కిల్మర్‌. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న వాల్‌ కిల్మర్‌ అమెరికాలోని లాస్ ఏంజల్స్‌లో ఏప్రిల్‌ 1న తుది శ్వాస విడిచారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో పాటు సుదీర్ఘ కాలంగా కిల్మర్‌ గొంతు క్యాన్సర్‌తో బాధ పడుతున్న కారణంగా తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. వాల్ కిల్మర్‌ మరణ వార్తను అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ మీడియా సంస్థలు దృవీకరించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మొదట ఆందోళన అంటూ వార్తలు వచ్చాయి, కొన్ని గంటల్లోనే మృతి చెందినట్లు కథనాలు వెలువడ్డాయి.

65 ఏళ్ల వయసులో మృతి చెందిన కిల్మర్‌ రెండేళ్ల క్రితం వరకు సినిమాలు చేస్తూ వచ్చారు. 2022లో టాప్‌ గన్‌ : మావెరిక్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా తర్వాత మళ్లీ వెండి తెరపై ఆయన కనిపించలేదు. క్యాన్సర్‌ చికిత్స పొందిన ఆయన కోలుకున్నట్లు అనిపించినా న్యూమోనియా కారణంగా శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కిల్మర్‌ తుది శ్వాస విడిచారు. కిల్మర్‌ మరణంపై హాలీవుడ్‌ సినీ ప్రముఖులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు, ఆయన అభిమానులు, బ్యాట్‌మ్యాన్‌ క్యారెక్టర్‌ ఫ్యాన్స్‌ సైతం సోషల్‌ మీడియా ద్వారా తమ సంతాపం తెలియజేస్తున్నారు.

1959 డిసెంబర్‌ 31న జన్మించిన కిల్మర్‌ 1984లో టాప్‌ సీక్రెట్‌ సినిమాతో హాలీవుడ్‌లో అడుగు పెట్టాడు. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ సినిమాతో మంచి పేరు రావడంతో వెంటనే రియల్‌ జీనియస్‌ సినిమాలో నటించాడు. ఆ సినిమా 1985లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలు ప్రాంచైజీ సినిమాల్లో నటించడంతో పాటు ఒకప్పుడు యూత్‌ను విపరీతంగా అలరించిన బ్యాట్‌మ్యాన్‌ సినిమాలోనూ నటించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. లాస్ ఏంజిల్స్‌లో జన్మించిన కిల్మర్‌ జులియార్డ్‌ స్కూల్‌లో చదివాడు. మొదట్లో యానిమేషన్‌ సినిమాలకు వాయిస్‌ ఓవర్ ఇస్తూ వచ్చేవాడు.

కిల్మర్‌ సూపర్‌ హిట్‌ సినిమాల్లో ది సాల్టన్‌ సీ, వండర్‌ ల్యాండ్‌, ది మిస్సింగ్‌, రెడ్‌ ప్లానెట్‌, ఎట్‌ ఫస్ట్‌ సైట్‌, సిస్ కిస్ బ్యాంగ్‌ బ్యాంగ్‌ సినిమాల్లో నటించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నాడు. 2014 నుంచి కొంతు క్యాన్సర్‌తో కిల్మర్‌ బాధ పడుతున్నారు. క్యాన్సర్‌ నుంచి బయట పడ్డ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించాడు. సుదీర్ఘ కాలం పాటు సినిమా ఇండస్ట్రీలో కొనసాగిన ఈయన లేని లోటు హాలీవుడ్‌లో ఎవరు తీర్చలేరు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.