మూడేళ్ల తర్వాత మెగా మేనల్లుడు.. పక్కా ప్లాన్ తోనే..
దాదాపు రెండున్నరేళ్లుగా ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు.
By: M Prashanth | 5 Jun 2026 12:10 PM ISTమెగా కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఉప్పెన మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన ఆయన, మొదటి ప్రయత్నంలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి క్రేజీ రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన రిజల్ట్స్ ఇవ్వకపోవడంతో ఆయన కెరీర్ ఒక్కసారిగా కాస్త స్లో అయిందని చెప్పాలి.
ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన కొండ పొలం, రంగ రంగ వైభవంగా, ఆదికేశవ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. ముఖ్యంగా 2023 నవంబర్ లో విడుదలైన ఆదికేశవ తర్వాత నుంచి ఇప్పటి వరకు కొత్త సినిమా ప్రకటించకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. దాదాపు రెండున్నరేళ్లుగా ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు.
సాధారణంగా హీరోల విషయంలో కొత్త కథలు వింటున్నారనే వార్తలు, దర్శకులతో చర్చలు జరుగుతున్నాయనే రూమర్లు వినిపిస్తుంటాయి. కానీ వైష్ణవ్ తేజ్ విషయంలో అలాంటి ఊహాగానాలు కూడా పెద్దగా కనిపించలేదు. దీంతో ఆయన సినిమాలకు దూరమవుతున్నారా అనే చర్చ కూడా సాగింది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, లాంగ్ బ్రేక్ వెనుక పక్కా ప్లాన్ ఉందని తెలుస్తోంది.
అయితే గత మూడు సంవత్సరాలుగా వందకు పైగా కథలు విన్న వైష్ణవ్ తేజ్.. వాటిని రిజెక్ట్ చేసినట్లు ఇప్పటికే టాక్ వినిపించింది. పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు ఆయనను సంప్రదించినప్పటికీ కథల విషయంలో ఆయన రాజీ పడలేదని సమాచారం. కెరీర్ లో వరుస పరాజయాలు ఎదురైన తర్వాత నెక్స్ట్ మూవీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైష్ణవ్ తేజ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే స్టోరీ, రోల్, డైరెక్టర్ వంటి విషయాలపై ఎక్కువ సమయం తీసుకుని నిర్ణయం తీసుకున్నారని వినికిడి
ఇప్పుడైతే ఆయన కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా హంట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మహేష్ ఎస్ చెప్పిన కథ వైష్ణవ్ తేజ్ ను ఆకట్టుకున్నట్లు సమాచారం. దీంతో ఆ ప్రాజెక్టుకు ఆయన ఓకే చెప్పినట్లు టాక్ నడుస్తోంది. ఆ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం.
త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఏదేమైనా ఉప్పెన మూవీ తర్వాత వచ్చిన డిజాస్టర్ల నుంచి లెసెన్స్ నేర్చుకున్న వైష్ణవ్ తేజ్, ఈసారి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సరైన ప్లాన్ తో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దాదాపు మూడేళ్ల బ్రేక్ తర్వాత ఆయన సెలెక్ట్ చేసుకున్న కొత్త ప్రాజెక్ట్ మెగా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మరి ఆ సినిమా వైష్ణవ్ తేజ్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా అనేది అంతా వేచి చూడాలి.
