Begin typing your search above and press return to search.

వేధించిన వ్య‌క్తికి జ్ఞాన‌పీఠ్.. వైర‌ముత్తుపై విమ‌ర్శ‌ల ఝ‌డివాన‌

ప్ర‌ముఖ‌ తమిళ గేయ రచయిత వైరముత్తుకు దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం `జ్ఞానపీఠ్` ప్రకటించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను వివాదానికి దారితీసింది.

By:  Sivaji Kontham   |   16 March 2026 10:53 AM IST
వేధించిన వ్య‌క్తికి జ్ఞాన‌పీఠ్.. వైర‌ముత్తుపై విమ‌ర్శ‌ల ఝ‌డివాన‌
X

ప్ర‌ముఖ‌ తమిళ గేయ రచయిత వైరముత్తుకు దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం `జ్ఞానపీఠ్` ప్రకటించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను వివాదానికి దారితీసింది. తమిళ సాహిత్యానికి ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ ఈ గౌరవం దక్కినా కానీ.. ఆయనపై ఉన్న `మీటూ` (#MeToo) ఆరోపణల నేపథ్యంలో జూరీ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పురస్కార ఎంపిక కమిటీపై విమర్శల ఝడివాన కురిపిస్తున్నారు. ఒకవైపు `లోకనాయకుడు` కమల్ హాసన్ వంటి వారు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరోవైపు బాధితుల తరపున పోరాడుతున్న వారు ఈ గౌరవాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

వైరముత్తుపై గతంలో సుమారు 17 మంది మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ముందుండి పోరాడుతున్నారు. జ్ఞానపీఠ్ ప్రకటన వెలువడగానే చిన్మ‌యి తీవ్రంగా స్పందిస్తూ.. ఇన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తికి అత్యున్నత పురస్కారం ఇవ్వడం అంటే వ్యవస్థ వైఫల్యమని మండిపడ్డారు. వేధింపులకు గురైన వారికి న్యాయం చేయకపోగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఇలా గౌరవించడం బాధితుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం చిన్మయి మాత్రమే కాకుండా సింగర్ భువన శేషయ్య, మలయాళ నటి పార్వతి తిరువోతు కూడా ఈ నిర్ణయాన్ని సిగ్గుచేటుగా అభివర్ణించారు.

సోషల్ మీడియాలో వైరముత్తుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్రెండ్ నడుస్తోంది. వైరముత్తుకు ఉన్న రాజకీయ పలుకుబడి వల్లే ఈ అవార్డు వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళలను గౌరవించని వ్యక్తికి ఇలాంటి పురస్కారాలు ఇవ్వడం తమిళ సంస్కృతికే అవమానమని పలువురు సినీ ప్రముఖులు వాదిస్తున్నారు. ఈ వివాదంలో కమల్ హాసన్ వైరముత్తును పొగడటం కూడా నెటిజన్లకు రుచించడం లేదు. బాధితులకు అండగా ఉండాల్సిన పరిశ్రమ పెద్దలు మౌనంగా ఉండటం .. నిందితులకు మద్దతు తెలపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కమల్‌ను కూడా ట్రోల్ చేస్తున్నారు.

సాహిత్య వర్గాల్లో కూడా ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వ్యక్తి వృత్తిపరమైన ప్రతిభను, వారి వ్యక్తిగత ప్రవర్తనతో ముడిపెట్టవచ్చా? అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. అయితేత్యమనేది సమాజాన్ని చైతన్యపరచడానికి ఉండాలి కానీ.. మహిళలను వేధించే వ్యక్తులను కీర్తించడానికి కాదని మెజారిటీ వర్గం అభిప్రాయపడుతోంది. గతంలో ఆయన `ఆండాళ్ మాత`పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా మళ్లీ చర్చకు వచ్చాయి. ఇది పరోక్షంగా ఆయన వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపుతోందని విమర్శకులు అంటున్నారు.

ప్రస్తుతం ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని, అవార్డును వెనక్కి తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సంఘాలు కూడా ఈ ప్రకటనను తీవ్రంగా నిరసిస్తున్నాయి. మరోవైపు తనకు పురస్కారాలు వచ్చినా రాకపోయినా వైరముత్తుపై తన చట్టపరమైన పోరాటం ఆపేది లేదని చిన్మయి స్పష్టం చేశారు. మొత్తానికి వైరముత్తుకు దక్కిన ఈ గౌరవం సంతోషం కంటే వివాదాన్నే ఎక్కువగా రాజేసింది.