Begin typing your search above and press return to search.

ముద్దుగుమ్మకు యుద్ధ భయం..!

అజయ్ దేవగన్‌తో కలిసి నటించిన రైడ్‌ 2 బాక్సాఫీస్ డీసెంట్‌ ఓపెనింగ్స్‌ను దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   7 May 2025 12:30 AM
Can Vaani Kapoor Ride the Raid 2 Wave or Will Abir Gulal Sink Her Hopes?
X

బాలీవుడ్‌ హీరోయిన్‌ వాణి కపూర్‌ తాజాగా 'రైడ్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజయ్ దేవగన్‌తో కలిసి నటించిన రైడ్‌ 2 బాక్సాఫీస్ డీసెంట్‌ ఓపెనింగ్స్‌ను దక్కించుకుంది. ఇతర స్టార్‌ హీరోల సినిమాలతో పోల్చితే రైడ్‌ 2 సినిమా పర్వాలేదు అన్నట్లుగా మంచి వసూళ్లు సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా లాంగ్‌ రన్‌లో రూ.100 కోట్ల వసూళ్లు దక్కించుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వాణి కపూర్ కెరీర్‌లో చాలా కాలం తర్వాత ఒక హిట్‌ పడ్డట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలుగులో కెరీర్‌ ఆరంభించి దశాబ్ద కాలం దాటింది. అయినా కూడా ఇప్పటి వరకు ఆఫర్ల కోసం ఈమె ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది.

సౌత్‌ లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించని ఈమె బాలీవుడ్‌లో మాత్రం వచ్చిన ప్రతి ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు సాధ్యం అయినంత వరకు ప్రయత్నాలు చేస్తుంది. హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన వార్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా బాలీవుడ్‌లో ఈమె బిజీ అవుతుందని అంతా భావించారు. కానీ ఈమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కలేదు. ముందు ముందు అయినా వరుసగా సినిమా ఆఫర్లు వస్తాయని ఈ అమ్మడు ఆశతో ఎదురు చూస్తుంది. రైడ్‌ 2 తో పాటు ఈమె నటించిన అబీర్‌ గులాల్‌ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. అయితే ఆ సినిమా విడుదల విషయంలో అనుమానాలు నెలకొన్నాయి.

మే 9న అబీర్‌ గులాల్‌ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పటికి సినిమా విడుదల వాయిదా వేయలేదు. కానీ సినిమా విషయంలో తీవ్రమైన వివాదం నెలకొంది. ఇండియన్‌ సినిమా అయినప్పటికీ పాకిస్తాన్‌ నటుడు పవాద్‌ ఖాన్‌ నటించిన సినిమా కావడంతో బ్యాన్‌ చేయాలంటూ చాలా మంది డిమాండ్‌ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతోంది. కొందరు ఈ సినిమాకు మద్దతు తెలుపుతున్నారు. ప్రకాష్ రాజ్‌ ఈ సినిమా కు మద్దతుగా మాట్లాడిన విషయం తెల్సిందే. సినిమా విడుదలను అడ్డుకోవద్దు. ప్రేక్షకులు సినిమాను చూడాలా? వద్దా? అనేది నిర్ణయించుకుంటారు అన్నాడు.

రైడ్‌ 2 సినిమా హిట్‌ కావడంతో అబీర్‌ గులాల్‌ సినిమా కూడా హిట్‌ అయితే వాణీ కపూర్‌ బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. కానీ పాకిస్తాన్‌ నటుడు సినిమాలో ఉండటం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇండియా పాకిస్తాన్‌ మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. యుద్ధం జరగడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో పాకిస్తాన్‌ నటుడు నటించిన సినిమాను కచ్చితంగా విడుదల కానివ్వరు. ఒకవేళ విడుదల చేసినా కూడా కచ్చితంగా సినిమాకు తిరస్కరణ తప్పదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పుడు ఇదే విషయం వాణీ కపూర్‌ను టెన్షన్‌ పెడుతుంది అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు.