పాకిస్తానీ నటుడితో వాణీ.. విరుచుకుపడ్డ ట్రోలర్స్
పాకిస్తానీ నటీనటులకు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అద్భుతమైన అవకాశాలొచ్చాయి. వారంతా భారతీయ సినీపరిశ్రమలో భాగం.
By: Tupaki Desk | 17 July 2025 9:45 AM ISTపాకిస్తానీ నటీనటులకు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అద్భుతమైన అవకాశాలొచ్చాయి. వారంతా భారతీయ సినీపరిశ్రమలో భాగం. అయితే పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తానీ నటీనటుల పాలిట అశనిపాతమే అయింది. వారు కేవలం సింధూ జలాలను మాత్రమే కాదు, ఇంకా చాలా కోల్పోయారు. ఈ జాబితాలో కళాకారుల ఉపాధి కూడా ఉంది. ఇటీవల ఓ ప్రముఖ కథానాయిక సరైన ఉపాధి కరువై అద్దె చెల్లించలేని స్థితిలో తన ఇంటిలోనే మరణించిందని పాకిస్తాన్ మీడియాలు కథనాలు రాసిన సంగతి తెలిసిందే.
కశ్మీర్ సరిహద్దు గ్రామం.. పహల్గామ్ లో ఉగ్ర దాడి అనంతరం పాకిస్తానీ నటీనటుల ప్రమేయం ఉన్న ఏ భారతీయ సినిమా కూడా రిలీజ్ కావడం లేదు. పాకిస్తానీ నటి లేదా పాకిస్తానీ నటుడు ఏదైనా భారతీయ సినిమాలో నటిస్తే దానిపై నిషేధం అమల్లో ఉంది. అలా పాకిస్తానీ నటిని ఎంపిక చేసిన కారణంగా దిల్జీత్ దోసాంజ్ సినిమా ఒకటి భారతదేశంలో విడుదల కాలేదు. అంతేకాదు ప్రముఖ బాలీవుడ్ నటి వాణీ కపూర్ `అబీర్ గులాల్` అనే చిత్రంలో పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ సరసన నటించారు. ఇది పెద్ద దుమారంగా మారింది. సోషల్ మీడియాల్లో వాణీ నిరంతరం ట్రోలింగ్ ని ఎదుర్కొంటోంది. అయితే ఇప్పటివరకూ దీనిపై వాణీ ప్రత్యక్షంగా స్పందించలేదు.
ఇప్పుడు తన వెబ్ సిరీస్ `మందలా మర్డర్స్` ప్రమోషన్స్ లో వాణీ కపూర్ పాత వివాదం గురించి ప్రస్థావించింది. సోషల్ మీడియా ఇటీవల హెక్టిక్ గా, తలకు మించన భారంగా మారిందని వాణీ ఆందోళన చెందారు. పాకిస్తాన్ నటుడి సరసన నటించినందున.. నెటిజనులు తనను చాలా తీవ్రంగా తిట్టి పోసారని అన్నారు. మంచిగా ఉండండి.. దయతో ఉండండి.. ద్వేషాన్ని వెదజల్లకండి. ప్రతికూలతను విడిచిపెట్టండి! ప్రేమ, జాలి దయకు చోటు కల్పించండి!! అని వాణీ సూచించింది. మీరు ఏది ఇస్తే అది వెనక్కి వస్తుంది. ద్వేషం ఇస్తే ద్వేషం.. ప్రేమను ఇస్తే ప్రేమ వెనక్కి తిరిగి వస్తుంది... తప్పుగా ఏది ఇచ్చినా అది మిమ్మల్ని మరింత దిగజార్చుతుంది! అని తొలి OTT షో `మండల మర్డర్స్` ట్రైలర్ లాంచ్‌లో వాణి అన్నారు. అందుకే మంచిగా దయతో ఉండండి.. మనుషుల్లాగా ఉండటానికి ప్రయత్నించండి అంటూ కాస్త కటువుగానే సూచించింది. `అబీర్ గులాల్` మేలో భారతదేశంలో విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడింది.
