నైజాంలో టికెట్ రేట్లు పెరగవు.. మైత్రి బిగ్ డెసిషన్
టాలీవుడ్‌లో గత కొంతకాలంగా సామాన్య ప్రేక్షకుడిని థియేటర్లకు దూరం చేస్తున్న ప్రధాన అంశం టికెట్ ధరల పెంపు.
By: Tupaki Desk | 16 March 2026 11:42 PM ISTటాలీవుడ్‌లో గత కొంతకాలంగా సామాన్య ప్రేక్షకుడిని థియేటర్లకు దూరం చేస్తున్న ప్రధాన అంశం టికెట్ ధరల పెంపు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోల చిత్రాలు వస్తున్నాయంటే చాలు మొదటి వారం రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పరిణామం వల్ల మాస్ ఆదరణ ఎక్కువగా ఉండే నైజాం వంటి ప్రాంతాల్లో సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిందనేది ఒక విశ్లేషణ. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు సినీ పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రానికి నైజాం ప్రాంతంలో టికెట్ ధరలను ఏమాత్రం పెంచకూడదని మైత్రి మూవీ మేకర్స్ నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించిన బ్రేకింగ్ వార్త పవన్ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ సినీ ప్రేమికులకు పెద్ద ఊరటనిచ్చింది. ఈ నిర్ణయం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తే అవకాశం ఉందని.. బాక్సాఫీస్ వద్ద `ఉస్తాద్` సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నైజాం మార్కెట్‌లో మల్టీప్లెక్స్‌లకు రూ.295 .. సింగిల్ స్క్రీన్‌లకు రూ.175 గా సాధారణ ధరలనే ఖరారు చేశారు. ఒక భారీ బడ్జెట్ సినిమాకు ఎలాంటి అదనపు `హైక్` లేకుండా టికెట్లు అందుబాటులో ఉంచడం గత కొంతకాలంగా మనం చూడని అద్భుతమైన పరిణామం. టికెట్ ధరలు అందుబాటులో ఉంటే ఫుట్‌ఫాల్స్ (ప్రేక్షకుల రాక) పెరిగి థియేటర్లు మళ్లీ పాత వైభవాన్ని సంతరించుకుంటాయని భావిస్తున్నారు.
నిజానికి సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకులు తమ నెలవారీ బడ్జెట్‌లో వినోదానికి అత్యంత తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పెరిగిన ధరల వల్ల ఒక కుటుంబం సినిమాకు వెళ్లాలంటే వేలల్లో ఖర్చవుతోంది. అందుకే చాలామంది థియేటర్లను కాదని ఓటీటీల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు మైత్రి తీసుకున్న ఈ గొప్ప నిర్ణయంతో ఓటీటీలో వచ్చే వరకు ఆగాల్సిన అవసరం లేకుండా సామాన్యుడు కూడా సినిమాను థియేటర్లోనే ఆస్వాధించే అవకాశం కలిగింది. ఇది జనాన్ని రిపీటెడ్ గా థియేటర్లకు రప్పిస్తుందని భావిస్తున్నారు.
గతంలో పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన `గబ్బర్ సింగ్` నైజాం బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను సాధించింది. ఇప్పుడు మళ్లీ అదే కాంబోలో వస్తున్న `ఉస్తాద్ భగత్ సింగ్`కు రేట్ల పెంపు లేకపోవడం అనేది బాక్సాఫీస్ వద్ద కలిసొచ్చే అతిపెద్ద అంశం. నైజాం ప్రాంతంలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, టికెట్ ధరలు తక్కువగా ఉండటంతో నిమిషాల వ్యవధిలోనే షోలు ఫుల్ అవుతున్నాయి. ఉదయం 7:30 గంటల నుంచే షోలు అందుబాటులో ఉండటం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
మైత్రి మూవీ మేకర్స్ తీసుకున్న ఈ `డ్యాషింగ్` నిర్ణయంపై సినీ వర్గాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇది కేవలం ఒక సినిమాకే పరిమితం కాకుండా ఇతర నిర్మాతలకు కూడా ఒక ఆదర్శంగా నిలవాలని పలువురు సూచిస్తున్నారు. ఏది ఏమైనా వినోదాన్ని మళ్లీ సామాన్యుడికి చేరువ చేసిన మైత్రి మేకర్స్ నిర్ణయం అభినందనీయం.
