Begin typing your search above and press return to search.

ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ తో మా క‌ల నెర‌వేరింది

ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచనాలు నెల‌కొన్నాయి.

By:  Tupaki Desk   |   18 March 2026 5:46 PM IST
ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ తో మా క‌ల నెర‌వేరింది
X

ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచనాలు నెల‌కొన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్ట‌ర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ తర్వాత తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రిలీజ్ కు ముందు చిత్ర బృందం నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో నిర్మాత నవీన్ యెర్నేని చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. నేపథ్య సంగీతాన్ని ఎస్. తమన్ అందించడం విశేషం. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆడియ‌న్స్ ను ఆకట్టుకుని సినిమాపై భారీ హైప్‌ను సృష్టించాయి. ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన నిర్మాత నవీన్ యెర్నేని, పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడం తమ కల అని పేర్కొన్నారు.

హ‌రీష్ వ‌ల్లే ఇదంతా సాధ్యమైంది

చాలా సంవత్సరాల క్రితమే ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేసినప్పటికీ, కోవిడ్ పరిస్థితులు మరియు పవన్ కళ్యాణ్ రాజకీయ ప‌నుల్లో బిజీగా ఉండ‌టంతో లేటైంద‌ని తెలిపారు. ఆఖ‌రికి గతేడాది జూన్‌లో షూటింగ్ ప్రారంభమై, ప్లాన్ ప్ర‌కారం పూర్తి కావడం సంతోషకరమని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ను ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తి చేశామ‌ని, దానికి కార‌ణం డైరెక్ట‌ర్ హరీష్ శంకరేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రజా సేవలో బిజీగా ఉన్నప్పటికీ, షూటింగ్ షెడ్యూల్స్‌ను సమర్థంగా ప్లాన్ చేసి సినిమా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తిచేయడం దర్శకుడి నైపుణ్యానికి నిదర్శనమని అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ మరియు పబ్లిసిటీ పనులను కూడా అత్యంత శ్రద్ధతో నిర్వహించారని వెల్లడించారు.

ఇప్ప‌టికే నాలుగు సార్లు సినిమా చూశా

ఇక సినిమా గురించి మాట్లాడుతూ, ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి లెంగ్త్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిందని నవీన్ యెర్నేని తెలిపారు. ఎంటైర్టైన్మెంట్, ఎమోష‌న్స్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ సమపాళ్లలో కలిసిన ఈ సినిమా ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు ఆకట్టుకుంటుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఇప్పటికే తాను ఈ సినిమాను పలుమార్లు చూసినప్పటికీ, ప్రతి సారి త‌న‌కు అదే అనుభూతి కలిగిందని పేర్కొన్నారు. సినిమా పట్ల తనకున్న నమ్మకాన్ని వెల్లడిస్తూ, ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమాను ఆస్వాదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉగాది కానుకగా మార్చి 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, తెల్లవారుజామున 5 గంటల నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.