Begin typing your search above and press return to search.

ఐడెంటిటీని కించపరిచేలా AI ఫోటో.. నెట్టింట బాలీవుడ్ బ్యూటీ ఫైర్!

బాలీవుడ్ అగ్ర నటీమణుల గ్లోబల్ స్టార్‌డమ్‌ను పోలుస్తూ నెటిజన్లు వైరల్ చేసిన ఆ ఫేక్ ఫోటోపై ఊర్వ‌శి ఘాటుగా స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక సుదీర్ఘ నోట్ పెట్టారు.

By:  Sivaji Kontham   |   28 May 2026 11:00 PM IST
ఐడెంటిటీని కించపరిచేలా AI ఫోటో.. నెట్టింట బాలీవుడ్ బ్యూటీ ఫైర్!
X

కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2026 వేడుకల్లో తనదైన శైలి భారీ గౌన్లు, ఆకర్షణీయమైన లుక్స్‌తో సందడి చేసిన కొద్దిమంది బాలీవుడ్ తారలలో నటి ఊర్వశి రౌతేలా ఒకరు. ప్ర‌ఖ్యాత‌ `యోలాండ్ అఫీషియల్` బ్రాండ్ రూపొందించిన బ్లాక్ వెల్వెట్ గౌనులో ఊర్వ‌శి రెడ్ కార్పెట్‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ప్రస్తుతం ఈ కాన్స్ సంబరాల నడుమ సోషల్ మీడియాలో అభిమానులు సృష్టించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చిత్రంపై ఊర్వశి రౌతేలా అత్యంత తీవ్రంగా స్పందించారు. బాలీవుడ్ అగ్ర నటీమణుల గ్లోబల్ స్టార్‌డమ్‌ను పోలుస్తూ నెటిజన్లు వైరల్ చేసిన ఆ ఫేక్ ఫోటోపై ఊర్వ‌శి ఘాటుగా స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక సుదీర్ఘ నోట్ పెట్టారు.

ఆ ఏఐ ఫోటోగ్రాఫ్ .. బాలీవుడ్ టాప్ హీరోయిన్ల గ్లోబల్ స్టార్‌డమ్ స్థానాలను వివరిస్తూ ఒక అభిమాని ఈ ఫోటోని ఏఐలో సృష్టించాడు. ఇందులో ప్రపంచవ్యాప్త గుర్తింపులో ఐశ్వర్యారాయ్ దేవ‌త స్థానంలో ఉన్నట్లు చూపించగా.. ప్రియాంకా చోప్రా మధ్యలో ఒక సింహాసనంపై కూర్చుని ఉంది. ఐష్‌కు ఇరువైపులా దీపికా పదుకోన్, మాధురీ దీక్షిత్ నిలబడి ఉండగా.. కింద ఆలియా భట్, కత్రినా కైఫ్, కరీనా కపూర్ , ఊర్వశి రౌతేలా మోకాళ్లపై వంగి నిలబడినట్లు.. వారి పేర్లను ట్యాగ్ చేస్తూ చిత్రించారు. ఈ విధంగా ఐష్ - దీపిక ల కంటే త‌క్కువ స్థాయి న‌టీమ‌ణులుగా చిత్రించ‌డం ఊర్వశికి కోపం ర‌ప్పించింది. దీనిని ఊర్వ‌శి సీరియ‌స్ గా తీసుకుంది.

పరిశ్రమలో న‌టీమ‌ణుల‌ మధ్య ఇలాంటి పోలిక‌లు చూడ‌టం స‌రికాదు. ఇలాంటి ఫ్యాన్ వార్స్‌ను పూర్తిగా ఆపాలని ఊర్వశి పిలుపునిచ్చారు. ప్రతి నటికీ త‌మ‌దైన ప్ర‌యాణం ఉంటుంది.. కష్టపడే తత్వం.. విధి ఎవ‌రికి వారే అన్న చందంగా ఉంటాయని నేను బలంగా నమ్ముతాను. మహిళలను ఇలా పోల్చడం లేదా అభిమానుల మధ్య యుద్ధాలను సృష్టించడం వల్ల కేవలం నెగిటివిటీ మాత్రమే వ్యాప్తి చెందుతుంది. దయచేసి ఈ విషపూరితమైన సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి. దానికి బదులుగా ప్రతి ఒక్కరి టాలెంట్‌ను.. వారి ఎదుగుదలను.. మానవత్వాన్ని సెలబ్రేట్ చేసుకుందాం`` అంటూ తన ఇన్‌స్టా వేదికగా నెటిజన్లను కోరారు.

ఇక ఈ ఏడాది కాన్స్ వేడుకల్లో ఊర్వశి రౌతేలా వియత్నామీస్ డిజైనర్ లేబుల్ జోలిపోలి కోచర్ డిజైన్ చేసిన లావెండర్ టోన్డ్ మెష్ గౌనులో మెరిశారు. రెడ్ కార్పెట్ పై బ్రూట్ ప్రతినిధులతో మాట్లాడుతూ ఊర్వ‌శి భావోద్వేగానికి గురయ్యారు. నేను ఎప్పుడు నా దేశానికి ప్రాతినిధ్యం వహించినా.. అక్కడ నేను కేవలం ఊర్వశిని మాత్రమే కాదు.. నా దేశం ఇండియాకు ప్రతిరూపాన్ని. కాన్స్ చలనచిత్రోత్సవాల ప్రారంభ వేడుకల్లో భారతదేశం తరఫున పాల్గొనడం నాకెంతో గర్వంగా ఉంది అని దేశభక్తిని చాటుకున్నారు. కాన్స్ వేడుకల్లో పాల్గొనడం ఊర్వ‌శికి ఇది వరుసగా ఐదో ఏడాది కావడం విశేషం.

ఈ ఏడాది కాన్స్ వేడుకల్లో ఇతర బాలీవుడ్ భామలు కూడా సందడి చేశారు. గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రతిష్టాత్మక ఉత్సవాల్లో భాగమవుతున్న ఐశ్వర్యా రాయ్ లోరియల్ పారిస్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఈసారి కూడా రెడ్ కార్పెట్‌పై మెరిశారు. అలాగే ఆలియా భట్ రెండవసారి బ్రాండ్ అంబాసిడర్‌గా కాన్స్ వేదికపైకి రాగా.. గతంలో ఈ ఉత్సవాల్లో మెయిన్ కాంపిటీషన్ జ్యూరీ మెంబర్‌గా (2022) వ్యవహరించిన దీపికా పదుకోన్ లుక్స్ కూడా ఈ సందర్భంగా ఇండస్ట్రీలో మరోసారి చర్చకు వచ్చాయి.