నాలా నా కూతురు కాకూడదు
ఇండస్ట్రీలో అన్నీ ఊహించినట్టు జరగవు. అవకాశం వచ్చింది కదా అని ఒకసారి ఇండస్ట్రీలోకి అడుగుపెడితే ఆ ఎఫెక్ట్ తర్వాత కెరీర్ పై పడుతుందని అంటున్నారు సీనియర్ నటి ఊర్వశి.
By: Tupaki Desk | 28 April 2025 10:00 PM ISTఇండస్ట్రీలో అన్నీ ఊహించినట్టు జరగవు. అవకాశం వచ్చింది కదా అని ఒకసారి ఇండస్ట్రీలోకి అడుగుపెడితే ఆ ఎఫెక్ట్ తర్వాత కెరీర్ పై పడుతుందని అంటున్నారు సీనియర్ నటి ఊర్వశి. తల్లి పాత్రలు, కామెడీ రోల్స్ తో అందరినీ అలరించి ఎంతోమందికి చేరువైన ఊర్వశి ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత హీరోయిన్ గా మారింది. ఆ పై క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేసింది.
సౌత్ లో వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఊర్వశికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. తొందరలోనే ఊర్వశి కూతురు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందని ఆమె తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊర్వశి తన కూతురు ఫ్యూచర్ గురించి మాట్లాడారు. తాను చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి రావడం వల్ల చదువు మానేయాల్సి వచ్చిందని, కానీ తన కూతురికి తన పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నట్టు వెల్లడించారు.
ముందు స్టడీస్ పూర్తి చేసి ఆ తర్వాత మంచి జాబ్ చేయమని తన కూతురికి చెప్పానని, ఆ తర్వాత కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలోకి రమ్మని చెప్పానని, తన కాళ్లపై తాను నిలబడ్డాకే సినిమాల గురించి ఆలోచన చేయమని కూతురికి చెప్పినట్టు ఊర్వశి తెలిపారు. రీసెంట్ గానే తన కూతురి చదువులు అయిపోయాయని, ఇప్పుడు తనకు నచ్చినట్టు చేసుకుంటుందని ఆమె అన్నారు.
ప్రస్తుతం తన కూతురికి మంచి ఆఫర్లు వస్తున్నాయని, కథ విని, ఆ సినిమా చేయాలా వద్దా అని డెసిషన్ తీసుకునే స్థాయిలో తన కూతురు ఇప్పుడుందని, ఒకవేళ తన కూతురు నిజంగా యాక్టింగ్ ను సెలెక్ట్ చేసుకుంటే తల్లిగా అది తనకు సంతోషమేనని చెప్పుకొచ్చారు ఊర్వశి. ఇదిలా ఉంటే ఊర్వశి భర్త శివ ప్రసాద్ ప్రస్తుతం డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ఎల్.జగదాంబ సెవెన్త్ క్లాస్ బి అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఊర్వశి నటించారు. డైరెక్టర్ తన భర్తే కదా అని రిలాక్స్ అవనని, సెట్స్ లో కాలు పెట్టాక తాను నటిని మాత్రమేనని, కెమెరా ముందు ఆయన చెప్పినట్టు నటించడమే తన పని అని ఆమె చెప్పుకొచ్చారు.
