ఊర్ఫీ కేన్స్ ప్రదర్శన స్కిప్ కారణం?
వీసా కోసం ప్రయత్నించాను. కానీ తిరస్కరణలు ఎదురయ్యాయి. నా బిజినెస్ ఆగిపోయింది.. అని తెలిపింది.
By: Tupaki Desk | 14 May 2025 4:18 PMఉర్ఫీ జావేద్ పరిచయం అవసరం లేదు. ఈ భామ కొంత కాలంగా ఎలాంటి అప్ డేట్ లేకుండా సైలెంట్ గా ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఫోటోషూట్ల సందడి అస్సలు కనిపించలేదు. అయితే తాను ఎందుకు సైలెంట్ గా ఉందో ఈ భామ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ గా తాను ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఉర్ఫీ వెల్లడించింది. నిజాయితీ అనే దుర్బలత్వం కారణంగా తన వీసాను పలుమార్లు తిరస్కరించారని తెలిపింది ఊర్ఫీ.
వీసా కోసం ప్రయత్నించాను. కానీ తిరస్కరణలు ఎదురయ్యాయి. నా బిజినెస్ ఆగిపోయింది.. అని తెలిపింది. కేన్స్ 2025లో కనిపించడానికి అవకాశం లభించిందని, కానీ ప్రతిష్టాత్మక చలనచిత్రోత్సవానికి హాజరు కాలేకపోయానని కూడా ఊర్ఫీ ఆవేదన చెందింది. ఇండీ వైల్డ్ ద్వారా కేన్స్‌కు వెళ్లే అవకాశం వచ్చింది... కానీ విధి వేరుగా ఉంది.. నా వీసాను తిరస్కరించారు అని ఊర్ఫీ జావేద్ తెలిపింది.
తిరస్కరణలు ముగింపు కాదని, మరింత కష్టపడి పనిచేయడానికి ఒక ప్రేరణ అని ఉర్ఫీ వ్యాఖ్యానించింది. మనలో చాలా మంది మీరే తిరస్కరణలను ఎదుర్కొంటున్నవారే.. నేను మీ కథలను తెలుసుకోవాలనుకుంటున్నాను.. ఒకరినొకరు ఆదరించుకుందాం.. ఉద్ధరిద్దాం! అంటూ కొత్త వ్యాపారాన్ని ఊర్ఫీ స్టార్ట్ చేసింది. జీవితంలో చాలా తిరస్కరణల తర్వాత కూడా నేను ఆగడం లేదు.. మీరు కూడా ఆగకూడదు! అని కోరింది.
ఫ్యాషన్ ఎంపికల్లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ క్వీన్ గా ఊర్ఫీ జావేద్ కి మంచి గుర్తింపు ఉంది. రోజువారీ గృహోపకరణాలను ఉపయోగించి ప్రత్యేకమైన దుస్తులను సృష్టించి ధరించిన ఘనత తనకే చెల్లింది. సేఫ్టీ పిన్‌లతో తయారు చేసిన దుస్తులు అయినా... ఫోన్‌లు, పిజ్జాలతో ఫ్యాషన్ అయినా.. సృజనాత్మకత సరిహద్దులను చెరిపేసిన ఊర్ఫీకి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.