నాకేం కాలేదు... బేషుగ్గా ఉన్నా!
పూర్తి వివరాల్లోకి వెళ్తే... కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సోమవారం బెంగళూరులోని ఒక ఆసుపత్రిని సందర్శించాడు.
By: Tupaki Desk | 6 May 2025 10:15 AMస్టార్ హీరోలు, హీరోయిన్స్ పై మీడియా దృష్టి ఎక్కువగా ఉంటుంది. వారు అడుగు తీసి అడుగు వేస్తే పెద్ద వార్త అవుతుంది. అలాంటిది ఒక హీరో ఆసుపత్రికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. హఠాత్తుగా ఒక స్టార్ హీరో ఆసుపత్రిలో కనిపిస్తే సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా ఫోకస్ పెట్టకున్నా సోషల్ మీడియాలో కొందరు ఆ విషయాన్ని గురించి పదే పదే పోస్ట్‌లు పెట్టడంతో వైరల్ అవుతుంది. తాజాగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించిన పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే ఉద్దేశంతో స్వయంగా ఉపేంద్ర ఎక్స్ ద్వారా స్పందించాల్సి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సోమవారం బెంగళూరులోని ఒక ఆసుపత్రిని సందర్శించాడు. ఆ సమయంలో కొందరు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఉపేంద్ర ఆరోగ్యం గురించి పుకార్లు షికార్లు చేశాయి. హఠాత్తుగా ఉపేంద్ర ఆసుపత్రికి వెళ్లడంతో ఆయన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు అనే అంతా అనుకున్నారు. సోషల్ మీడియాలో ఉపేంద్ర ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు చాలా మంది తెగ సెర్చ్ చేశారు. చివరకు ఆయన ఆరోగ్యం విషయంపై కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియా ద్వారా చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
తన ఆరోగ్యం విషయమై మీడియాలో వస్తున్న పుకార్లపై ఉపేంద్ర స్పందించాడు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. తాను రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే ఆసుపత్రికి వెళ్లినట్లుగా చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లుగా చెప్పడం మాత్రమే కాకుండా తన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందిన వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఎలాంటి ఆందోళన అక్కర్లేదని, నేను బాగున్నాను అంటూ అందరికీ తెలిసే విధంగా ఎక్స్ ద్వారా పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానంతో నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు అన్నట్లుగా ఉపేంద్ర ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ఇక ఉపేంద్ర చాలా ఏళ్ల తర్వాత దర్శకుడిగా సినిమాను రూపొందించారు. నటుడిగా మరోసారి ఉపేంద్ర ఆ సినిమాతో సూపర్ హిట్‌ను దక్కించుకున్నాడు. యూఐ సినిమాకు మంచి స్పందన దక్కడంతో ముందు ముందు ఉపేంద్ర దర్శకత్వంలో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హీరోగానే కాకుండా నటుడిగానూ ఉపేంద్ర వరుస సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్ సినిమాల్లోనూ ఉపేంద్ర సినిమాలు చేస్తున్నాడు. వచ్చే ఏడాదిలో ఉపేంద్ర నుంచి ఒక కన్నడ బిగ్ మూవీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉపేంద్ర ఒక సినిమాను చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది.