Begin typing your search above and press return to search.

డ్రాగ‌న్‌, స్పిరిట్‌, పెద్ది ఇండియ‌న్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తాయా?

ఇండియ‌న్ సినిమాల్లో ప్ర‌ధానంగా అభిమానులు, ట్రేడ్ వ‌ర్గాలు ప్ర‌త్యేకంగా చ‌ర్చించుకుంటున్న సినిమాల జాబితాలో ముందు వ‌రుస‌లో నిలుస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీస్ డ్రాగ‌న్‌, స్పిరిట్‌, పెద్ది.

By:  Tupaki Desk   |   15 April 2025 2:00 AM IST
డ్రాగ‌న్‌, స్పిరిట్‌, పెద్ది ఇండియ‌న్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తాయా?
X

ఇండియ‌న్ సినిమాల్లో ప్ర‌ధానంగా అభిమానులు, ట్రేడ్ వ‌ర్గాలు ప్ర‌త్యేకంగా చ‌ర్చించుకుంటున్న సినిమాల జాబితాలో ముందు వ‌రుస‌లో నిలుస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీస్ డ్రాగ‌న్‌, స్పిరిట్‌, పెద్ది. ఈ మూడు సినిమాలు దేనిక‌దే ప్ర‌త్యేక‌మైన‌వి. అంతే కాకుండా తొలిసారి స్టార్ హీరోలు, క్రేజీ డైరెక్ట‌ర్లు క‌లిసి చేస్తున్న ప్రాజెక్ట్‌లివి. ఈ మూవీస్ గురించి ఇప్ప‌టికే అభిమానుల్లో, ట్రేడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ మూడు క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ల‌లో రామ్ చ‌ర‌ణ్ హీరోగా `ఉప్పెన‌` ఫేమ్ బుచ్చిబాబు సాన రూపొందిస్తున్న `పెద్ది` గ్లింప్స్ ఇటీవ‌లే విడుద‌లై నెట్టింట సంచ‌ల‌నం సృష్టించ‌డం తెలిసిందే.

ఈ మూవీని వ‌చ్చే ఏడాది మార్చి 27న భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. మ‌రొక‌టి పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెర‌కెక్కించ‌నున్న హైవోల్టేజ్ యాక్ష‌న్ డ్రామా. టి సిరీస్ బ్యాన‌ర్‌తో క‌లిసి భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సందీప్‌రెడ్డి వంగ సోద‌రుడు ప్ర‌ణ‌య్ వంగ నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ప్ర‌భాస్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌నున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని అభిమానులు, సినీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

అక్టోబ‌ర్‌లో ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్టుగా తెలుస్తోంది. 2027లో దీన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. `యానిమ‌ల్‌` త‌రువాత సందీప్ రెడ్డి వంగ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో దీనిపై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలున్నాయి. ఇక దీనితో పాటు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్‌ల కాంబినేష‌న్‌లో రానున్న పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా `డ్రాగ‌న్‌` కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ ప్రారంభించారు. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ సెట్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు.

వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 9న ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు కానీ ఆ రోజున వ‌చ్చే అవ‌కాశం లేద‌ని ఏప్రిల్లో ఈ ప్రాజెక్ట్‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ ఉన్నార‌ని ఇన్ సైడ్ టాక్‌. ఇదిలా వుంటే ఈమూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు కావ‌డం విశేషం. ఈ మూడు సినిమాలు రికార్డు స్థాయి వ‌సూళ్ల‌తో ఇండియ‌న్ బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డం ఖాయం అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ మూడు క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాన‌ని రాజ‌మౌళి ప్ర‌క‌టించ‌డంతో వీటిపై అంద‌రిలో మ‌రింత ఆస‌క్తి పెరిగింది.