బయట హీరో పై పాజిటివ్ రివ్యూ ఇచ్చాడని మేనేజర్ పై హీరో దాడి?
తన సొంత మేనేజర్ విపిన్ కుమార్‌పై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఉన్ని ముకుందన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
By: Tupaki Desk | 27 May 2025 11:21 AM IST'మార్కో' సినిమాతో 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు ఉన్ని ముకుందన్, ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నారు. తెలుగులో 'బాగమతి', 'జనతా గ్యారేజ్', 'యశోద' సినిమాల ద్వారా కూడా అభిమానులలో మంచి గుర్తింపు పొందిన ఈ యాక్షన్ హీరోపై తాజాగా దాడి ఆరోపణలతో కేసు నమోదైంది. మలయాళ చిత్రసీమలో ఈ ఘటన సంచలనంగా మారింది.
తన సొంత మేనేజర్ విపిన్ కుమార్‌పై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఉన్ని ముకుందన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గతకొంత కాలంగా తన వద్ద పనిచేస్తున్న విపిన్‌పై, సోషల్ మీడియాలో టోవినో థామస్ నటించిన 'నరివెట్ట' సినిమా పాజిటివ్ రివ్యూ పెట్టినందుకు విరుచుకుపడ్డాడట. ఈ ఘటన అనంతరం మేనేజర్ మీడియా ముందుకు వచ్చి తనపై జరిగిన దాడి విషయాన్ని బయటపెట్టడంతో ఇది పెద్ద వివాదంగా మారింది.
విపిన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఉన్ని ముకుందన్ కానీ, అతని పీఆర్ టీం కానీ స్పందించకపోవడం గమనార్హం. మేనేజర్ ఆరోపణలపై హీరో వైపు నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఉన్ని ముకుందన్ దురుసు ప్రవర్తనపై విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
ఇక ‘మార్కో’ సినిమాకు వచ్చిన సక్సెస్‌తో ఉన్ని ముకుందన్ కెరీర్ బిగ్ లెవెల్‌కు చేరుకుంది. మలయాళంలో 100 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా, ‘ఏ’ సర్టిఫికెట్ సినిమాల వర్గంలోనే తొలి భారీ హిట్‌గా నిలిచింది. తెలుగులో డబ్ చేసినప్పటికీ మిక్స్‌డ్ రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. కానీ ఓటీటీలో విడుదల తర్వాతా సినిమాకు మంచి హైప్ వచ్చింది.
ఇప్పుడు ఇలాంటి ఘర్షణాత్మక వ్యవహారం ఆయన కెరీర్‌పై ఏమేరకు ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అందులోనూ తోటి హీరో పై పాజిటివ్ గా స్పందిస్తే ఈ స్థాయిలో అక్కసు చూపిస్తారా అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ కేసులో ఉన్ని ముకుందన్ ఎలాంటి క్లారిటీ ఇస్తారు.. దాడి నిజంగానే జారిగిందా అన్నదానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
