ఉదయ్ కిరణ్ అల్లుడి ఎంట్రీ.. వర్కౌట్ అవుతుందా?
అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పుడు ఉదయ్ కిరణ్ మేనల్లుడు తేజ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By: M Prashanth | 9 Feb 2026 12:39 PM ISTహీరో ఉదయ్ కిరణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ మనసంతా నువ్వే. క్లాసిక్ లవ్ స్టోరీగా సినీ ప్రియుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న ఆ సినిమా.. మళ్లీ సందడి చేయడానికి సిద్ధమవుతోంది. థియేటర్స్ లో విడుదలై దాదాపు 25 ఏళ్లు కంప్లీట్ అవుతున్న సందర్భంగా.. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే స్పెషల్ గా రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పుడు ఉదయ్ కిరణ్ మేనల్లుడు తేజ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఎమోషనల్ గా మాట్లాడాడు తేజ! "అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 14న మా మామ సినిమా మనసంతా నువ్వే థియేటర్లలో మళ్లీ విడుదల అవుతోంది. చాలా సంవత్సరాల తర్వాత కూడా ఆ సినిమాకు ఇంతటి లవ్, క్రేజ్ ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు" అని తెలిపాడు.
"అప్పట్లో నేను 7–8 ఏళ్ల చిన్న పిల్లాడిని. ఇప్పుడు పెద్దవాడిగా మళ్లీ ఆ మ్యాజిక్ ను థియేటర్లో చూడాలని ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నాను. అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి" అని కోరారు. అయితే తేజ వీడియో చూసిన ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఉదయ్ కిరణ్ సినిమాలు తమ యూత్ డేస్ కు గుర్తులని, ఆయన యాక్టింగ్ లోనే ఇన్నోసెన్స్, సినిమాల్లోని కథలను ఇప్పటికీ మిస్ అవుతున్నామని కామెంట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా మనసంతా నువ్వేలోని సాంగ్స్, లవ్ సీన్స్, ఫీల్ గుడ్ స్టోరీ అప్పట్లో యూత్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ కానుండడం.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు ప్రమోట్ చేయడం విశేషం. అయితే ఉదయ్ కిరణ్ సినీ జర్నీపై ఎప్పటినుంచో అభిమానుల్లో చర్చ కొనసాగుతోంది. ఆయన కెరీర్ కు తగిన గుర్తింపు రాలేదని, కొన్ని పరిస్థితులు ఆయనను వెనక్కి నెట్టేశాయని చాలామంది అభిప్రాయపడుతుంటారు.
అందుకే ఆయన సినిమాలను మళ్లీ రీరిలీజ్ చేసి ప్రేక్షకులకు అందించాలని పలుమార్లు డిమాండ్లు వచ్చాయి. ఇప్పుడు మనసంతా నువ్వే రీరిలీజ్ అవుతుండడంతో ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందనే చెప్పాలి. కానీ ఫిబ్రవరి 14న సినిమా సందడి చేయనుండగా.. అప్పుడే ఎగ్జామ్స్ సీజన్ స్టార్ట్ అవుతోంది. స్టూడెంట్స్ బిజీగా ఉండే సమయం కావడంతో థియేటర్లకు ఎంతమంది వస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
అయినా వాలెంటైన్స్ డే కావడంతో లవ్ స్టోరీలకు ఎప్పుడూ క్రేజ్ ఉండటం వల్ల సూపర్ రెస్పాన్స్.. మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పాలి. ఏదేమైనా ఉదయ్ కిరణ్ అభిమానులకు మనసంతా నువ్వే రీరిలీజ్ ఎమోషనల్ మోమెంట్ గా మారింది. 25 ఏళ్ల తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై ఆ మూవీ చేసిన మ్యాజిక్ చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.. అల్లుడి ప్రమోషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.
