Begin typing your search above and press return to search.

భైరవం ఎక్కడ టైసన్‌ నాయుడు?

మూడు సినిమాల్లో భైరవం సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాను విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేసిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   6 April 2025 12:00 AM IST
భైరవం ఎక్కడ టైసన్‌ నాయుడు?
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పూర్తి అయింది. ఈ దశాబ్ద కాలంలో బెల్లంకొండ నుంచి పలు సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా అల్లుడు శీను పాజిటివ్‌ రెస్పాన్స్‌ దక్కించుకోగా ఆ తర్వాత నటించిన సినిమాల్లో కొన్ని నిరాశను మిగల్చగా, కొన్ని పర్వాలేదు అన్నట్లుగా నిలిచాయి. మొత్తానికి ఈ పదేళ్ల కాలంగా బెల్లంకొండ శ్రీనివాస్‌ కెరీర్‌ పరంగా ఇంకా ఒడిదొడుకులు ఎదుర్కొటూనే ఉన్నాడు. అయితే అదృష్టం కొద్ది ఈ యువ హీరోకి కంటిన్యూగా సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది ఒక్క సినిమాను విడుదల చేయలేక పోయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్న విషయం తెల్సిందే.

మూడు సినిమాల్లో భైరవం సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాను విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేసిన విషయం తెల్సిందే. ఈ సమ్మర్‌లో కచ్చితంగా సరైన సమయం చూసి విడుదల చేయాలని భావిస్తున్నారు. భైరవం సినిమా ఎప్పుడు వచ్చేది క్లారిటీ లేదు. ప్రస్తుతం ప్రమోషన్స్ హడావిడి కూడా లేదు. దాంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో సినిమాతో బిజీ అయినట్లు సమాచారం అందుతోంది. భృమ్లా నాయక్‌ సినిమా దర్శకుడు సాగర్‌ చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా టైసన్ నాయుడు అనే సినిమా రూపొందుతుంది అంటూ రెండేళ్ల క్రితమే ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.

టైసన్ నాయుడు సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తున్న టైసన్‌ నాయుడు షూటింగ్‌ను పునః ప్రారంభించారని సమాచారం అందుతోంది. ఈ సినిమా కథ విభిన్నంగా ఉంటుందని, నేపాల్‌లో కీలక సన్నివేశాలు సాగుతాయని సమాచారం అందుతోంది. గత ఏడాదిలోనే నేపాల్‌ వెళ్లి మరీ షూటింగ్‌ చేసుకుని వచ్చారు. దాదాపు ఆరు నెలలుగా సినిమాకు సంబంధించిన ఎలాంటి కదలిక లేకపోవడంతో ఏం జరిగింది అంటూ కొందరు చెవులు కొరుక్కున్నారు. ఫైనల్‌గా సినిమా ఉందని, షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించారని తెలియడంతో పుకార్లకు చెక్‌ పెట్టినట్లు అయింది.

టైసన్ నాయుడు సినిమా షూటింగ్‌కు హాజరు అవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'భైరవం' సినిమాతో ఎప్పుడు వస్తాడు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మొన్నటి వరకు భైరవం సినిమా విడుదలైన తర్వాత టైసన్ నాయుడు సినిమా షూటింగ్‌లో జాయిన్‌ కావాలని బెల్లంకొండ భావించాడట. కానీ భైరవం సినిమా విడుదల విషయంలో స్పష్టత లేకపోవడంతో టైసన్‌ నాయుడుగా బెల్లంకొండ మారాడు. ఇప్పటికే 80 శాతం పూర్తి చేసుకున్న టైసన్ నాయుడును రెండు నెలల షూట్‌తో పూర్తి చేయాలని సాగర్ చంద్ర భావిస్తున్నాడట. త్వరలోనే సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. టైసన్‌ నాయుడు ఓకే కానీ బెల్లంకొండతో పాటు మంచు మనోజ్‌, నారా రోహిత్‌ నటించిన 'భైరవం' సినిమా సంగతి ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.