Begin typing your search above and press return to search.

తుంబాడ్ 2లో గ్లోబల్ స్టార్స్: ప్రియాంక- కత్రిన- నయన్ పేర్లతో పెరిగిన అంచనాలు!

దర్శకుడు ఆదేశ్ ప్రసాద్ ఈ సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. మొదటి భాగం సృష్టించిన ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కథను ముందుకు తీసుకెళ్లడం సవాలుతో కూడుకున్న పని అని పేర్కొన్నారు.

By:  Sivaji Kontham   |   1 May 2026 8:15 AM IST
తుంబాడ్ 2లో గ్లోబల్ స్టార్స్: ప్రియాంక- కత్రిన- నయన్ పేర్లతో పెరిగిన అంచనాలు!
X

భారతీయ సినీ చరిత్రలో ఒక క్లాసిక్ ఫిల్మ్‌గా నిలిచిన `తుంబాడ్` చిత్రానికి సీక్వెల్ తెర‌కెక్కుతోంద‌న్న ప్రచారం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటుడు, నిర్మాత సోహమ్ షా - పెన్ స్టూడియోస్ అధినేత డాక్టర్ జయంతిలాల్ గడ ఈ భారీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపినట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. 2018లో విడుదలైన మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించడమే కాకుండా.. ఇటీవల 2024లో రీ-రిలీజ్ అయినప్పుడు కూడా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ సీక్వెల్‌ను 3 డిసెంబర్ 2027న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో అభిమానుల ఉత్సాహం రెట్టింపయింది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కాస్టింగ్ పరంగా ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. సీక్వెల్‌లో ఒక కీలకమైన మహిళా పాత్ర కోసం మేకర్స్ అగ్ర నటీమణులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ లేదా సౌత్ సూపర్ స్టార్ నయనతారలలో ఒకరిని ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కథలో ఈ పాత్ర చాలా బలంగా ఉండబోతుందని.. అందుకే పాన్-ఇండియా గుర్తింపు ఉన్న ఒక ఏ-లిస్టర్ అయితే బాగుంటుందని చర్చలు జరుపుతున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ముద్ర పడాల్సి ఉంది.

చిత్ర బృందం విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మూడు విగ్రహాలు కనిపిస్తుండగా `ప్రళయం రాబోతోంది` అనే ట్యాగ్‌లైన్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. మొదటి భాగం కంటే విజువల్ గా, కథా పరంగా ఈ సీక్వెల్ మరింత అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ నటించబోతున్నట్లు మేకర్స్ ఇదివరకే ధృవీకరించారు. సోహమ్ షాతో పాటు నవాజుద్దీన్ కూడా తోడవడంతో నటన పరంగా ఈ సినిమా మరో స్థాయిలో ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

దర్శకుడు ఆదేశ్ ప్రసాద్ ఈ సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. మొదటి భాగం సృష్టించిన ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కథను ముందుకు తీసుకెళ్లడం సవాలుతో కూడుకున్న పని అని పేర్కొన్నారు. `తుంబాడ్` ఆత్మ దెబ్బతినకుండానే ప్రేక్షకులకు సరికొత్త లీనమయ్యే అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు. ఒరిజినల్ సినిమాకు ఉన్న విలక్షణమైన మూడ్ .. విజువల్ లాంగ్వేజ్‌ను కొనసాగిస్తూనే ఈ సీక్వెల్‌లో ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు.

2018లో రాహి అనిల్ బార్వే దర్శకత్వంలో వచ్చిన `తుంబాడ్`, `వినాయక్ రావు `(సోహమ్ షా) అనే వ్యక్తి తన కొడుకుతో కలిసి చేసే ప్రమాదకరమైన సాహసయాత్ర నేపథ్యంలో సాగుతుంది. హారర్-మైథాలజీ అంశాల కలయికతో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు పార్ట్ 2 కోసం ప్రియాంక చోప్రా - నయనతార వంటి స్టార్స్ రంగంలోకి దిగితే ఈ డార్క్ యూనివర్స్ స్థాయి గ్లోబల్ రేంజ్‌కు చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఆ కీలక పాత్రను దక్కించుకునే అదృష్టం ఏ సుందరికి దక్కుతుందో వేచి చూడాలి.