పాన్ ఇండియాలో ఉత్కంఠ రేకెత్తించే జానపద సినిమా
భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యుత్తమ కథాంశం, అద్భుతమైన విజువల్స్‌తో రూపొందిన `తుంబాద్` ఒక సంచలనం.
By: Sivaji Kontham | 8 April 2026 1:00 AM ISTపాన్ ఇండియాలో ఉత్కంఠ రేకెత్తించే జానపద సినిమా - తుంబాద్. ధనాశ, అత్యాశ, పేరాశ గురించి కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా ఇది..అందుకే ఇప్పుడు సీక్వెల్ అనగానే ఉత్కంఠ నెలకొంది. తుంబాద్ కథాంశం.. ఇప్పటివరకూ భారతీయ సినిమా హిస్టరీలోనే అత్యుత్తమైన కథ, కథనంతో రూపొందించిన చిత్రం..జానపద కథాంశం రక్తి కట్టించే విజువలైజేషన్ తో కట్టి పడేస్తుంది.. అందుకే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నామని సోహమ్ షా ప్రకటించగానే సర్వత్రా ఆసక్తి నెలకొంది. తుంబాద్ 2 కోసం ఇప్పుడు బోనీకపూర్ కూడా జాయిన్ అవుతున్నారు.... నేడు ఈ సినిమా ప్రారంభమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యుత్తమ కథాంశం, అద్భుతమైన విజువల్స్‌తో రూపొందిన `తుంబాద్` ఒక సంచలనం. చూడటానికి ఒక ఆర్ట్ ఫిల్మ్‌లా అనిపించినా, ఇందులో ఉపయోగించిన ఆర్ట్ వర్క్, పాత్రల చిత్రణ, నటన , మంత్రముగ్ధులను చేసే సంగీతం ప్రేక్షకులను ఒక సరికొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. ధనాశ, అత్యాశ , పేరాశ మనిషిని ఏ స్థాయికి దిగజారుస్తాయి? దాని ఫలితం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ చిత్రం కళ్లకు కట్టినట్టు చూపించింది. అందుకే ఈ సినిమా రీ-రిలీజ్‌లో కూడా అద్భుతమైన వసూళ్లను సాధించి తన కంటెంట్‌లోని డెప్త్ ను మరోసారి నిరూపించుకుంది.
ఈ చిత్ర కథాంశం విషయానికి వస్తే.. 20వ శతాబ్దపు ప్రారంభంలో మహారాష్ట్రలోని `తుంబాద్` అనే గ్రామం నేపథ్యంలో సాగుతుంది. భూమాత తొలి సంతానమైన `హస్తర్` అనే దేవుడికి సంబంధించిన పురాణగాథ చుట్టూ కథ తిరుగుతుంది. హస్తర్ వద్ద అపారమైన బంగారం ఉంటుందని.. దానిని దక్కించుకోవాలని వినాయక్ రావు (సోహమ్ షా) చేసే ప్రయత్నాలు.. ఆ క్రమంలో ఎదురయ్యే భయానక పరిణామాలు ఈ చిత్రానికి ప్రాణం. తరతరాలుగా సాగే ఈ అత్యాశ ప్రయాణం... చివరికి వినాయక్ రావును ఏ తీరానికి చేర్చింది అనేదే తుంబాద్ అసలు కథ.
దర్శక నటుడు సోహమ్ షా ఈ సినిమా కోసం చేసిన హార్డ్ వర్క్ సామాన్యమైనది కాదు. జానపద కథాంశాన్ని అత్యంత రక్తి కట్టించే విజువలైజేషన్‌తో తెరకెక్కించడానికి ఆయన ఏళ్ల తరబడి శ్రమించారు. ఆ కష్టం ప్రతి ఫ్రేమ్‌లో ఎంతో అందంగా కుదిరి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాయి. అందుకే ఇప్పుడు `తుంబాద్ 2` సీక్వెల్‌ను ప్రకటించగానే సినీ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో తాజాగా ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కూడా భాగస్వామి కావడం విశేషం. నేడు ఈ చిత్ర షూటింగ్ ముహూర్తం షాట్‌తో ఘనంగా ప్రారంభమైంది, ఇది మొదటి భాగం కంటే విజువల్ గా మరింత గ్రాండ్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.
అయితే తుంబాద్ మొదటి భాగం కేవలం హిందీకే పరిమితమైంది. ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే అర్హత లేదా అనే చర్చ ఇప్పుడు సాగుతోంది. నిస్సందేహంగా తుంబాద్‌కు అన్ని భాషల్లో విడుదలయ్యే సత్తా ఉంది.. కానీ సోహమ్ షా అప్పట్లో దీనిని అన్ని భాషల్లో భారీగా రిలీజ్ చేయలేదు. దీనికి ప్రధాన కారణం 2018 నాటికి పాన్ ఇండియా మార్కెట్ ఇప్పటిలా విస్తృతంగా లేదు. అప్పట్లో ఇలాంటి ప్రయోగాత్మక జానపద హారర్ చిత్రాలను ఇతర భాషల ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అనే సందేహం ఉండేది. అలాగే పరిమిత బడ్జెట్.. పబ్లిసిటీ వ్యూహాల వల్ల అప్పట్లో ఇది కేవలం కొన్ని భాషలకే పరిమితమైంది.
నేడు కాలం మారింది. `కాంతార`,`హనుమాన్` వంటి చిత్రాలు ప్రాంతీయ జానపద కథలకు గ్లోబల్ అప్పీల్ ఉంటుందని నిరూపించాయి. తుంబాద్ రీ-రిలీజ్ సాధించిన విజయం కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అందుకే ఇప్పుడు `తుంబాద్ 2`ను సోహమ్ షా అత్యంత ప్రతిష్టాత్మకంగా... పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హస్తర్ పురాణంలోని మరిన్ని రహస్యాలను విప్పుతూ తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ భారతీయ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.
