Begin typing your search above and press return to search.

రూ.10 కోట్ల సినిమాకు రూ.150 కోట్లతో సీక్వెల్‌?

అయితే 'తుంబాడ్‌' అనే సినిమా చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. 2018లో విడుదలైన తుంబాడ్‌ సినిమా గురించి అప్పుడు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ ఓటీటీలో విడుదలైన తర్వాత ఎక్కువ మంది ఆ సినిమాను చూసి సర్‌ప్రైజ్ అయ్యారు.

By:  Ramesh Palla   |   14 July 2026 4:06 PM IST
రూ.10 కోట్ల సినిమాకు రూ.150 కోట్లతో సీక్వెల్‌?
X

బాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఎన్నో హర్రర్‌ కాన్సెప్ట్‌ సినిమాలు వచ్చాయి. వాటిల్లో చాలా వరకు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే 'తుంబాడ్‌' అనే సినిమా చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. 2018లో విడుదలైన తుంబాడ్‌ సినిమా గురించి అప్పుడు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ ఓటీటీలో విడుదలైన తర్వాత ఎక్కువ మంది ఆ సినిమాను చూసి సర్‌ప్రైజ్ అయ్యారు. ఇలాంటి సినిమాను ఎలా థియేటర్‌లో మిస్‌ అయ్యాం అని అంతా అనుకున్నారు. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్‌తో తుంబాడ్‌ సినిమాను రాహి అనిల్ బర్వే రూపొందించాడు. ఈ సినిమాకు స్క్రీన్‌ ప్లేను ఆనంద్ గాంధీ, రాహి అనిల్ బార్వేలు అందించారు. సోహుమ్‌ షా ప్రధాన పాత్రలో నటించిన తుంబాడ్‌ సినిమా ఆ సమయంలో బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.15 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ప్రమోషన్‌ సరిగా చేయక పోవడం వల్ల చాలా తక్కువ వసూళ్లు నమోదు అయ్యాయి.




తుంబాడ్‌ సినిమాకు సీక్వెల్‌...

తుంబాడ్ సినిమాను ఓటీటీలో చూసిన వారు అంతా కూడా సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తూ, తమ రివ్యూ చెప్పడంతో అత్యధికులు ఈ సినిమాను చూశారు. చాలా మందికి ఈ సినిమా ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ హర్రర్‌ మూవీగా నిలిచింది. 2024లో సినిమాను రీ రిలీజ్‌ చేస్తే ఏకంగా రూ.30 కోట్లు వసూళ్లు అయ్యాయి. ఫస్ట్‌ రిలీజ్ సమయంలో రూ.15 కోట్లు రాబట్టిన తుంబాడ్‌ సినిమా రీ రిలీజ్‌లో ఏకంగా రూ.30 కోట్లను రాబట్టడంతో సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటని అందరికీ అర్థం అయింది. ఆ సమయంలోనే తుంబాడ్‌ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించారు. తుంబాడ్‌ సినిమాలోని హస్తర్‌ పాత్రకు కొనసాగింపు అంటూ చిన్న టీజర్‌ను విడుదల చేసి తుంబాడ్‌ 2 ను అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని నెలలుగా తుంబాడ్‌ 2 సినిమా కోసం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందని బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఆలియా భట్‌ హీరోయిన్‌గా...

రూ.10 కోట్లతో రూపొంది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తుంబాడ్‌ సినిమాకు సీక్వెల్‌గా రూపొందబోతున్న తుంబాడ్‌ 2 సినిమాను దాదాపుగా రూ.150 కోట్ల బడ్జెట్‌తో రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదట ఈ రీమేక్‌లో జాన్వీ కపూర్‌ను లేడీ లీడ్‌ రోల్‌ చేయించాలని భావించారట. అందుకోసం జాన్వీ రెడీ అవుతుందనే వార్తలు సైతం వచ్చాయి. కానీ చివరకు జాన్వీ కపూర్‌ను తప్పించి సినిమాలో ఆలియా భట్‌ను ఎంపిక చేయడం జరిగింది. తాజాగా ఆలియా భట్‌తో ఆదేశ్‌ ప్రసాద్‌ తుంబాడ్ 2 సినిమాను అధికారికంగా ప్రకటించాడు. ఆలియా భట్‌ చేరికతో ఈ సినిమా రేంజ్ మరింత పెరిగిందంటూ తుంబాడ్‌ అభిమానులు అంటున్నారు. హర్రర్‌ సినిమాలను ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

బాలీవుడ్‌ మూవీ...

ఆలియా భట్‌కి ఉన్న ఇమేజ్ నేపథ్యంలో ఈ సినిమా మార్కెట్‌ వాల్యూ భారీగా పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. మొదటి పార్ట్‌ కేవలం రూ.10 కోట్లతో రూపొందగా సీక్వెల్‌ కి ఆలియా పారితోషికంతో కలిపి మొత్తంగా రూ.150 కోట్లకు పైగా ఖర్చు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో అంతకు మించిన బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. మొదటి రోజే సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. తుంబాడ్‌ సినిమాకు ఉన్న క్రేజ్‌ ఏంటి అనేది సీక్వెల్‌ రిలీజ్ అయితే క్లారిటీ వస్తుందని కొందరు అంటున్నారు.