విదేశీ సినిమాలపై ట్రంప్ బాంబ్.. 100శాతం పన్ను వేయాలని సంచలన నిర్ణయం!
అమెరికా చలనచిత్ర పరిశ్రమను కాపాడటం కోసం విదేశాల్లో రూపొందిన సినిమాల మీద 100శాతం పన్ను విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By: Tupaki Desk | 5 May 2025 10:23 AM ISTఅమెరికా చలనచిత్ర పరిశ్రమను కాపాడటం కోసం విదేశాల్లో రూపొందిన సినిమాల మీద 100శాతం పన్ను విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాలు సినీ నిర్మాతలకి మంచి ఆఫర్లు ఇస్తుండడంతో హాలీవుడ్ వేగంగా చచ్చిపోతోందని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
విదేశీ సినిమాలు అమెరికా సంస్కృతిని దెబ్బతీసే కుట్రలో భాగమని ఆరోపిస్తూ దీన్ని జాతీయ భద్రతా సమస్యగా అభివర్ణించారు ట్రంప్. విదేశీ సినిమాలపై భారీగా పన్ను విధించే ప్రక్రియను ప్రారంభించాలని వాణిజ్య శాఖ, అమెరికా వాణిజ్య ప్రతినిధికి ఆయన ఆదేశాలు జారీ చేశారు.
అయితే, అమెరికన్ సినిమాలు కష్టాల్లో ఉండడానికి కారణం విదేశీ పోటీ కాదని, సరికొత్త ఆలోచనల కొరత, సీక్వెల్‌లు, సూపర్ హీరో కథలు, రీమేక్‌లను ఎక్కువగా వినియోగించడమేనని విమర్శకులు వాదిస్తున్నారు. అధిక పన్నుల కారణంగా టికెట్ ధరలు పెరిగి, ప్రేక్షకులు తక్కువ సినిమాలు చూడాల్సి వస్తుందని మరికొందరు భయపడుతున్నారు.
ఈ పన్నుల కారణంగా ఎక్కువగా నష్టపోయేది ముఖ్యంగా భారతీయ సినిమా, ముఖ్యంగా ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు సినిమా అభిమానుల కారణంగా అక్కడ మంచి వృద్ధిని సాధించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ. ఇది తెలుగు సినిమా పరిశ్రమపై ఎలా ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ డబ్ల్యూ. లుట్నిక్ ఈ పన్నులను అమలు చేయడానికి ఇప్పటికే కృషి చేస్తున్నామని కన్ఫాం చేశారు.
