బాలీవుడ్‌పైనే కాదు టాలీవుడ్‌పైనా బిగ్ పంచ్
పాకిస్తాన్ పిరికిపంద చర్యలు, అమెరికా అడ్డగోలు విధానాలు భారత్ ని కొంత ఇబ్బందికి గురి చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 May 2025 10:39 PM ISTపాకిస్తాన్ పిరికిపంద చర్యలు, అమెరికా అడ్డగోలు విధానాలు భారత్ ని కొంత ఇబ్బందికి గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అన్నిటినీ అధిగమించి అజేయమైన శక్తిగా భారత్ ఎదుగుతోంది. ఓవైపు పాకిస్తానీ ముష్కరులను తిప్పి కొట్టేందుకు భారత్ ఆపరేషన్ నిర్వహిస్తుంటే, మరోవైపు అమెరికా అధిక సుంకాల్ని విధిస్తూ పంటి కింద రాయిలా మారింది. అక్కడ రిలీజ్ కి వచ్చే విదేశీ సినిమాలపై 100 శాతం పన్ను విధించడం ద్వారా ట్రంప్ కక్ష తీర్చుకున్నాడు.
అయితే ట్రంప్ విధానాలను సీరియస్ గా తీసుకోని భారతీయ ప్రజల్ని చూస్తుంటే తనకు విస్మయం కలుగుతోందని బాలీవుడ్ అగ్రనిర్మాత మహేష్ భట్ అన్నారు. ట్రంప్ విధానాలు తమను ప్రభావితం చేయవని భారతీయులు భావించడం సరికాదని అన్నారు. అతడి విధానాలు భారతీయ సినీపరిశ్రమను ప్రభావితం చేయవని చాలా మంది నమ్ముతున్నందున, పరిశ్రమలో నిజాన్ని తిరస్కరిస్తున్నారని, అభద్రతతో ఉన్నారని మహేష్ భట్ విమర్శించారు.
సుంకం భారతీయ పరిశ్రమను ప్రభావితం చేస్తుందని భట్ అన్నారు. హిందీ చిత్రపరిశ్రమతో పాటు తెలుగు సినిమాలకు పెద్ద నష్టం వాటిల్లుతుందని మహేష్ భట్ విశ్లేషించారు. అయితే అమెరికా సుంకం ప్రభావం ఓటీటీలు, డిజిటల్ స్ట్రీమింగ్ కంటెంట్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. విదేశాల్లో మన కంటెంట్ కి విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. హిందీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్త ఆదరణ ఉంది. ఇటీవల గొప్పగా విదేశీ ప్రేక్షకులను పెంచుకున్న తెలుగు చిత్రపరిశ్రమ చిక్కుల్లో పడుతుందని మహేష్ భట్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా ఆదరణ పరంగా చూస్తే అమెరికా సుంకం భారతీయ సినిమాను దెబ్బ తీస్తుందని విశ్లేషించారు.
విదేశీ సినిమాలు అమెరికాలో డబ్బును వసూలు చేయడం కారణంగా స్వదేశీ చిత్రపరిశ్రమ కుంటుపడుతుందని ట్రంప్ విశ్లేషించాడు. అందుకే ఇప్పుడు ఇలా వినోద రంగంపై పన్ను విధించాడు.
