విదేశీ సినిమాలకు 100 శాతం పన్ను.. టామ్ క్రూజ్‌కి ప్రశ్న
తొలి వీకెండ్ మూడు రోజుల్లో 50 కోట్ల క్లబ్ ని ఎంఐ 8 అందుకోగలదు. టాక్ బావుంటే భారతదేశం నుంచి టామ్ సినిమా 100 కోట్లు కొల్లగొడుతుందని అంచనా.
By: Tupaki Desk | 13 May 2025 12:30 AMభారత్- పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపానని ప్రకటించాడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడు చాలా చతురత చూపించారు. అతడు అమెరికాలో విదేశీ వస్తువులు అమ్మాల్సిన పని లేకుండా అడ్డగోలు పన్నుల బాదుడుతో విరుచుకుపడ్డాడు. ఇది ఇండియా- పాక్ యుద్ధం కంటే తీవ్రమైన నష్టం తెచ్చింది.
ట్రంప్ వినోద రంగంపై 100 శాతం పన్ను విధిస్తున్నానని ప్రకటించి పెద్ద బాంబే పేల్చాడు. విదేశీ సినిమాలను అమెరికాలో రిలీజ్ చేస్తే వంద శాతం పన్ను చెల్లించాలట. ఇది ఇంకా చట్టంగా మారలేదు కానీ, అతడి ప్రకటన టాలీవుడ్, బాలీవుడ్ సహా అన్ని సినీపరిశ్రమల్ని బెంబేలెత్తించింది. ప్రతి 100 సంపాదనపైనా, 100 అమెరికా ఖజానాకు చెల్లించాలంటే అది జరిగే పనేనా? ఇక భారతీయ సినిమాల్ని అమెరికాలో ఆడించడం కష్టమేనని నిర్మాతలు ఆవేదన చెందారు. అమెరికాలో అమెరికన్లు తెలుగు సినిమాలను ఆదరిస్తారా లేదా? అన్నది అటుంచితే ఇప్పుడు భారతదేశానికి చెందిన ఎన్నారైలు కూడా అక్కడ థియేటర్లకు వెళ్లలేని పరిస్థితిని తెచ్చాడు ట్రంప్.
ఇది కేవలం భారతదేశానికే వర్తించదు. ప్రపంచంలోని అన్ని దేశాల సినిమాలకు, వినోద రంగాలకు వర్తిస్తుంది. అమెరికాలో వినోదం ఇప్పుడు కాస్ట్ లీ వ్యవహారం. అమెరికాలో సినిమా వ్యాపారం చేయాలంటే వందకు వంద చెల్లించుకోవాలి. ఇది నిజంగా సినీరంగాలను భయభ్రాంతులకు గురి చేసిన అన్యాయమైన ప్రకటన.
ఇలాంటి క్లిష్ఠ కాలంలో అమెరికన్ టామ్ క్రూజ్ తెరకెక్కించిన ఎం.ఐ 8 (మిషన్ ఇంపాజిబుల్ 8- ది ఫైనల్ రికనింగ్) భారతదేశం సహా ప్రపంచ దేశాల్లో విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి ఇండియాలోను ఈ సినిమా విడుదలవుతోంది. టామ్ క్రూజ్ ఎంఐ సిరీస్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రం మన దేశంలో మొదటి రోజు 20కోట్లు వసూలు చేస్తుందని అంచనా. తొలి వీకెండ్ మూడు రోజుల్లో 50 కోట్ల క్లబ్ ని ఎంఐ 8 అందుకోగలదు. టాక్ బావుంటే భారతదేశం నుంచి టామ్ సినిమా 100 కోట్లు కొల్లగొడుతుందని అంచనా.
ఎలాగూ అమెరికన్ సినిమాలు భారత్ లో విడుదలైతే ఇక్కడి ప్రభుత్వాలు సుంకం పరిమితంగానే వసూలు చేస్తాయి. అందువల్ల వారి చిత్రాలకు ఎలాంటి డోఖా లేదు. కానీ భారతీయ సినిమాల్ని అమెరికాలో ఆడించాలంటే ఎలా? జిత్తులమారి ట్రంప్ అడ్డగోలుగా మోకాలడ్డేశాడు. ఇలాంటి సమయంలో టామ్ క్రూజ్ కి ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న ఎదురైంది. విదేశీ సినిమాలపై 100 శాతం సుంకం విధించారు కదా.. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అని విలేఖరి ప్రశ్నించాడు. దానికి సూటిగా సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడు టామ్ క్రూజ్. మేం సినిమా గురించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతాము.. ధన్యవాదాలు! అని టామ్ క్రూజ్ తప్పించుకోజూసాడు. నా సినిమా గురించి అడగండి చెబుతాను..! అని ఎస్కేప్ అయ్యాడు. ఒక విధంగా పన్నులు, ప్రభుత్వ పాలసీల గురించి ప్రశ్నించొద్దని సూటిగానే చెప్పేసాడు. ట్రంప్ అడ్డగోలు ఆలోచనలతో ఇండియన్ సినిమా చాలా నష్టపోతుందని అంచనా. ఇకపై మన సినిమాలను అమెరికాలో రిలీజ్ చేస్తారా లేదా? అసలేం జరగబోతోంది? అన్నది వేచి చూడాలి.