Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ కు టైర్-2 హీరోలే దిక్కా?

ఈ గ్యాప్ లో మీడియం రేంజ్ మార్కెట్ ఉన్న టైర్-2 హీరోలు, సూపర్ సీనియర్ హీరోలతో సినిమాలు చేయాల్సిందే అని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   17 Feb 2024 11:30 PM GMT
త్రివిక్రమ్ కు టైర్-2 హీరోలే దిక్కా?
X

త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు. రైటర్ గా కెరీర్ స్టార్ చేసి, తన మార్క్ డైలాగ్స్ తో 'మాటల మాంత్రికుడు' అనే పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మెగా ఫోన్ పట్టుకొని ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా రాణించారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి దర్శకుడి చుట్టూ గతంలో ఎన్నడూ లేనంత నెగిటివిటీ వచ్చి చేరింది. ఒక్క సినిమా తన రైటింగ్ ను, దర్శకత్వ సామర్థ్యాలను ప్రశ్నించేలా చేసింది. దీంతో ఆయన నెక్ట్ మూవీ ఎప్పుడు ఉంటుంది? ఎవరితో ఉంటుంది? అనేది క్లారిటీ లేకుండా పోయింది.

'అల వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన త్రివిక్రమ్.. నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని ఇటీవల 'గుంటూరు కారం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 230 కి కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అయినప్పటికీ త్రివిక్రమ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. గురూజీ పెన్నులో ఇంక్ అయిపోయిందని, ఔట్ డేటెడ్ అయిపోయారని ట్రోలింగ్ చేశారు. మహేశ్ పెర్ఫార్మెన్స్, ఆయన చరిష్మా వల్లనే ఆ మాత్రం కలెక్షన్లు వచ్చాయనే కామెంట్లు వచ్చాయి. దీంతో ఇప్పుడు దర్శకుడు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.

నిజానికి 'గుంటూరు కారం' రిలీజ్ కు ముందే త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబోలో ఓ పాన్ ఇండియా మూవీకి హడావిడిగా అనౌన్స్ మెంట్ ఇచ్చారు. కానీ బన్నీ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఆగస్టులో 'పుష్ప 2' సినిమాని ఆడియెన్స్ ముందుకి తీసుకురాడానికి కష్టపడుతున్నారు. సుకుమార్ తో చేస్తున్న ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిస్తే, ఐకాన్ స్టార్ ప్రిపరెన్స్ మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ సాధించిన తర్వాత బన్నీ అన్నీ భారీ స్కేల్ లో చేసే ఆలోచనలో వున్నారు. ఇప్పటికే పలువురు క్రేజీ డైరెక్టర్ల పేర్లు తెర మీదకు వస్తున్నాయి. ఫ్యాన్స్ సైతం గురూజీ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేస్తేనే మంచిదనే విధంగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ అయిన తర్వాత, మళ్లీ వీరిద్దరి కలయికలో లార్జ్ స్కేల్ లో ఓ భారీ ప్రాజెక్ట్ ఉంటుందని.. అది ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని సితార నిర్మాత నాగవంశీ అప్పట్లో ఓ ఇంటర్వూలో చెప్పారు. కానీ తారక్ ఇప్పుడప్పుడే ఫ్రీ అయ్యేలా కనిపించడం లేదు. ప్రస్తుతం 'దేవర' పార్ట్-1 ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీని తర్వాత 'వార్-2' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు. అలానే 'కేజీఎఫ్' ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. మధ్యలో 'దేవర 2' ఉండనే ఉంది. సో యంగ్ టైగర్ డేట్స్ దొరకాలంటే కనీసం రెండు మూడేళ్లు వెయిట్ చేయాల్సి ఉంటుంది.

బన్నీ, తారక్ లతో పాటుగా ఇతర స్టార్ హీరోలు కూడా వెంటనే త్రివిక్రమ్ తో సినిమాలు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే టాలీవుడ్ అగ్ర హీరోలంతా ఇప్పుడు మల్టిఫుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. అందుకే గురూజీ ఈ గ్యాప్ లో మీడియం రేంజ్ మార్కెట్ ఉన్న టైర్-2 హీరోలు, సూపర్ సీనియర్ హీరోలతో సినిమాలు చేయాల్సిందే అని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే నాని - వెంకటేశ్ లతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయనున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. రామ్ పోతినేనితో త్రివిక్రమ్ సినిమా ఉంటుందనే టాక్ కూడా వచ్చింది.

అయితే త్రివిక్రమ్ మాత్రం లాంగ్ గ్యాప్ తీసుకొని మళ్లీ కంబ్యాక్ ఇవ్వాలనే ప్లాన్‌లో ఉన్నారట. దీని కోసం కొత్త స్క్రిప్టు రెడీ చేసే పనిలో పడ్డారట. ఈసారి విడిపోయిన కుటుంబం, చక్కదిద్దే హీరో వంటి కాన్సెప్ట్స్ పక్కన పెట్టి.. పాన్ ఇండియా రీచ్ ఉండే యూనివర్సల్ కాన్సెప్ట్ తో కథ రాస్తున్నారట. ఇది అల్లు అర్జున్ కోసమా, మరొక హీరోకా అనేది చూడాలి. మరోవైపు ఎప్పటిలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి తన హోమ్ బ్యానర్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై ప్రాజెక్ట్స్ నిర్మించనున్నారని టాక్ నడుస్తోంది.