త్రివిక్రమ్ - వెంకీ మూవీ మొదలయ్యేదప్పుడే!
సంక్రాంతి వస్తున్నాం సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.
By: Tupaki Desk | 13 Jun 2025 4:30 PMసంక్రాంతి వస్తున్నాం సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
దీంతో వెంకటేష్ తన తర్వాతి సినిమాను ఎవరితో చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో వెంకటేష్ సినిమా చేస్తాడని వార్తలు రాగా, రీసెంట్ గా ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన ఎక్స్‌లో కూడా పోస్ట్ చేయడంతో త్రివిక్రమ్ తో వెంకటేష్ సినిమా ఉంటుందని అందరికీ క్లారిటీ వచ్చింది.
త్రివిక్రమ్ నెక్ట్స్ రెండు ప్రాజెక్టులు ఎన్టీఆర్, వెంకటేష్ తో లాక్ అయ్యాయని, మిగిలినవన్నీ పుకార్లు మాత్రమేనని, ఒకవేళ ఇవి కాకుండా త్రివిక్రమ్ ఏదైనా సినిమా కన్ఫర్మ్ చేస్తే వాటిని తానే స్వయంగా అనౌన్స్ చేస్తానని నాగవంశీ చెప్పాడు. వంశీ చెప్పిన దాన్ని బట్టి రామ్ చరణ్ తో త్రివిక్రమ్ సినిమా మరియు అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమాలు లేవని క్లారిటీ వచ్చేసింది.
అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ చేతిలో అటు వెంకటేష్ సినిమాతో పాటూ ఇటు ఎన్టీఆర్ సినిమా కూడా ఉంది. ఈ రెండు సినిమాల్లో త్రివిక్రమ్ ముందుగా వెంకటేష్ తో సినిమాను మొదలుపెట్టి దాని తర్వాత ఎన్టీఆర్ తో సెట్స్ పైకి వెళ్లనున్నాడని తెలుస్తోంది. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ ఈ రెండు సినిమాలను నిర్మించనుండగా, వెంకటేష్ సినిమా జులై లేదా ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి వెంకీ బ్లాక్ బస్టర్ సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు వెంకీతో సినిమా చేస్తుండటంతో వీరి కాంబినేషన్ పై అందరికీ మంచి అంచనాలున్నాయి.