యుద్ధాల వెనుక అసలు గుట్టు విప్పిన మాటల మాంత్రికుడు.. త్రివిక్రమ్ మైండ్ బ్లోయింగ్ అనాలిసిస్!
తన పదునైన సంభాషణలతో వెండితెరపై మాయాజాలం చేసే `మాటల మాంత్రికుడు`త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈసారి సామాజిక వేదికపై సరికొత్త దార్శనికతతో కూడిన ఆలోచనలను షేర్ చేసారు.
By: Sivaji Kontham | 13 July 2026 9:16 AM ISTతన పదునైన సంభాషణలతో వెండితెరపై మాయాజాలం చేసే `మాటల మాంత్రికుడు`త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈసారి సామాజిక వేదికపై సరికొత్త దార్శనికతతో కూడిన ఆలోచనలను షేర్ చేసారు. ఒంగోలులో జరిగిన గైనకాలజిస్టుల సమావేశంలో అతిథి త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రపంచ దేశాల యుద్ధాల వెనక కారణాలను ప్రస్థావించారు. ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న పెద్ద పెద్ద యుద్ధాల వెనుక బాహ్యంగా కనిపించే కారణాలు వేరని..అంతర్గతంగా దాగి ఉన్న అసలు రహస్యం వేరని ఆయన చేసిన మైండ్ బ్లోయింగ్ విశ్లేషణ ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది.
సాధారణంగా దేశాల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడు కులం, మతం, ప్రాంతం లేదా జాతీయత వంటి అంశాలే ప్రధాన కారణాలుగా మనకు పైకి కనిపిస్తాయని.. కానీ అది కేవలం భ్రమ మాత్రమేనని త్రివిక్రమ్ తేల్చి చెప్పారు. ఈ బాహ్య కారణాల వెనుక అంతర్జాతీయ వ్యాపార ప్రయోజనాలు, ఆర్థిక లాభాలు మాత్రమే పరమావధిగా దాగి ఉంటాయని స్పష్టం చేశారు. భూమిపై ఉన్న వివిధ రకాల సహజ వనరులను, చమురు నిల్వలను, విలువైన ఖనిజాలను కొల్లగొట్టడం కోసమే తెరవెనుక పెద్ద దేశాలు యుద్ధ తంత్రాన్ని నడుపుతుంటాయని... ప్రస్తుత ఆధునిక కాలంలో సమాజంలోని ప్రతి చిన్న అంశం కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ద్రవ్యంతో (డబ్బుతో) ముడిపడి ఉందనే చేదు నిజాన్ని ఆయన తనదైన శైలిలో వివరించారు.
మానవ సహజ సిద్ధమైన బలహీనతలను విశ్లేషిస్తూ త్రివిక్రమ్ జీవితానికి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. ఈ సృష్టిలో అసలు ఏ తప్పులు చేయని వారు... ఎవరి వద్ద అప్పులు లేని మనుషులు ఎవరూ ఉండరని ఆయన పేర్కొన్నారు. మనుషులు తమ దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు.. తప్పిదాలే ఆ జీవితానికి ఒక పరిపూర్ణతను, ఒక కొత్త అనుభవాన్ని - అందాన్ని ఇస్తాయని అభిప్రాయపడ్డారు. తాము మాత్రమే ఈ సమాజంలో అత్యంత పరిపూర్ణులమనే అహంభావంతో బతకడం ఎవరికీ తగదని.. ప్రతి ఒక్కరిలోనూ లోపాలు ఉంటాయని.. వాటిని అంగీకరించినప్పుడే జీవితం మరింత అందంగా మారుతుందని హితవు పలికారు.
ఈ సదస్సులో వైద్య వృత్తి ప్రాధాన్యతను, ముఖ్యంగా ప్రసూతి గదులలో (లేబర్ రూమ్లలో) గైనకాలజిస్టులు నిరంతరం ఎదుర్కొనే క్లిష్టమైన సవాళ్లను త్రివిక్రమ్ ప్రత్యేకంగా అభినందించారు. సినిమాల్లో వైద్యులను నెగెటివ్ గా చూపించడానికి కారణమేమిటి? అని ప్రశ్నించగా.. సరైన కార్మిక సంఘాల్లో లేకపోవడం వల్లనే అని సరదాగా ఛమత్కరించారు.
దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి సుమారు 2000 మందికి పైగా ప్రముఖ గైనకాలజీ వైద్యులు హాజరైన ఈ మహాసభలో త్రివిక్రమ్ ప్రసంగం ఒక హైలైట్‌గా నిలిచింది. కేవలం సినిమాల్లోనే కాకుండా.. నిజ జీవితంలోనూ సమాజాన్ని.. అంతర్జాతీయ పరిణామాలను ఆయన ఎంత సూక్ష్మంగా గమనిస్తారో ఈ సదస్సు ద్వారా మరోసారి నిరూపితమైంది. మానవ సంబంధాలలో ఆర్థిక ప్రాధాన్యతను గుర్తిస్తూనే.. వైద్యుల వృత్తిపరమైన బాధ్యతలను గౌరవించిన త్రివిక్రమ్ మాటలు సదస్సుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేశాయి.
