సిరివెన్నెల (X) త్రివిక్రమ్: ఆ రోజు అసలేం జరిగిందంటే?
ఇటీవల ఓ ప్రత్యేక కార్యక్రమంలో మరోసారి సిరివెన్నెలపై తన ఎమోషనల్ స్పీచ్ అంతగా ప్రజలను ఆకర్షించడానికి కారణమేమిటో త్రివిక్రమ్ వివరించారు.
By: Tupaki Desk | 13 May 2025 9:37 AM ISTతెలుగు సినిమా పాటల రచనలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక ప్రత్యేక అధ్యాయం. ఆయన శిఖరం ఎత్తు. పాటల పూదోట విహారిగా ఆయన సృజన అసాధారణమైనది. సిరివెన్నెలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ముఖ్యంగా దర్శకరచయిత త్రివిక్రమ్ ఆయనను గుండె లోతుల్లోంచి అర్థం చేసుకుని అభిమానించారు. అందుకే అతడు ఇచ్చిన ఒక ఎమోషనల్ స్పీచ్ గురించి కొన్నేళ్ల క్రితం చాలా చర్చ జరిగింది. అంత డెప్త్ తో అర్థం చేసుకుని ఆయనను హృదయ పలకం నుంచి ఆవిష్కరించాయి త్రివిక్రముని మాటలు.
ఇటీవల ఓ ప్రత్యేక కార్యక్రమంలో మరోసారి సిరివెన్నెలపై తన ఎమోషనల్ స్పీచ్ అంతగా ప్రజలను ఆకర్షించడానికి కారణమేమిటో త్రివిక్రమ్ వివరించారు. ఈటీవీలో ప్రసారమైన `నా ఉచ్ఛాసం కవనం` కార్యక్రమంలో మాట్లాడుతూ త్రివిక్రమ్ తన ప్రసంగంలో సిరివెన్నెల శాస్త్రిని తాను ఆరోజు ప్రశంసించలేదని, ఆయనపై తన నిరాశను వ్యక్తం చేశానని చెప్పారు. నిజానికి ఆరోజు త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్ విన్నవారంతా దివంగత గీత రచయిత సిరివెన్నెలపై ప్రశంసల వర్షం కురిపించాడని చాలామంది భావించారు. కానీ అతడు సిరివెన్నెల ప్రతిభకు తగ్గ అవకాశాలు అందుకోలేదని ఆవేదన వ్యక్తం చేసాడని కొందరికే అర్థమైంది. నా ప్రశంసలో అతిశయోక్తి , నాటకీయత ఉంటాయి.. కానీ నేను నిజం మాట్లాడాను.. అందుకే ఆ ప్రసంగం చాలా మందికి కనెక్టయిందని కూడా త్రివిక్రమ్ అన్నారు.
ఆయన తన రచనలతో సినిమా స్థాయిని పెంచారు. ప్రజలకు అర్థమయ్యేందుకు కవి సింపుల్ పదాలతో రాయాలని బలవంతం చేస్తే అది అతడికి శిక్ష లాంటిది.. కానీ సిరివెన్నెల రాజీకి రాడు.. అని త్రివిక్రమ్ అన్నారు. సిరివెన్నెల గీతరచన, వ్యాసరచన మాత్రమే కాదు, ఆయన ఇంకా చాలా చేయగలరు. కానీ పరిమిత అవకాశాలు మాత్రమే అందుకున్నారు. తెలుగు సినిమా సరిహద్దులు అతడిని రేసులో వెనక్కి నెట్టాయి! అని అప్పటి సిరివెన్నెల వెనకబాటు గురించి త్రివిక్రమ్ గుర్తు చేసారు. ఆ సమయంలో సిరివెన్నెలకు అవకాశాలు లేకపోవడంపై త్రివిక్రమ్ ఆవేదనను వ్యక్తం చేసారు. త్రివిక్రమ్- సిరివెన్నెల కాంబినేషన్ లో ఎన్నో క్లాసిక్స్ అనదగ్గ పాటలు వచ్చిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్లు అందించడంలో సిరివెన్నెల కీలక రచయితగా కొనసాగారు.
