త్రివిక్రమ్ ఊరిస్తున్న కథ అదేనా?
అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయాలనుకున్న మెగా మూవీ.. చేతులు మారడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 11 Jun 2025 9:15 AMఅల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయాలనుకున్న మెగా మూవీ.. చేతులు మారడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 'పుష్ప-2' తర్వాత బన్నీ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తాడనే అంతా అనుకున్నారు. కానీ అతనేమో అట్లీ సినిమాను మొదలుపెట్టేశాడు. త్రివిక్రమ్ సినిమాకు ప్రి ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్లే బన్నీ మధ్యలో వేరే సినిమా చేస్తున్నాడని అనుకున్నారు. తీరా చూస్తే త్రివిక్రమ్ సైతం విక్టరీ వెంకటేష్‌తో సినిమాకు రెడీ అవుతుండడంతో ఈ వ్యవహారంలో ఏదో ట్విస్ట్ ఉందని అర్థమైంది. త్రివిక్రమ్‌తో చేయాలనుకున్న మెగా మైథలాజికల్ మూవీ మీద బన్నీకి గురి కుదరకపోవడం వల్లే ఆ ప్రాజెక్టును వదిలేశాడా.. మొత్తంగా ఆ సినిమా ఆగిపోయిందా అనే చర్చ మొదలైంది. ఇప్పుడేమో ఆ కథ బన్నీ నుంచి తారక్‌కు వెళ్లిందని.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని జోరుగా వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ బన్నీ వద్దనుకున్న.. తారక్ ఓకే చేసిన కథ ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది మైథలాజికల్ మూవీ అని నిర్మాత నాగవంశీ ఇంతకుముందే క్లారిటీ ఇచ్చాడు. తెలుగు తెరపై ఎన్నో పురాణ గాథలు వచ్చినప్పటికీ.. ఎక్కువగా టచ్ చేయని ఒక క్యారెక్టర్ అంటూ నాగవంశీ ఈ కథ గురించి హిట్ ఇచ్చాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం త్రివిక్రమ్ చేయాలనుకుంటున్నది సుబ్రహ్మణ్యస్వామి కథ అట. తెలుగులో, అలాగే ఇతర భాషల్లో శివుడి మీద, వినాయకుడి మీద చాలా సినిమాలు వచ్చాయి. ఆ పాత్రలను ఎన్నోసార్లు తెరపై చూశాం. కానీ శివుడి చిన్న కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి కథ గురించి సినిమాల్లో చూపించిన సందర్భాలు అరుదు. దేవుళ్లలో ఆయన అంత పాపులర్ కాదని కూడా చెప్పాలి.
ఐతే సుబ్రహ్మణ్యస్వామి కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు ఉన్నాయని.. పురాణాల మీద గొప్ప పట్టున్న త్రివిక్రమ్ ఆయన కథనే చెప్పబోతున్నారని అంటున్నారు. ఐతే ఈ కథ తనకు సూటవ్వదనే బన్నీ తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి తారక్ ఈ పాత్రలో ఎలా ఇమిడిపోతాడో చూడాలి. కెరీర్ ఆరంభం నుంచి చాలావరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్లే తీస్తూ వచ్చిన త్రివిక్రమ్.. మిగతా స్టార్ డైరెక్టర్ల మాదిరి పాన్ ఇండియా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఈవెంట్ ఫిలిమ్స్ ట్రై చేయలేదు. ప్రశాంత్ వర్మ లాంటి యంగ్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోతున్న టైంలో త్రివిక్రమ్ రూటు మార్చాలనే అభిప్రాయం ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతున్న దశలో ఆయన బన్నీతో ఓ మెగా ప్రాజెక్టు చేయాలనుకున్నారు. అది కాస్తా ఇప్పుడు తారక్ వద్దకు వచ్చింది.