ఆలయానికి త్రిష ఖరీదైన బహుమానం..!
రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా త్రిష కొనసాగుతోంది. ఇప్పటికీ ఈమె సినిమాలు ఏడాదికి రెండు మూడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
By: Tupaki Desk | 28 Jun 2025 10:39 AM ISTరెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా త్రిష కొనసాగుతోంది. ఇప్పటికీ ఈమె సినిమాలు ఏడాదికి రెండు మూడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈమెతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చాలా మంది హీరోయిన్స్ కనుమరుగు అయ్యారు, కొందరు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అమ్మగా, అక్కగా సినిమాలు చేస్తున్నారు. త్రిష మాత్రం ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోలకు జోడీగా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవలే ఈమె కమల్ హాసన్‌తో కలిసి థగ్ లైఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. అయినా కూడా త్రిష ఏ మాత్రం నిరుత్సాహం వ్యక్తం చేయకుండా సినిమాల జోరు కంటిన్యూ చేస్తుంది.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈమె నటించిన నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి. ఏడాది సగం కూడా పూర్తి కాకుండానే ఇన్ని సినిమాలను విడుదల చేసిందంటే త్రిష ఏ స్థాయిలో బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన నాలుగు సినిమాల్లో మూడు తమిళ్ సినిమాలు కాగా, ఒకటి మలయాళం సినిమా. ఇక ఇదే ఏడాది రాబోయే రోజుల్లో తెలుగు సినిమా విశ్వంభరతో పాటు, తమిళ్ మూవీ కురుప్పు తో రాబోతుంది. ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ రెండు సినిమాలను రూపొందిస్తున్నారు. ఇప్పుడు వెంటనే త్రిష నటించిన సినిమాలు విడుదలకు లేవు. అయినా కూడా ఈమె చేసిన ఒక పని కారణంగా వార్తల్లో నిలిచింది.
ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్స్ ఆలయాలకు యాంత్రిక ఏనుగులను బహుమానంగా ఇస్తున్నారు. నిజమైన ఏనుగులను బంధించి దేవుడి సేవకు వినియోగించడం మంచిది కాదని కొన్ని స్వచ్ఛంద సంస్థలు యాంత్రిక ఏనుగులను దేవాలయాలకు ఇచ్చే పని చేపట్టింది. అందులో భాగంగానే పలు ఆలయాల్లో మెకానికల్ ఏనుగులు, రోబోటిక్ ఏనుగులను బహూకరించడం జరిగింది. తాజాగా హీరోయిన్ త్రిష కూడా ఒక రొబోటిక్ ఏనుగును స్వచ్ఛంద సంస్థతో కలిసి బహూకరించడం జరిగింది. ఇటీవలే ఆ ఏనుగు దేవాలయంకు చేరుకుందని, త్రిష మంచి మనసుతో ఏనుగును బహూకరించినందుకు గాను భక్తులు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అరుప్పుకొట్టైలోని అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్ ఆలయానికి త్రిష ఈ మర ఏనుగును బహుమానంగా ఇచ్చారు. ఆ ఏనుగుకు 'గజ' అనే పేరు పెట్టినట్లు ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ పీపుల్స్ ఫర్ క్యాటిల్ ఇండియాతో కలిసి త్రిష ఈ ఏనుగును బహుమానంగా ఇచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో రథ యాత్రల సమయంలో, ఉత్సవాల సమయంలో నిజమైన ఏనుగుల వల్ల తొక్కిసలాట జరగడం, ప్రతి ఏడాది పదుల మంది మృతి చెందడం జరుగుతుంది. అందుకే ఆలయాల్లో పూజలు, ఉత్సవాల కోసం నిజమైన ఏనుగులను కాకుండా ఇలా మర ఏనుగులను వినియోగించడం అన్ని విధాలుగా ఉపయోగ దాయకం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే పలువురు సినిమా స్టార్స్ తమ స్థాయికి తగ్గట్లుగా మెకానికల్ ఏనుగును ఆలయాలకు బహూకరిస్తున్నారు.
