Begin typing your search above and press return to search.

రాజ‌కీయాల్లోకి త్రిష‌.. సినిమాల‌కు గుడ్ బై!

దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా వెలుగు వెలుగుతున్న త్రిష కృష్ణన్.. తన సుదీర్ఘ సినీ ప్రస్థానానికి ముగింపు పలకబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిగ్గా మారింది.

By:  Sivaji Kontham   |   6 April 2026 10:27 PM IST
రాజ‌కీయాల్లోకి త్రిష‌.. సినిమాల‌కు గుడ్ బై!
X

దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా వెలుగు వెలుగుతున్న త్రిష కృష్ణన్.. తన సుదీర్ఘ సినీ ప్రస్థానానికి ముగింపు పలకబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిగ్గా మారింది. ప్రస్తుతం న‌టిస్తున్న‌ ప్రాజెక్టులు తప్ప... కొత్తగా మరే ఇతర సినిమాలకు సంతకం చేయకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్న `విశ్వంభర` చిత్రం త‌రిష‌ కెరీర్‌ చివరి సినిమా కానుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

ప్రముఖ నటుడు, సీనియర్ జర్నలిస్ట్ చిత్ర లక్ష్మణన్ తన `టూరింగ్ టాకీస్` ఛానెల్‌లో త్రిష రిటైర్మెంట్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. త్రిష ఇకపై సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు పలువురు నిర్మాతలు తనకు సమాచారం అందించారని ఆయన వెల్లడించారు. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ విజయ్ తన రాజకీయ పార్టీ `టీవీకే` కోసం సినిమాలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించగా.. త్రిష కూడా ఆయన బాటలోనే పయనిస్తూ రాజకీయ రంగానికి లేదా వ్యక్తిగత జీవితానికో పరిమితం కానున్నారని సమాచారం.

గత కొంతకాలంగా విజయ్ - త్రిష మధ్య ఉన్న సంబంధంపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్నారని.. అందుకే విజయ్ భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని వస్తున్న వదంతులు ఈ రిటైర్మెంట్ వార్తలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఇటీవల ఒక వివాహ వేడుకకు ఈ జంట ఒకే రకమైన రంగు దుస్తులు ధరించి హాజరు కావడం.. అక్కడి నుంచి కలిసి వెళ్లిపోవడం మీడియా కంట పడటంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు త్రిష నిరాకరించారు.

త్రిష ఇటీవల ఇన్‌స్టాలో షేర్ చేసిన ఒక నిగూఢమైన పోస్ట్ కూడా ఈ చర్చలకు తోడైంది. ``ప్రేమ లేకపోతే దేనికీ అర్థం ఉండదు`` అంటూ త్రిష పెట్టిన పోస్ట్.. త‌న‌ జీవితంలో పెను మార్పులకు సంకేతమని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. నటన నుంచి త్రిష‌ తప్పుకోవడానికి అసలు కారణం విజయ్‌తో వివాహమా లేక అత‌డు స్థాపించిన రాజకీయ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడమా? అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. ఏది ఏమైనా త్రిష మౌనం అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం త్రిష నటించిన `కరుప్పు` (తెలుగులో వీరభద్రుడు) విడుదలకు సిద్ధంగా ఉంది. సామాజిక అంశాల నేపథ్యంలో ఫాంటసీ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రలో మెరవనున్నారు. ఒకవేళ `విశ్వంభర`, `కరుప్పు` చిత్రాలే త్రిష చివరి సినిమాలు అయితే.. దక్షిణాది వెండితెర ఒక అద్భుతమైన నటిని కోల్పోయినట్లేనని సినీ ప్రియులు భావిస్తున్నారు. ఈ వార్తలపై త్రిష నుంచి అధికారిక స్పష్టత వస్తే తప్ప ఈ పుకార్ల‌కు తెరపడేలా లేదు.