100 కోట్లకు దగ్గరగా త్రిష ప్లానింగ్
గత కొంతకాలంగా సీనియర్ హీరోయిన్స్ కు డిమాండ్ పెరుగుతోంది. ఐదేళ్ల క్రితం వరకు 30 దాటితే సపోర్టింగ్ రోల్స్ తో సర్దుకునే వారు.
By: Tupaki Desk | 24 April 2026 1:33 PM ISTగత కొంతకాలంగా సీనియర్ హీరోయిన్స్ కు డిమాండ్ పెరుగుతోంది. ఐదేళ్ల క్రితం వరకు 30 దాటితే సపోర్టింగ్ రోల్స్ తో సర్దుకునే వారు. కానీ ప్రస్తుతం సీనియర్ భామలు 40కి దగ్గరవుతున్నా క్యారెక్టర్ కు తగ్గట్టుగా హీరోలకు జోడిగా కొనసాగుతున్నారు. ఆ లిస్టులో నయన్, త్రిష క్రేజే వేరు. ముఖ్యంగా ఇప్పుడు త్రిషకు ఉన్న డిమాండ్ మామూలుగా లేదు. హీరోయిన్‌గా రెండు దశాబ్దాలు దాటినా రెమ్యునరేషన్ తగ్గలేదు, డిమాండ్ ఆగలేదు. పైగా ఏజ్ పెరిగే కొద్దీ బ్యాంక్ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతోంది.
లేటెస్ట్ గా త్రిష కృష్ణన్ నెట్ వర్త్ 85 కోట్లు దాటిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంకో రెండు సినిమాలు హిట్ అయితే 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లిపోతుందని తెలుస్తోంది. మరి ఈ ‘సైలెంట్ సక్సెస్’ వెనక అసలు ఫార్ములా ఏంటి అనే వివరాల్లోకి వెళితే.. 1999లో ‘జోడి’తో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎవరూ ఊహించి ఉండరు, ఈ అమ్మాయి 2026లో కూడా కోట్లు తీసుకుంటూ లీడ్ రోల్స్ చేస్తుందని. వర్షం, ఘిల్లితో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకుంది.
మధ్య మధ్యలో అలా సక్సెస్ చూసిన అమ్మడు హీరోయిన్ గా ఇక కష్టమే అనుకుంటున్న సమయంలో 96తో క్లాస్ ఆడియన్స్‌ని పట్టేసింది. కెరీర్‌లో గ్యాప్ వచ్చిన ప్రతిసారీ ‘విన్నైతాండి వరువాయా’, ‘పొన్నియిన్ సెల్వన్’ లాంటి సినిమాతో బౌన్స్ బ్యాక్ అయింది. అంటే ప్రతి ఐదేళ్లకు ఒకసారి తన మార్కెట్‌ని తనే రీసెట్ చేసుకుంటూ వచ్చింది. అందుకే 25 ఏళ్ల తర్వాత కూడా రేసులో ఉంది. ఇప్పుడు త్రిష ఒక్కో ప్రాజెక్ట్‌కి 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటోందని ఇండస్ట్రీ టాక్.
లియోకి 5 కోట్లు రెమ్యునరేషన్ దక్కినట్లు గతంలో టాక్ వచ్చింది. అలాగే సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ మరో బిగ్ ఇన్‌కమ్. ఏడాదికి దాదాపు 9 కోట్లు యాడ్స్ నుంచే వస్తున్నాయట. ఇక్కడే త్రిష తెలివి కనిపిస్తుంది. కేవలం స్కిన్ కేర్, బ్యూటీ బ్రాండ్స్ కాకుండా ఫైనాన్స్, జ్యువెలరీ, రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. 40 ప్లస్ ఏజ్‌ని లయబిలిటీ కాకుండా అసెట్‌గా మార్చుకుంది. అందుకే బ్రాండ్స్ ఇప్పటికీ ఆమెనే నమ్ముతున్నాయి.
సంపాదన ఎంత ముఖ్యమో, దాన్ని ఎక్కడ పెట్టాలో తెలియడం అంతకంటే ముఖ్యం. త్రిష ఆ విషయంలో పక్కా ప్లానింగ్‌తో ఉంది. చెన్నైలో 10 కోట్లకు పైగా విలువ చేసే ఇల్లు ఉందట. అలాగే హైదరాబాద్‌లో కూడా 6 కోట్ల ప్రాపర్టీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 15 ఏళ్ల క్రితం కొన్న స్థలాలు ఇప్పుడు మూడు రెట్లు అయ్యాయి. మెర్సిడెస్, బీఎండబ్ల్యూ కార్స్ కలెక్షన్ తో ఆమె లెక్క 4 కోట్లు. ఇవన్నీ కేవలం షో కోసం కాదు. స్టార్ ఇమేజ్‌ని కాపాడుకుంటూనే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకునే మార్గాలని చెప్పవచ్చు. సినిమా ఫీజుని నేరుగా ల్యాండ్‌లోకి మళ్లించడం వల్లే నెట్ వర్త్ స్టడీగా పెరిగింది.
హిట్స్ ఉన్నప్పుడు దాచుకోవడం, ఫ్లాప్స్ వచ్చినప్పుడు ప్యానిక్ కాకపోవడం, ట్రెండ్ మారిన ప్రతిసారీ తనని తాను మార్చుకోవడంతో అమ్మడు ఇంతకాలం ఇండస్ట్రీలో నిలబడింది అని చెప్పవచ్చు. అందుకే 1999 బ్యాచ్ హీరోయిన్స్ అందరూ సైడ్ అయిపోయినా, త్రిష మాత్రం 100 కోట్ల మార్క్‌కి దగ్గరగా వచ్చింది. స్టార్‌డమ్ టెంపరరీ, కానీ స్మార్ట్ ప్లానింగ్ పర్మనెంట్ అని ప్రూవ్ చేసింది. ఇక ఈ స్టార్ హోదాను అమ్మడు ఇంకా ఎంత కాలం కొనసాగిస్తుందో చూడాలి.
