Begin typing your search above and press return to search.

ఆ హీరో శివుడైతే? అత‌డి కోసం పార్వ‌తి సిద్దం!

`ఆశ్రమ్` వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి త్రిధా చౌదరి. భవిష్యత్తులో తాను నటించాలనుకుంటోన్న కలల ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

By:  Srikanth Kontham   |   25 May 2026 8:58 AM IST
ఆ హీరో  శివుడైతే? అత‌డి కోసం పార్వ‌తి సిద్దం!
X

`ఆశ్రమ్` వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి త్రిధా చౌదరి. భవిష్యత్తులో తాను నటించాలనుకుంటోన్న కలల ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కంటెంట్ ఆధారిత చిత్రాలలో నటించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అమ్మ‌డు పౌరాణిక - చారిత్రక నేపథ్యం ఉన్న కథలపై తనకున్న మక్కువను బయటపెట్టారు. భారీ స్థాయిలో రూపొందే ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగం కావాలనేది తన చిరకాల కోరిక అని తెలిపారు.

భారతీయ సాహిత్య రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన అమిష్ త్రిపాఠి రచించిన `శివ త్రిలోజీ` పుస్తకాల ఆధారంగా తెరకెక్కే చిత్ర విశ్వంలో నటించడమే ప్రధాన లక్ష్యమని త్రిధా పేర్కొన్నారు. తనకు మొదటి నుండి శివుడంటే అపారమైన భక్తి, గౌరవం ఉన్నాయ‌న్నారు . ఈ ఐకానిక్ నవలను వెండితెరపై ఆవిష్కరించే క్రమంలో వచ్చే పౌరాణిక పాత్ర ఏదైనా సరే? అందులో నటించడం నటిగా తనకు లభించే అద్భుతమైన అవకాశమని ఆమె భావిస్తున్నారు. ఆ తరహా ప్రాజెక్ట్ కెరీర్‌కు మైలురాయిగా నిలుస్తుందని నమ్ముతున్నారు.

ఈ కలల ప్రాజెక్టుపై ఆమెకు మరింత ఆసక్తి పెరగడానికి బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కూడా ఓ కారణమని త్రిధా వెల్లడించారు. అమిష్ త్రిపాఠి `శివ త్రిలోజీ` సినిమా హక్కులను రణ్‌వీర్ సింగ్ సొంతం చేసుకున్నారని తెలి సిందని, ఆయనతో కలిసి పనిచేయడానికి తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానన్నారు. రణ్‌వీర్ సింగ్‌కు పెద్ద అభిమానినని, ఆయన నటనలోని ఎనర్జీ ఎంతో ఇష్టమన్నారు. లార్డ్ శివ కాన్సెప్ట్, రణ్‌వీర్ తో కలసి న‌టించే పౌరాణిక చిత్రంలో అవ‌కాశం వ‌స్తే నిజంగా త‌న కల సాకారమవ్వడమేనని ఆనందం వ్యక్తం చేశారు.

త్రిధా చౌదరి కెరీర్ ప్రస్థానాన్ని పరిశీలిస్తే అమ్మ‌డు ఒకే భాషకు పరిమితం కాలేదు. హిందీ, బెంగాలీ , తెలుగు చిత్ర పరిశ్రమల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ రూపొందించిన బెంగాలీ చిత్రం `మిషావర్ రావశ్యో`తో వెండితెరకు పరిచయమైన అమ్మ‌డు ఆ తర్వాత పలు డిజిటల్, టెలివిజన్ ప్రాజెక్టులతో మెప్పించారు. తాజాగా సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన `ఆఖరి సవాల్`చిత్రంలో కూడా కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

గ్లామర్ ప్రపంచంలో నటీమణులకు బాహ్య సౌందర్యం ఎంత ముఖ్యమో? అంతకంటే మిన్నగా నటనకు లభించే గుర్తింపు ముఖ్యమని త్రిధా అభిప్రాయపడ్డారు. ఎంత గ్లామరస్‌గా క‌నిపించినా? తాము పోషించే పాత్రకు పూర్తి న్యాయం చేయలేకపోతే ఆ ప్రదర్శన నిరర్థకమవుతుందన్నారు. నటిగా పాత్రలోని లోతును అర్థం చేసుకుని, దానికి ప్రాణం పోయడమే మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.