Begin typing your search above and press return to search.

టాక్సిక్ (X) దురంధ‌ర్ 2: బిజినెస్ డీల్స్‌లో ఎవ‌రు బెస్ట్?

భారతీయ సినీ చరిత్రలోనే అరుదైన బాక్సాఫీస్ సమరానికి 2026 మార్చి నెల వేదిక కాబోతోంది.

By:  Tupaki Desk   |   2 March 2026 9:36 AM IST
టాక్సిక్ (X) దురంధ‌ర్ 2: బిజినెస్ డీల్స్‌లో ఎవ‌రు బెస్ట్?
X

భారతీయ సినీ చరిత్రలోనే అరుదైన బాక్సాఫీస్ సమరానికి 2026 మార్చి నెల వేదిక కాబోతోంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న `టాక్సిక్`, బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన `దురంధర్ 2` (దురంధర్: ది రివెంజ్) చిత్రాలు ఒకే రోజున విడుదలవుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ, భారతీయ సినిమా మార్కెట్ పరిధిని ప్రపంచవ్యాప్తం చేస్తున్నాయి.

యష్ `టాక్సిక్` - రికార్డ్ స్థాయి బిజినెస్:

కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ చేస్తున్న సినిమా కావడంతో `టాక్సిక్` పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం ఇప్పటికే దక్షిణాదిలో కనీవినీ ఎరుగని రీతిలో బిజినెస్ జరుపుకుంది. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు (ఎస్వీసీ బ్యాన‌ర్) సుమారు 120 కోట్ల రూపాయలకు (అడ్వాన్స్ ప్రాతిపదికన) దక్కించుకున్న‌ట్టు ప్ర‌ముఖ జాతీయ మీడియాలు ప్ర‌చురించాయి. ఇది ఒక నాన్-తెలుగు చిత్రానికి దక్కిన అత్యధిక ధర. అలాగే తమిళనాడులో 63 కోట్లు, కేరళలోనూ భారీ మొత్తానికి డీల్స్ కుదిరాయి. ఓవర్సీస్ హక్కులు కూడా 105 కోట్ల రూపాయలకు అమ్ముడవ్వడం యష్ గ్లోబల్ క్రేజ్‌కు నిదర్శనం.

రణవీర్ సింగ్ `దురంధర్ 2` - నాన్-థియేట్రికల్ కింగ్:

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన `దురంధర్` పార్ట్ 1 గత ఏడాది 1000 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. దాని కొనసాగింపుగా వస్తున్న `దురంధర్ 2` (ది రివెంజ్) విడుదలకు ముందే లాభాల్లోకి వచ్చేసింది. ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు (డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్) కలిపి సుమారు 245 కోట్ల రూపాయల భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఇందులో జియో హాట్‌స్టార్ డిజిటల్ హక్కులను 150 కోట్లకు, స్టార్ నెట్‌వర్క్ శాటిలైట్ హక్కులను 50 కోట్లకు కొనుగోలు చేశాయి. కేవలం ఈ హక్కుల ద్వారానే సినిమా బడ్జెట్‌లో మెజారిటీ భాగం రికవరీ అయిపోయిందనేది టాక్.

బిజినెస్ ప‌రంగా ఎవరు బెస్ట్ పొజిషన్?

ఈ రెండు సినిమాల బిజినెస్ మోడల్స్ భిన్నంగా ఉన్నాయి. టాక్సిక్ సినిమా థియేట్రికల్ బిజినెస్, దక్షిణాది మార్కెట్‌లో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. యష్ బ్రాండ్ ఇమేజ్ కారణంగా డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరలు చెల్లించడానికి సిద్ధపడ్డారు. మరోవైపు `దురంధర్ 2` హిందీ మార్కెట్ , నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా సేఫ్ జోన్ లో ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం.. `టాక్సిక్` సినిమాకు ఉన్న పాన్-ఇండియా రీచ్, విదేశీ మార్కెట్ డిమాండ్ చూస్తుంటే యష్ సినిమా కాస్త మెరుగైన పొజిషన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది.

రిలీజ్ తేదీ- థియేటర్ల వివరాలు:

ఈ రెండు భారీ చిత్రాలు 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్నాయి. ఉగాది , ఈద్ సెలవులను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఈ తేదీని ఖరారు చేశారు. థియేటర్ల సంఖ్య విషయానికి వస్తే.. యష్ `టాక్సిక్` సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9,000 నుండి 10,000 స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా కెనడా, లండన్ వంటి దేశాల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక `దురంధర్ 2` కూడా బాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య సుమారు 6,500 నుండి 7,500 థియేటర్లలో అలరించడానికి సిద్ధమైంది.

ఒకే రోజున రెండు 1000 కోట్ల క్లబ్ సినిమాలు పోటీ పడటం భారతీయ సినిమా చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. ఈ బాక్సాఫీస్ వార్ వల్ల ఏ సినిమా పైచేయి సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సంజయ్ గుప్తా వంటి ట్రేడ్ విశ్లేషకులు ఈ క్లాష్ వల్ల వసూళ్లు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నా.. ప్రేక్షకులు మాత్రం ఈ రెండింటిలో ఏది `బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్` అవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.