'టాక్సిక్' మూవీ రివ్యూ
'కేజీఎఫ్'తో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ గా అవతరించాడు యశ్. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత అతను చాలా టైమ్ తీసుకుని చేసిన చిత్రం.. టాక్సిక్.
By: Tupaki Desk | 26 Aug 2026 1:00 PM IST'టాక్సిక్' మూవీ రివ్యూ
నటీనటులు: యశ్ - కియారా అద్వానీ - నయనతార - తార సుతారియా - హ్యూమా ఖురేషి - సుదేవ్ నాయర్ తదితరులు
సంగీతం: రవి బ్రసూర్ - విశాల్ మిశ్రా - తనిష్క్
ఛాయాగ్రహణం: రాజీవ్ రవి
నిర్మాతలు: వెంకట్ కె.నారాయణ - యశ్
రచన - దర్శకత్వం: గీతు మోహన్ దాస్
'కేజీఎఫ్'తో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ గా అవతరించాడు యశ్. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత అతను చాలా టైమ్ తీసుకుని చేసిన చిత్రం.. టాక్సిక్. భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఆ అంచనాలను ఏ మేర అందుకుందో చూద్దాం పదండి.
కథ: 1947లో ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చాక గోవా ప్రాంతంలో ఆధిపత్యం కోసం మాఫియా గ్యాంగుల మధ్య పోరాటం సాగుతున్న సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన అక్కా తమ్ముళ్ళు గంగ (నయనతార).. రాయ (యశ్) ఎన్నో కష్టాలు పడి ఒక స్థాయికి చేరుకుంటారు. తనకు ఎదురొచ్చిన వాళ్లందరినీ అడ్డు తొలగించుకుంటూ గోవా మాఫియా సామ్రాజ్యం మీద పట్టు చిక్కించుకున్న రాయ.. సిటీలో బిగ్ షాట్ అయిన సాల్వడార్ కూతురు రెబెకా (తార సుతారియా) ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు. కానీ కొంత కాలానికి సర్కస్ డాన్సర్ అయిన నడియా (కియారా) ప్రేమలో పడతాడు రాయ. దీంతో రెబెకా.. ఆమె తండ్రితో రాయకు ఘర్షణ మొదలవుతుంది. మరోవైపు రాయ శత్రువులు అతడి మీద ఎటాక్ చేస్తూ ఉంటారు. అతడి చుట్టూ నిరంతరం కుట్రలు జరుగుతుంటాయి. మరి ఈ సమస్యల వలయం నుంచి రాయ బయట పడ్డాడా? తన ఆధిపత్యాన్ని నిలుపుకున్నాడా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ: ‘టాక్సిక్’ సినిమా మొత్తంగా హీరో మూడు రకాల పనులు చేస్తుంటాడు. మొదటిది కత్తి లేదా గన్ను పట్టి ఎవరో ఒకరిని చంపడం. వాడిన కత్తి, గన్ను మళ్లీ వాడకుండా.. ఒకరిని చంపినట్లు ఇంకొకరిని చంపకుండా.. సినిమా అంతా ఒకటే విధ్వంసం అన్నమాట. ఇక హీరో చేసే రెండో పనేమో.. మందు కొట్టడం. సమయం ఉండదు.. సందర్భం ఉండదు. ఫైటుకి ముందు తర్వాత.. రొమాన్సుకి ఇటు అటు.. ఒకసారి తాగిన బ్రాండు ఇంకోసారి తాగకుండా ఒకటే తాగుడు. ఇక హీరో గారి చేసే మూడో ముఖ్యమైన పని.. అమ్మాయిలతో శృంగారం. తన ఇంట్రడక్షన్ సీన్లోనే.. ప్రత్యర్థులను అంతమొందించడానికి కూడా అతను సెక్సునే ఆయుధంగా చేసుకుంటాడు. కార్లో సెక్స్ చేయడం ద్వారా వైబ్రేషన్ ద్వారా బాంబుల మోత మోగిస్తాడు. తారా సుతారియా.. కియారా అద్వానీ.. రుక్మిణి వసంత్.. ఇలా మార్చి మార్చి ఎంతమందితో శృంగార సన్నివేశాలో. సినిమాలో చెప్పుకోవడానికి ఇంకేం లేదు పెద్దగా. ఈ మూడు రకాల పనులతోనే మూడుంబావు గంటల సినిమాను లాగించేసింది దర్శకురాలు గీతు మోహన్ దాస్. ‘టాక్సిక్’ సినిమా మొదలుపెట్టే ముందే దీనికి ఈ టైటిల్ ఖరారు చేయడం విశేషంగానే చెప్పుకోవాలి. ఆ టైటిల్ కు న్యాయం చేయడానికి గీతు అండ్ టీమ్ పడ్డ కష్టం అలాంటిలాంటిది కాదు. అంత టాక్సిక్ గా అనిపిస్తాయి ఇందులోని సన్నివేశాలు.
ఒక ట్రెండ్ సెట్టింగ్.. బ్లాక్ బస్టర్ సినిమా చేశాక ఆ హ్యాంగోవర్ నుంచి బయటపడడం అంత తేలిక కాదు. యశ్ కూడా ‘కేజీఎఫ్’ హ్యాంగోవర్లోనే ‘టాక్సిక్’ సినిమా చేశాడన్నది స్పష్టం. తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథ అయిన కుర్రాడు.. మాఫియా సామ్రాజ్యంలోకి అనామకుడిగా అడుగుపెట్టి అందలమెక్కడం.. ‘కేజీఎఫ్’ను గుర్తుకుతెచ్చే ‘టాక్సిక్’ స్టోరీ లైన్ ఇది. పీరియడ్ స్టోరీ.. స్టైలిష్ మేకింగ్-టేకింగ్ తో ‘కేజీఎఫ్’ను అనుకరించే ప్రయత్నం గట్టిగానే చేశారు. కానీ కథలో విషయం లేకపోతే.. స్క్రీన్ ప్లేలో క్లారిటీ మిస్సయియితే.. సన్నివేశాలు అర్థం పర్థం లేకుండా సాగితే.. సినిమాను ఎంత భారీగా- స్టైలిష్ గా తీసినా ప్రయోజనం ఉండదు. ‘టాక్సిక్’తో వచ్చిన సమస్య ఇదే. సినిమాలో అంతా మంచే చూపించాలి.. తెర మీద హింస ఉండకూడదు.. హీరో మందు కొట్టకూడదు.. అమ్మాయిలతో శృంగారం చేయకూడదు అని నీతి వాక్యాలు చెప్పలేం కానీ.. సినిమా అంతా అవి తప్ప ఇంకేమీ చూపించకపోతే.. కథలో అసలే కదలికా లేకపోతే.. ఏ పాత్రకూ సరైన ప్రయోజనం లేకపోతే.. అది వ్యర్థ ప్రయత్నమే అవుతుంది.
‘టాక్సిక్’లో కథాకథనాలు ప్రేక్షకులకు తలపోటు తెప్పిస్తాయన్నది వాస్తవమే అయినా.. ఇందులో కొన్ని హైలైట్లు లేకపోలేదు. విడివిడిగా చూస్తే ‘టాక్సిక్’లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు వావ్ అనిపిస్తాయి. ముఖ్యంగా సర్కస్ నేపథ్యంలో వచ్చే ఫైట్ ను తీర్చిదిద్దిన తీరు వావ్ అనిపిస్తుంది. ఇక కొన్ని సీన్లలో హీరో ఎలివేషన్లు కూడా బాగానే పేలాయి. హాలీవుడ్ కల్ట్ మూవీ ‘ఫైట్ క్లబ్’ను గుర్తుకు తెచ్చే క్లైమాక్స్ ట్విస్టు కూడా కొంచెం క్రేజీగా అనిపిస్తుంది. వీటన్నింటికీ మించి పాత్ర కోసం ప్రాణం పెట్టేసిన యశ్ సూపర్ స్టైలిష్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. కానీ సరైన కథ లేని.. స్క్రీన్ ప్లే కుదరని సినిమాలో ఈ ఆకర్షణలన్నీ ఎందుకూ కొరగాకుండా పోయాయి. చూసిన సన్నివేశాలనే మళ్లీ చూస్తున్నట్లుగా అనిపిస్తూ కాసేపటికే ఒక మొనాటనస్ ఫీలింగ్ తీసుకొస్తుంది ‘టాక్సిక్’. అయితే హీరో మీద విలన్లు ఎటాక్ చేయడం.. లేదంటే అతను విలన్ల మీద ఎటాక్ చేయడం.. ఇదీ వరస. ఇది కాక ఒకరు మార్చి ఇంకొకరు హీరో జీవితంలోకి అమ్మాయిలు అడుగుపెట్టడం.. వారితో హీరో రొమాన్స్.. ఇదే కథ. టేకింగ్ స్టైలిష్ గా ఉన్నా.. కంటెంట్ మరీ వీక్ అయిపోవడంతో ‘టాక్సిక్’ ప్రేక్షకులకు తీవ్ర అసహనాన్నే మిగులుస్తుంది. ప్రథమార్ధం అయినా ఒక మోస్తరుగా అనిపిస్తుంది కానీ.. రెండో అర్ధం మాత్రం పూర్తిగా హద్దులు దాటిపోయి చివరి వరకు కూర్చోవడం కూడా కష్టమయ్యే పరిస్థితి వస్తుంది. ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నుంచి ఎంతో ఆశించే ప్రేక్షకులకు ‘టాక్సిక్’ ఒక చేదు జ్ఞాపకమే.
నటీనటులు: రాయ పాత్రలో యశ్ తన లుక్ నుంచి ప్రతి విషయంలోనూ శ్రద్ధ తీసుకున్నాడు. తన బాడీ లాంగ్వేజ్.. హావభావాలు.. ఓవరాల్ పెర్ఫామెన్స్ అన్నీ అదిరిపోయాయి. ఇందులో రెండు పాత్రలు చేసిన అతను.. రెంటిలో చూపించిన వేరియేషన్ ప్రశంసనీయం. ఐతే యశ్ ఎంత కష్టపడ్ప్పటికీ.. ఆ కష్టమంతా వృథా ప్రయాస అనిపిస్తుంది. సూపర్ స్టైలిష్ గా తనను తాను ప్రెజెంట్ చేసుకోవడంలో యశ్ పెట్టిన ఎఫర్ట్ గొప్పదే కానీ.. ఇలాంటి కథను ఓకే చేసి నిర్మాణంలో కూడా భాగస్వామి అవ్వడం చూస్తే యశ్ జడ్జిమెంట్ మీద సందేహాలు కలుగుతాయి. కియారా అద్వానీ గ్లామర్ తోనే కాక నటనతోనూ ఆకట్టుకుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం తన హావభావాలు చిత్రంగా అనిపిస్తాయి. యశ్ సోదరిగా గంగ పాత్రలో నయనతార ఆకట్టుకుంది. తారా సుతారియా నటన గురించి చెప్పడానికేమీ లేదు. ఆమె కూడా చాలా గ్లామరస్ గా కనిపించింది. హ్యూమా ఖురేషి ఓకే. రుక్మిణి వసంత్ నుంచి ఎంతో ఆశించే తన అభిమానులకు నిరాశ తప్పదు. సినిమాలోకి ఆమె ఎంట్రీ ఇచ్చే సమయానికే ప్రేక్షకులు విపరీతమైన అసహనంలో ఉంటారు. ఆమె పాత్ర.. నటన వల్ల సినిమాకు ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదు. సుదేవ్ నాయర్.. మిగతా ఆర్టిస్టులంతా తమ పరిధిలో బాగానే చేశారు.
సాంకేతిక వర్గం: ‘టాక్సిక్’ను బాగా ఖర్చు పెట్టి తీసిన విషయం ప్రతి సన్నివేశంలో కనబడుతూనే ఉంటుంది. 1950-80 మధ్య నడిచే కథలో ఆ వాతావరణానికి తగ్గట్లుగా సెట్స్ దగ్గర్నుంచి ప్రతి విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. బాగా ఖర్చు పెట్టి భారీగా సినిమాను తెరకెక్కించారు. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. విశాల్ మిశ్రా.. తనిష్క్ అందించిన పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. తబాహి సాంగ్ బాగున్నా.. అది ‘యానిమల్’ పాటను గుర్తుకు తెస్తుంది. రవి బస్రూర్ నేపథ్య సంగీతం మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. సన్నివేశాలు పేలవంగా ఉన్నపుడు బీజీఎం ఎలా దాన్ని ఎలివేట్ చేయగలదు? కొన్ని చోట్ల స్కోర్ ఉత్సాహం నింపినా.. కొన్ని చోట్ల చికాకు పెడుతుంది. రాజీవ్ రవి ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ అదిరిపోయాయి. తిరుగులేని ఇమేజ్ ఉన్న హీరో.. ఎంతైనా ఖర్చు పెట్టే నిర్మాత.. టాప్ క్లాస్ టెక్నీషియన్లు.. ఇలా అన్నీ సమకూరినా.. రైటర్ కమ్ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ ఉపయోగించుకోలేకపోయింది. అర్థం పర్థం లేని కథాకథనాలతో.. టార్చర్ పెట్టే సన్నివేశాలతో ప్రేక్షకులకు చుక్కలు చూపించింది. స్టైలిష్ టేకింగ్ విషయంలో తప్పితే ఆమె ఏ రకంగానూ మెప్పించలేకపోయింది.
చివరగా: టాక్సిక్.. నిజంగా టాక్సికే
రేటింగ్ - 2/5
