రొమాన్స్‌కు కొత్త డెఫినిషన్.. టాక్సిక్ లో యష్- కియారా కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా
తబాహీకు విశాల్ మిశ్రా మ్యూజిక్ అందించడంతో పాటు స్వయంగా ఆయనే ఈ పాటను ఆలపించారు.
By: Sravani Lakshmi Srungarapu | 8 July 2026 1:17 PM ISTపాన్ ఇండియా స్టార్ యష్ హీరోగా, డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ నుంచి మొదటి వీడియో సాంగ్ తబాహీ ఆడియన్స్ ముందుకొచ్చింది. ఇప్పటికే ఆడియోతో ఆసక్తి పెంచిన ఈ సాంగ్ కు ఇప్పుడు రిలీజైన విజువల్ వెర్షన్ మరింత హైప్ తీసుకొచ్చింది. ముఖ్యంగా యష్, కియారా అద్వానీ మధ్య చూపించిన రొమాంటిక్ సీన్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
సాంగ్ స్టార్టింగ్ లో ప్రముఖ సూఫీ కవి రూమీ రాసిన "సరైనది-తప్పు అనే భావనలకు అతీతంగా ఒక ప్రపంచం ఉంది... అక్కడ నిన్ను కలుస్తాను" అనే కోట్ వినిపించడం విశేషం. ఆ భావాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ సాంగ్ లవ్, ఎమోషన్, ఎట్రాక్షన్ కలగలిసిన విజువల్స్ కనిపిస్తున్నాయి. భారీ స్థాయి సెట్స్, స్టైలిష్ ఫ్రేమ్స్, గ్రాండ్ సినిమాటోగ్రఫీతో టాక్సిక్ ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేశారు. ఈ వీడియోలో యష్, కియారా మాత్రమే కాకుండా నయనతార, తారా సుతారియా కూడా కాసేపు కనిపించారు. కథలో వారి పాత్రలపై ఆసక్తిని పెంచేలా కొన్ని కీలక షాట్లను మాత్రమే చూపించారు. దీంతో సినిమా కథ ఎలాంటి మలుపులు తిరగబోతోందన్న డిస్కషన్ మొదలైంది.
తబాహీకు విశాల్ మిశ్రా మ్యూజిక్ అందించడంతో పాటు స్వయంగా ఆయనే ఈ పాటను ఆలపించారు. హిందీ సాహిత్యాన్ని రాజ్ శేఖర్ రాయగా, కన్నడలో యోగరాజ్ భట్, తెలుగులో రామజోగయ్య శాస్త్రి, తమిళంలో విఘ్నేష్ శివన్, మలయాళంలో రఫీఖ్ అహ్మద్ సాహిత్యం అందించారు. ఒకేసారి పలు ఇండియన్ లాంగ్వేజెస్ లో ఈ సాంగ్ ను రిలీజ్ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
వీడియో రిలీజ్ కు ముందు మేకర్స్ సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం నిర్వహించింది. దొంగచాటుగా మాత్రమే బ్రతికే ప్రేమను ఏమంటారు? అనే ప్రశ్నకు కియారా అద్వానీ తబాహీ అని ఒక్క మాటతో రెస్పాండ్ అవగా, అదే ప్రమోషన్ కు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తర్వాత రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సాంగ్ లో యష్- కియారా మధ్య కనిపించిన కెమిస్ట్రీపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత యష్‌ను పూర్తిస్థాయి రొమాంటిక్ అవతారంలో చూడటం ఆనందంగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో యష్, కియారా అద్వానీతో పాటు నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, టోవినో థామస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళంతో పాటు మరిన్ని భాషల్లో డబ్ అయి ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
