ముందుగానే ఓటీటీలోకి వచ్చేసిన నరివెట్ట మూవీ
బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
By: Tupaki Desk | 10 July 2025 7:53 PM ISTటాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంటున్న మలయాళ నటుల్లో టొవినో థామస్ ఒకరు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం నరివెట్ట. మే నెలలో రిలీజైన ఈ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మంచి టాక్ తో విమర్శకులను సైతం మెప్పించిన నరివెట్ట తెలుగులో తోడేలు వేట పేరుతో రిలీజై మంచి టాక్ నే అందుకుంది.
బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. వాస్తవానికి ఈ సినిమా జులై 11 నుంచి స్ట్రీమింగ్ కు రావాల్సింది కానీ అనుకున్న సమయానికంటే ఓ రోజు ముందే నరివెట్ట డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించిన 2003లో కేరళలోని ముత్తంగ అనే అటవీ ప్రాంతంలో ఆదివాసీలపై పోలీసులు జరిపిన ఊచకోత నేపథ్యంలో నాటి యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.
అప్పటివరకు ఎలాంటి పని లేకుండా ఫ్రెండ్స్, ప్రేమ అంటూ కాలక్షేపం చేసే వర్గీస్ పీటర్ అయిష్టం తోనే కానిస్టేబుల్ గా చేరుతాడు. ఆయన వర్క్ చేసే స్టేషన్ దగ్గరలోని అడవిలో అక్రమంగా ఉంటున్న ట్రైబల్స్ ను వెళ్లగొట్టి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రభుత్వం అనుకుంటుంది. కానీ గిరిజనులు అందుకు అంగీకరించకపోవడంతో పోలీసులకు ఎదురు తిరగడంతో అల్లర్లు జరుగుతాయి. ఆ టైమ్ లో అప్పుడే డ్యూటీలో జాయిన్ అయిన కానిస్టేబుల్ వర్గీస్ పీటర్ కూడా అక్కడి పోలీసులతో కలిసి ఆ ఆదివాసీల గ్రామాన్ని చుట్టుముడతారు. ఆ క్రమంలో జరిగిన దాడిలో ఓ గిరిజన వ్యక్తి పోలీసుల తూటాకు చనిపోవడంతో ఆ కేసులో వర్గీస్ పీటర్ ను అరెస్ట్ చేసి కేసులు పెడతారు.
అసలు ఆ గిరిజన వ్యక్తి మర్డర్ కు, వర్గీస్ కు సంబంధముందా? లేక కావాలనే ఎవరైనా వర్గీస్ ను టార్గెట్ చేసి ఇరికించారా? ఆ ఆదివాసీని అసలు ఎందుకు షూట్ చేయాల్సి వచ్చింది? అసలు వర్గీస్ ఏం చేశాడు? చివరకు పోలీసులు ఆ గ్రామాన్ని స్వాధీనం చేసుకోగలిగారా లేదా అనే ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో సినిమా సాగుతుంది. సినిమా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఎన్నో థ్రిల్స్ ఇస్తూ ఉంటుంది. ఇంత మంచి సినిమా ఇప్పుడు సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. జులై 10 మధ్యాహ్నం నుంచే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళంతో పాటూ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.
