Begin typing your search above and press return to search.

అత్యధిక జాతీయ పుర‌స్కారాల‌తో టాప్ -10 స్టార్లు

ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో జాతీయ అవార్డులను గెలుచుకున్న టాప్ 10 నటుల జాబితాను ప‌రిశీలిస్తే తెలిసిన సంగ‌తులు..

By:  Tupaki Desk   |   22 May 2024 3:45 AM GMT
అత్యధిక జాతీయ పుర‌స్కారాల‌తో టాప్ -10 స్టార్లు
X

జాతీయ చలనచిత్ర అవార్డు లేదా రజత్ కమల్ అవార్డు.. ప్రతి భారతీయ స్టార్ అలాంటి ఒక పుర‌స్కారం త‌మ‌కు ద‌క్కాల‌ని కోరుకుంటారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన అవార్డులను పక్కన పెడితే దేశంలోని ప్ర‌తిష్ఠాత్మ‌క జాతీయ‌ అవార్డును అందుకోవ‌డం నిజానికి గర్వకారణంగా చూస్తారు. 1954లో 'స్టేట్ అవార్డ్స్ ఫర్ ఫిల్మ్స్' అని పిలిచేవారు.. కాల‌క్ర‌మంలో జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకగా మారింది. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కంటే పాతది 'స్టేట్ అవార్డ్స్ ఫర్ ఫిల్మ్స్'. జాతీయ‌ అవార్డు అనేది హిందీ, మలయాళం, తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ స‌హా ప‌లు పాపుల‌ర్ భాషలలో పనిచేసిన నటీన‌టులకు అందిస్తున్నారు. ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో జాతీయ అవార్డులను గెలుచుకున్న టాప్ 10 నటుల జాబితాను ప‌రిశీలిస్తే తెలిసిన సంగ‌తులు..


ఐదు సార్లు జాతీయ అవార్డులు అందుకుని న‌టి షబానా అజ్మీ టాప్ -1 స్థానంలో ఉన్నారు. పరిశ్రమలో అసాధార‌ణ న‌టిగా, ప్ర‌యోగాత్మక పాత్ర‌ల‌తో అల‌రించిన మేటి తార‌గా ష‌బానాకు గొప్ప గౌర‌వం ఉంది. ష‌బానా ప్రతిష్టాత్మక జాతీయ‌ అవార్డును అత్యధిక సార్లు గెలుచుకున్నారు. అంకుర్, అర్థ్, ఖంధర్, పార్, గాడ్ మదర్ చిత్రాలలో ష‌బానా నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డుల‌ను గెలుచుకున్నారు. కెరీర్ ప్ర‌యోగాల్లో చెప్పుకోద‌గ్గ పాత్ర‌ల‌లో ష‌బానా స్వ‌లింగ సంప‌ర్కురాలిగాను న‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.


నాలుగు సార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్న న‌టుడు అమితాబ్ బచ్చన్. ఇండస్ట్రీలోని యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పాపుల‌రైన అమితాబ్ మొదటి నుంచి ఇండస్ట్రీని ప్రభావితం చేస్తూనే ఉన్నారు. ఆయ‌న‌ అగ్నిపథ్‌, బ్లాక్, పా, పికు చిత్రాలలో తన నటనకు ఉత్తమ నటుడిగా నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు.


అమితాబ్ త‌ర్వాత నాలుగు జాతీయ అవార్డులు అందుకుని కంగనా రనౌత్ రికార్డుల‌కెక్కారు. పరిశ్రమలో అసాధార‌ణ ప్ర‌తిభావంతురాలిగా కంగ‌న‌కు గొప్ప ఫాలోయింగ్ ఉంది. భారతదేశం గ‌ర్వించ‌ద‌గిన నటిగా పేరున్న కంగ‌న వివాదాలతోను పాపుల‌రైంది. ఫ్యాషన్, క్వీన్, తను వెడ్స్ మను రిటర్న్, మణికర్ణికలో అద్భుత నటనకు 4 సార్లు జాతీ అవార్డుల‌ను గెలుచుకుంది.


మూడేసి జాతీయ అవార్డులు అందుకున్న వారిలో అర‌డ‌జ‌ను పైగానే స్టార్లు ఉన్నారు. టాలీవుడ్ కోలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా సత్తా చాటిన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ మూడుసార్లు జాతీయ‌ అవార్డును గెలుచుకున్నారు. మూండ్రమ్ ప‌రాయ్, నాయకన్, ఇండియన్ (భార‌తీయుడు) చిత్రాల్లో తన నటనకు ఈ గొప్ప గౌర‌వాన్ని అందుకున్నారు. క‌ళాదుర్ క‌న్న‌మ్మ చిత్రంలో న‌ట‌న‌కు గాను ఉత్త‌మ బాల‌నటుడిగా అవార్డును అందుకున్నారు. ద‌శావ‌తారంలో ప‌ది పాత్ర‌లతో మెప్పించిన క‌మ‌ల్ ఇంద్రుడు చంద్రుడు, నాయ‌క‌న్ వంటి చిత్రాల్లోను అద్భుత న‌ట‌న‌తో ఆకట్టుకున్నారు.


మ‌ల‌యాళీ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు. మ‌రో మాలీవుడ్ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కు రెండు జాతీయ అవార్డులు ద‌క్కాయి. కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ రెండు జాతీయ అవార్డులు (ఆడుక‌ళం, అసుర‌న్ ల‌కు) అందుకున్నాడు.


నానా పటేకర్ మూడు సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు నానా హృదయాలను గెలుచుకోవడమే కాకుండా దేశం గ‌ర్వించ‌ద‌గిన న‌టుడిగా ఖ్యాతి ఘ‌డించారు. పరిందా, అగ్ని సఖి, క్రాంతివీర్ చిత్రాల్లో న‌ట‌న‌కు గాను నానా ప‌టేక‌ర్ జాతీయ పుర‌స్కారాల‌ను గెలుచుకున్నాడు. క‌మ‌ల్ హాస‌న్, నానా ప‌టేక‌ర్, పంక‌జ్ క‌పూర్ త‌ర‌హాలోనే వెట‌ర‌న్ స్టార్ మిథున్ చక్రవర్తి 3 సార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు.


మృగయా, తహదీర్ కథ, స్వామి వివేకానంద వంటి సినిమాల్లో తన నటనకు గాను మిథున్ 3 సార్లు ఈ అవార్డును అందుకున్నారు. మ‌రో సీనియ‌ర్ న‌టుడు నసీరుద్దీన్ షా 3 సార్లు జాతీయ పుర‌స్కారాలు గెలుచుకున్నారు. నసీరుద్దీన్ షా జాతీయ అవార్డులతో గొప్ప పాపులారిటీని సంపాదించిన న‌టుడు. బహుముఖ ప్ర‌జ్ఞా శాలి. ఇక్బాల్, పార్, స్పర్ష్ చిత్రాల్లో న‌ట‌న‌కు గాను మూడు సార్లు జాతీయ అవార్డుల‌ను గెలుచుకున్నారు. ప‌లు టీవీ సీరియల్స్‌లో కనిపించిన పాపుల‌ర్ స్టార్ పంక‌జ్ క‌పూర్ పెద్ద తెర‌పైనా గొప్ప‌గా రాణించారు. అత‌డు మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. మక్బూల్, ఏక్ డాక్టర్, రాఖ్ చిత్రాల్లో న‌ట‌న‌కు గాను పంక‌జ్ జాతీయ పుర‌స్కారాల‌ను గెలుచుకున్నాడు.


బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, ట‌బు రెండేసి జాతీయ అవార్డులు ద‌క్కించుకున్నారు. యాక్షన్ హీరోగా పాపుల‌రైన దేవ‌గ‌న్ 2 సార్లు జాతీయ పుర‌స్కారాల‌ను గెలుచుకున్న టాప్ హీరో. జ‌క్మ్- ది లెజెండ్ ఆఫ్ భ‌గ‌త్ సింగ్ చిత్రాల్లో న‌ట‌న‌కు గాను ఉత్త‌మ న‌టుడిగా అజ‌య్ దేవ‌గ‌న్ జాతీయ పుర‌స్కారాలు అందుకున్నారు. తానాజీకి నిర్మాత‌గా జాతీయ పుర‌స్కారం ద‌క్కించుకున్నారు. సీనియ‌ర్ న‌టి ట‌బు రెండు సార్లు ఉత్త‌మ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును కైవసం చేసుకున్నారు. జాతీయ పుర‌స్కారాలు అందుకున్న త‌ర్వాత‌ బాలీవుడ్ ఎ లిస్టర్‌ల జాబితాలో ట‌బు పేరు స్థిరంగా నిలిచింది. మాచిస్ -చాందినీ బార్ చిత్రాల్లో న‌ట‌న‌కు గాను ట‌బు జాతీయ అవార్డులు గెలుచుకుంది.