Begin typing your search above and press return to search.

పెళ్ల‌యిన హీరోయిన్ల పారితోషికాలు స్కైలో

అలాంటిది మ్యారీడ్ హీరోయిన్ల‌కు అవ‌కాశాలివ్వ‌డ‌మే కాకుండా భారీ పారితోషికాలు ముట్ట‌జెప్ప‌డం మారిన ట్రెండ్ ని ఆవిష్క‌రిస్తోంది.

By:  Tupaki Desk   |   23 Feb 2024 4:15 AM GMT
పెళ్ల‌యిన హీరోయిన్ల పారితోషికాలు స్కైలో
X

పారితోషికంలో పెళ్ల‌యిన క‌థానాయిక‌ల డామినేషన్ స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. దీపిక ప‌దుకొనే- క‌త్రిన కైఫ్‌-ఐశ్వ‌ర్యారాయ్- అనుష్క శ‌ర్మ, ఆలియా భ‌ట్- కియ‌రా అద్వాణీ- స‌మంత‌.. వీళ్లంతా పెళ్ల‌యిన క‌థానాయిక‌లే అయినా కానీ పారితోషికాల్లో స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా ఎదిగారు. ఒక‌ప్ప‌టితో పోలిస్తే ట్రెండ్ మారింది అన‌డానికి ఇది ఉదాహ‌ర‌ణ‌. ఇంత‌కుముందు పెళ్ల‌యిన హీరోయిన్ల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డ‌మే క‌ష్టంగా ఉండేది. అలాంటిది మ్యారీడ్ హీరోయిన్ల‌కు అవ‌కాశాలివ్వ‌డ‌మే కాకుండా భారీ పారితోషికాలు ముట్ట‌జెప్ప‌డం మారిన ట్రెండ్ ని ఆవిష్క‌రిస్తోంది.

ముఖ్యంగా బాలీవుడ్ లో అవ‌కాశాలు అందుకునేందుకు న‌టీమ‌ణుల‌కు బిఫోర్ మ్యారేజ్.. ఆఫ్ట‌ర్ మ్యారేజ్ అనే అడ్డంకి లేనే లేదు. అక్క‌డ‌ నటీమ‌ణుల పారితోషికాలు స్కైలో ఉన్నాయి.. 2023లో అత్యధిక పారితోషికం పొందిన భారతీయ క‌థానాయిక‌ల‌ జాబితాను ప‌రిశీలిస్తే ఈ జాబితాలో ప్రియాంక చోప్రా పేరు నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది. కాస్ట్ లీ హీరోయిన్ల‌ జాబితాలో పెళ్ల‌యిన క‌థానాయిక‌ల‌దే అగ్ర‌తాంబూలం.

ప్రియాంక చోప్రా జోనాస్

ఐ.ఎం.డి.బి ప్రకారం.. ప్రియాంక చోప్రా జోనాస్ ఒక్కో సినిమా లేదా సిరీస్ కు రూ. 15 కోట్ల నుండి రూ. 40 కోట్లు వసూలు చేస్తోంది. బాలీవుడ్ లో అగ్ర క‌థానాయిక‌గా వెలుగొందుతున్న స‌మ‌యంలోనే పీసీ అక‌స్మాత్తుగా హాలీవుడ్ కి వెళ్లిపోయింది. హిందీ చిత్ర‌సీమ పెద్ద‌లు త‌నపై కుట్ర‌లు చేయడంతో కొత్త దారిని వెతుక్కున్నాన‌ని కూడా ప్రియాంక చోప్రా ఒక ఇంట‌ర్వ్యూలో అంగీక‌రించింది. హాలీవుడ్ లో ప‌లు సినిమాలు స‌హా వెబ్ సిరీస్ ల‌లోను న‌టిస్తోంది. సిటాడెల్ సిరీస్ లో న‌టించినందుకు పీసీ భారీ ప్యాకేజీ అందుకుంద‌ని స‌మాచారం.

దీపికా పదుకొనే

ప‌ద్మావ‌త్ సినిమాతో 600 కోట్ల క్ల‌బ్ నాయిక‌గా స‌త్తా చాటింది దీపిక ప‌దుకొనే. ఈ బ్యూటీ 5 జనవరి 1986న జన్మించారు. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరిగా వెలుగొందుతోంది. ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల నుండి రూ. 30 కోట్లు తీసుకుంటోంది. ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టిస్తున్న పాన్ ఇండియ‌న్ సినిమా ప్రాజెక్ట్ కె కోసం 20కోట్లు డిమాండ్ చేసింద‌ని ప్ర‌చారం సాగింది.

కంగనా రనౌత్

క్వీన్ స్టార్ కంగనా రనౌత్ ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల నుంచి రూ.27 కోట్లు వసూలు చేస్తూ దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు పొందింది. అయితే ఇటీవ‌ల త‌లైవి- ధ‌డ‌క్, తేజ‌స్ లాంటి ఫ్లాప్ సినిమాల‌తో రేసులో వెన‌క‌బ‌డింది. ఎమ‌ర్జెన్సీ సినిమాని స్వీయ‌నిర్మాణంలో రూపొందిస్తున్న కంగ‌న తిరిగి ఈ మూవీతో క్రేజీ కంబ్యాక్ సాధ్య‌మ‌వుతోంద‌ని క‌ల‌లు కంటోంది.

కత్రినా కైఫ్

జిందగీ నా మిలేగీ దొబారా స్టార్ కత్రినా కైఫ్ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నటీమణులలో ఒకరు. మ‌ల్లీశ్వ‌రి చిత్రంతో టాలీవుడ్ కి సుప‌రిచిత‌మైన ఈ భామ బాలీవుడ్ అగ్ర నాయిక‌గా నేటికీ హ‌వా సాగిస్తోంది. ఐఎండిబి ప్రకారం క‌త్రిన‌ ఒక్కో సినిమాకు 15 కోట్ల నుండి 21 కోట్ల రూపాయలు తీసుకుంటుంది.

ఆలియా భ‌ట్

2014 నుండి ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో కనిపించిన యువ‌న‌టి ఆలియా భ‌ట్‌. రణ్‌బీర్ కపూర్‌ను వివాహం చేసుకున్న అలియా భట్ ఒక్కో సినిమాకు 12 కోట్ల నుండి 20 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన ఆలియాకు సౌత్ లోను విరివిగా అవ‌కాశాలొస్తున్నాయి.

అనుష్క శర్మ

ఐఎండిబి నివేదిక ప్రకారం.. అనుష్క శర్మ ఒక సినిమాకు 8 కోట్ల నుండి 12 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుంది. న‌టి నిర్మాతగా వ్యాపార‌వేత్తగా స‌త్తా చాటుతున్నా అనుష్క శ‌ర్మ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఒక బిడ్డ పుట్టాక సంసార జీవ‌నాన్ని బ్యాలెన్స్ చేస్తూ సినిమాల్లో న‌టిస్తోంది.

ఐశ్వర్య రాయ్ బచ్చన్

బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన నటీమణులలో ఒకరైన ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు తీసుకుంటుంది. పెళ్లి త‌ర్వాత ఐష్ కెరీర్ ఎందుక‌నో ఆశించిన స్థాయిలో లేదు. చాలా ఫ్లాపుల్ని ఎదుర్కొని రేసులో పూర్తిగా వెన‌క‌బ‌డింది. ఇటీవ‌లే మ‌ణిర‌త్నం పొన్నియ‌న్ సెల్వ‌న్ ఫ్రాంఛైజీలో న‌టించి తిరిగి న‌టిగా గొప్ప గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఒక్కో సినిమాకి 10కోట్లకు త‌గ్గ‌కుండా అందుకుంటోంద‌ని స‌మాచారం.

నయనతార

నయనతార దక్షిణ భారత ఇండ‌స్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన అగ్ర‌ క‌థానాయిక‌. త‌లైవిగా అభిమానం అందుకుంది. షారుఖ్ ఖాన్ స‌ర‌స‌న 'జ‌వాన్‌'లో న‌టిస్తూ ఉత్త‌రాదినా హాట్ టాపిక్ గా మారింది. నయనతార ఒక్కో సినిమాకు 2 కోట్ల నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటుంది. ప్రాజెక్ట్ స్థాయిని బ‌ట్టి పారితోషికం అడుగుతోంది.

సమంత రూత్ ప్రభు

సమంతా రూత్ ప్రభు ప్రధానంగా తెలుగు - తమిళ చిత్ర పరిశ్రమలలో పనిచేస్తుంది. ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ ఘ‌న‌విజ‌యంతో అంతా మారింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ చిత్రాల‌కు సంత‌కాలు చేస్తోంది. పారితోషికం ఒక్కో సినిమా/సిరీస్‌కు రూ.3 కోట్ల నుంచి రూ.8 కోట్లు అందుకుంటోంది.

విద్యా బాల‌న్

సీనియ‌ర్ న‌టి విద్యాబాల‌న్ 8 కోట్ల నుంచి 14 కోట్ల మ‌ధ్య అందుకుంటోంది. డ‌ర్టీ పిక్చ‌ర్ చిత్రంతో 100 కోట్ల క్ల‌బ్ నాయిక అయిన బాల‌న్ ఇటీవ‌ల వెబ్ సిరీస్ ల‌లోను న‌టిస్తోంది. సినిమాల కోసం భారీ పారితోషికం అందుకుంటోంది.

కియ‌రా అద్వాణీ

బాలీవుడ్ లో అత్యంత వేగంగా ఎదిగేసిన క‌థానాయికగా కియ‌రాకు గుర్తింపు ఉంది. ఈ భామ హీరో సిద్ధార్థ్ మ‌ల్హోత్రాను పెళ్లాడింది. పెళ్లి త‌ర్వాత వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. ఒక్కో సినిమాకు 4 కోట్లు పైగా అందుకుంటోంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌- శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న గేమ్ ఛేంజ‌ర్ లో కియ‌రా న‌టిస్తోంది.

శ్ర‌ద్ధా క‌పూర్

'సాహో' చిత్రంతో సౌత్ కి కూడా ప‌రిచ‌య‌మైన శ్ర‌ద్ధా క‌పూర్ కెరీర్ ప‌రంగా ఇటీవ‌ల ఆచితూచి సినిమాల్లో న‌టిస్తోంది. కానీ పారితోషికంలో హైలో ఉంది. ఈ భామ ఒక్కో సినిమాకు 7 కోట్ల నుంచి 15 కోట్ల మ‌ధ్య‌లో అందుకుంటోంది. ఇంకా పెళ్లి కాక‌పోయినా శ్ర‌ద్ధా ఎఫైర్ల గురించి విస్త్ర‌తంగా చ‌ర్చ సాగింది.