Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: రీమేక్‌లు తీయ‌డంలో స్పెష‌లిస్ట్‌ నిర్మాత‌లు

అయితే ఇటీవ‌ల ట్రెండ్ మారింది. రీమేక్ ల కంటే ఒరిజిన‌ల్ క‌థ‌ల్ని సృష్టించేందుకు ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. రీమేక్‌ల కంటే పాన్-ఇండియా సినిమాల ట్రెండ్ ఉత్కంఠ‌ను పెంచుతోంది.

By:  Sivaji Kontham   |   13 Feb 2026 4:00 PM IST
టాప్ స్టోరి: రీమేక్‌లు తీయ‌డంలో స్పెష‌లిస్ట్‌ నిర్మాత‌లు
X

ఒరిజిన‌ల్ క‌థ‌ల్ని తెర‌కెక్కించే కంటే రీమేక్ ల‌తోనే సేఫ్ అని భావించే నిర్మాత‌లు ఉన్నారు. మార్కెట్ క్యాలిక్యులేష‌న్ లో వీరంతా ఉద్ధండులు. నిజానికి రీమేక్‌లు చేయడం అనేది ఒక సురక్షితమైన వ్యాపార వ్యూహంగా నిర్మాత‌లు భావిస్తున్నారు. కథా బలమున్న సినిమాలను స్థానిక భాషల్లోకి మార్చి విజయాలు సాధించడంలో సిద్ధహస్తులైన టాప్ 5 భార‌తీయ‌ నిర్మాతల వివ‌రాలు ప‌రిశీలిస్తే.. ఈ జాబితాలో టాలీవుడ్ నిర్మాత డి.సురేష్ బాబు, బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్, టి సిరీస్ భూష‌ణ్ కుమార్ త‌దిత‌రులు టాప్ -3లో ఉన్నారు.

టాలీవుడ్‌లో రీమేక్‌ల నిర్మాత‌గా డి. సురేష్ బాబు అనుభ‌వం సుదీర్ఘ‌మైన‌ది. ఆయనకు ఒక సినిమా కథ ఏ భాషలోనైనా వర్కవుట్ అవుతుందా లేదా అని అంచనా వేయడంలో అద్భుతమైన జడ్జిమెంట్ ఉంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లో చాలా సినిమాల‌ను ఆయ‌న రీమేక్ చేసారు. ఇటు తెలుగులో, అటు హిందీలోను రీమేక్ చిత్రాల‌ను నిర్మించిన అనుభ‌వం ఆయ‌న సొంతం. గ‌డిచిన‌ దశాబ్ద కాలంలో (2016-2026) డి. సురేష్ బాబు ప‌దుల సంఖ్య‌లో రీమేక్ లు చేసారు. వాటి వివ‌రాల్లోకి వెళితే... త‌మిళ సినిమా అసురన్`ని తెలుగులో `నార‌ప్ప పేరు రీమేక్ చేసారు. వెంక‌టేష్ టైటిల్ పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు బాక్సాఫీస్ విజయం ద‌క్కింది. ఇక ఆల్ టైమ్ మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీ `దృశ్యం` రీమేక్ ల‌ను వెంకీ హీరోగా డి.సురేష్ బాబు నిర్మిస్తున్నారు. చివ‌రిగా ఫ్రాంఛైజీలో దృశ్యం 2 ని ఆయ‌న రీమేక్ చేసారు. త‌దుప‌రి దృశ్యం 3ని కూడా రీమేక్ చేసే ఛాన్సుంది. కొరియన్ సినిమా మిడ్ నైట్ రన్నర్స్ రీమేక్ గా `శాకిని డాకిని` (2022)ని సురేష్ బాబు నిర్మించారు. అంత‌కుముందు తమిళ చిత్రం `ఇరుది సుట్రు`ని తెలుగులో గురు (2017) పేరుతో రీమేక్ చేసారు. శ‌ర‌త్ మ‌రార్ తో క‌లిసి బాలీవుడ్ చిత్రం `ఓ మై గాడ్ ని తెలుగులో వెంకీ- ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సురేష్ బాబు `గోపాల గోపాల` పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇవి మ‌చ్చుకు కొన్ని మాత్ర‌మే. ప‌దుల సంఖ్య‌లో సినిమాల‌ను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ తెలుగులోకి రీమేక్ చేసింది.

బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీక‌పూర్ ఎక్క‌డ ఏ బెస్ట్ హిట్ సినిమా ఉన్నా, దాని రీమేక్ రైట్స్ కొనుగోలు చేయ‌డంలో బోనీక‌పూర్ సిద్ధ‌హ‌స్తుడు. గత ఐదేళ్లుగా ఆయన తమిళం (కోలీవుడ్) పై ఎక్కువ దృష్టి పెట్టారు. అజిత్ కుమార్‌తో ఆయన చేసిన సినిమాలు కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. గత దశాబ్ద కాలంలో (2016-2026) బోనీ రీమేక్ ల చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే... హిందీ బ్లాక్ బ‌స్ట‌ర్ పింక్ చిత్రాన్ని నేర్కొండ పార్వాయి (2019) పేరుతో త‌మిళంలో రీమేక్ చేసారు. తెలుగులో ఇదే చిత్రాన్ని వ‌కీల్ సాబ్ పేరుతో ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. హిందీ చిత్రం `ఆర్టికల్ 15`ని నెంజుకు నీధి (2022) పేరుతో త‌మిళంలో రీమేక్ చేసారు. బాలీవుడ్ చిత్రం `బదాయి హో`ని వీట్ల విశేషం (2022) పేరుతో రీమేక్ చేసారు.

అలాగే టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్, బాలీవుడ్ అగ్ర నిర్మాత‌ భూషణ్ కుమార్ తో క‌లిసి ప‌లు రీమేక్ లు తెర‌కెక్కించారు. అల్లు అరవింద్ సౌత్ సినిమాలను బాలీవుడ్ కి తీసుకెళ్లడంలో ఎప్పుడూ ముందుంటారు. గజినీ`తో బాలీవుడ్‌లో 100 కోట్ల క్లబ్ మొదలుపెట్టిందే ఆయన. గత దశాబ్ద కాలంలో (2016-2026) అల్లు అర‌వింద్ నిర్మించిన రీమేక్ సినిమాల జాబితాను ప‌రిశీలిస్తే.. తెలుగు సినిమా జెర్సీని అదే పేరుతో హిందీలోను 2022లో రీమేక్ చేసారు. తెలుగులో విడుద‌లైన క్లాసిక్ హిట్ చిత్రం అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాన్ని హిందీలో షెహజాదా (2023) పేరుతో రీమేక్ చేసారు. త‌మిళ చిత్రం వీరం ని హిందీలో `కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ (2023) పేరుతో రీమేక్ చేసారు. స‌ల్మాన్ ఈ చిత్రంలో క‌థ‌నాయ‌కుడు. కానీ ఈ మూడు ప్ర‌య‌త్నాలు ప‌రాజ‌యాల‌తో నిరాశ‌ప‌రిచాయి.

రీమేక్ లు చేయ‌డం అంటే స‌వాల్ తో కూడుకున్న‌ది. అనువాదం లేదా త‌ర్జూమా చేయాలంటే దానిలో ప్ర‌మాదాలు ఉంటాయి. అయితే ఈ సీనియ‌ర్ నిర్మాతలందరూ కేవలం కథను కాపీ చేయడం కోసం కాకుండా.. ఆయా భాషల నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేయడంలో సిద్ధహస్తులు. ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర‌నిర్మాత‌ దిల్ రాజు పింక్ సినిమాను పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా `వకీల్ సాబ్`గా రీమేక్ చేయ‌డం ఒక పెద్ద సక్సెస్ స్టోరీ.. ఆయ‌న బోనీతో క‌లిసి ఈ ప్ర‌య‌త్నం చేసారు.

అయితే ఇటీవ‌ల ట్రెండ్ మారింది. రీమేక్ ల కంటే ఒరిజిన‌ల్ క‌థ‌ల్ని సృష్టించేందుకు ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. రీమేక్‌ల కంటే పాన్-ఇండియా సినిమాల ట్రెండ్ ఉత్కంఠ‌ను పెంచుతోంది.